అటు ప్రచార వ్యూహం ఇటు ప్రలోభాల పథకం

ABN , First Publish Date - 2021-02-28T07:06:26+05:30 IST

జిల్లాలో మార్చి పదవ తేదీన ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పార్టీలు ప్రచార వ్యూహాలకు పదును పెంచాయి.

అటు ప్రచార వ్యూహం  ఇటు ప్రలోభాల పథకం

ముంచుకొస్తున్న మున్సిపల్‌ ఎన్నికల గడువు 

పోలింగ్‌కు ఇంకా పది రోజులే వ్యవధి

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచార వ్యూహాలతో టీడీపీ, ప్రలోభాల పథకాలతో వైసీపీ రెడీ

వార్డుల్లో సామాజికవర్గాల వారీగా అధికారపార్టీ నేతలు, అభ్యర్థుల వరుస సమావేశాలు

మున్సిపల్‌ ఎన్నికల సమరానికి ముహూర్తం    ముంచుకొస్తుండడంతో పార్టీలు ప్రచార వ్యూహాల్లో తల  మునకలయ్యాయి. పోలింగ్‌కు సరిగ్గా పది రోజులే వ్యవధి ఉండడంతో నువ్వానేనా అన్నట్టు వ్యూహప్రతివ్యూహాలతో కదులుతున్నాయి. ఇటు అధికారం చేతిలో ఉన్నందున అన్ని రకాల అస్త్రాలు ప్రయోగించి మున్సిపాల్టీల్లో పాగా వేయాలని వైసీపీ కార్యాచరణ రచిస్తోంది. బెదిరింపులు, ప్రలోభాల పథకాలతో దూకుడుగా కదులుతోంది. అటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కంచుకోటల్లో మళ్లీ విజయదుందుభి మోగించాలని టీడీపీ కాలు దువ్వుతోంది. ఇలా ఇరుపార్టీలు వేటికవే ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఇక పంచాయతీ ఎన్నికల్లో విజయం ఇచ్చిన ఊపుతో కొంత తడాఖా చూపించాలని జనసేన ఉవ్విళ్లూరుతోంది. 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో మార్చి పదవ తేదీన ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పార్టీలు ప్రచార వ్యూహాలకు పదును పెంచాయి. సమయం కూడా చాలా తక్కువగా ఉండడంతో వేటికవే ప్రత్యేక ప్రణాళికలతో కదులుతున్నాయి. గత మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ దాదాపు అన్నిచోట్లా క్లీన్‌స్వీప్‌ చేసిన నేపథ్యంలో ఈసారి అధికారం చేతిలో ఉండడంతో ఆ రికార్డును తిరగరాయడానికి వైసీపీ ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం ఎక్కడికక్కడ ప్రలోభాల పథకాలతో దూకుడుగా వెళ్తోంది. 80 శాతం మున్సిపాల్టీలు గెలవాలని అధిష్ఠానం ఆదేశించడంతో ఎక్కడికక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని మున్సిపాల్టీలను చేజిక్కించుకోవడం కోసం నేరుగా రంగంలోకి దిగారు. వార్డులవారీగా ఏం చేయాలనేదానిపై నేతలతో సమావేశాలు నిర్వహి స్తూ అమలుచేయాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. అందులోభాగంగా ఉదయం వేళల్లో వైసీపీ కౌన్సిలర్‌ అభ్య ర్థులు ప్రచారం పనులు చేస్తుండగా, రాత్రివేళల్లో తమ నేతలతో కలిసి ఏకగ్రీవాల ప్రణాళికలు అమలు చేస్తున్నారు. బుధవారం టీడీపీ అభ్యర్థులు ఎక్కువచోట్ల నామినేషన్లు విత్‌డ్రా అయ్యేలా చేయడానికి నగదు, ఇతర ప్రలోభాల ఆఫర్లు ఇస్తు న్నారు. ఆ సమాచారం సదరు టీడీపీ అభ్యర్థులకు చేరవేయిస్తున్నారు. ముఖ్యంగా తుని, అమలాపురం, పెద్దాపురం, రామచంద్రపురం, గొల్లప్రోలు తదితర మున్సిపాల్టీల పరిధిలో ఈ తరహా కసరత్తు ఎక్కువగా జరుగుతోంది. అటు రాత్రివేళల్లో ఆయా మున్సిపాల్టీల పరిధిలో సామాజికవర్గాల వారీగా సమావేశాలు వైసీపీ నిర్వహిస్తోంది. మున్సిపాల్టీలో అంతా కలిపి అధికార పార్టీని గెలిపిస్తే ఏ సామాజికవర్గానికి ఏం చేస్తామనేది అందులో హామీ ఇస్తున్నారు. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేస్తున్నామని, తదుపరి చెప్పిన పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ సంకేతా లు పంపుతున్నారు. మండపేట, తుని, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట తదితర మున్సిపాల్టీల పరిధిలో ఈ తరహా సమావేశాలు కొన్నిరోజుల నుంచి మొదలయ్యాయి. మరోపక్క టీడీపీ అభ్యర్థుల నుంచి నామినేషన్‌ ఉపసంహరణ జరిగే అవకాశాలు లేనిచోట్ల ఇక ప్రచారం పదును పెంచుతోంది. ముఖ్యంగా మండపేట, పిఠాపురం, ఏలేశ్వరం, గొల్లప్రోలు,  సామర్లకోట, అమలాపురం తదితర చోట్ల టీడీపీ అభ్యర్థులు వెనక్కు తగ్గకపోవడంతో పథకాల్లో కోత, వలంటీర్లను వినియోగించడం, మద్యం, డబ్బు తదితర అస్త్రాలను ప్రయోగించడానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. 

మేనిఫెస్టో అంశాలే అస్త్రాలుగా...

ప్రతిపక్ష టీడీపీ గత మున్సిపల్‌ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసినట్టే ఈసారి కూడా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అందుకోసం ఒకపక్క ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేయడానికి ఇంటింటి ప్రచారం మొదలుపెట్టింది. నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి మద్యం అమ్మకాల వరకు ధరల బాదుడు, పథకాల్లో కోత, పెన్షన్‌ పెంపులో మోసంతోపాటు ఆస్తిపన్ను పెంచి నడ్డి విరగ్గొట్టే ప్రయత్నాలను ప్రజల ముందు పెట్టనుంది. అటు శుక్రవారం టీడీపీ అధిష్ఠానం ప్రకటించిన మేనిఫెస్టోను విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లడానికి శ్రేణులను సిద్ధం చేస్తోంది. మున్సిపాల్టీలో టీడీపీని గెలిపిస్తే ఆస్తి పన్ను బకాయిల రద్దు, ఉచిత మంచినీటి కుళాయి, మంచినీటి పన్ను రద్దు, అన్నక్యాంటీన్లను తిరిగి తెరిపించడం వంటి జనాకర్షక అస్త్రాలను ఓటర్ల ముందు ఉంచబోతోంది. ఇందుకోసం ప్రతి వార్డులో ప్రతి ఇంటికీ మేనిఫెస్టో అంశాలను పక్కాగా తీసుకువెళ్లడానికి బృందాలను సిద్ధం చేస్తోంది. మరోపక్క పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఉత్తేజకరమైన గెలుపు దక్కడంతో జనసేన సైతం మున్సిపల్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన చోట్ల ప్రచారం భారీగా చేయాలని, గెలిపిస్తే నిధులు రాబట్టి అభివృద్ధి చేసి చూపిస్తామనే నినాదంతో ముందుకు వెళ్లడానికి సమాయత్తమైంది.


Updated Date - 2021-02-28T07:06:26+05:30 IST