దుష్ప్రచారంతో మమ్మల్ని అడ్డుకోలేరు

ABN , First Publish Date - 2021-12-26T08:40:56+05:30 IST

రాజకీయ వివాదాల్లోకి కుటుంబాలను లాగడం, వారిని కించపరిచేలా సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేయడం బీజేపీకి తెలిసిన వ్యూహమని, ఇలాంటి వాటితో టీఆర్‌ఎ్‌సను అడ్డుకోలేరని మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు.

దుష్ప్రచారంతో మమ్మల్ని అడ్డుకోలేరు

  • రాజకీయాల్లోకి కుటుంబాలను లాగుతారా?: మంత్రి హరీశ్‌రావు
  • జర్నలిజానికే చీడపురుగు తీన్మార్‌ మల్లన్న: పువ్వాడ
  • మల్లన్నను ఉరికించి కొట్టే రోజులొస్తాయి: జీవన్‌రెడ్డి
  • మహిళలు, పిల్లలను కించపర్చడం సరికాదు: షర్మిల


హైదరాబాద్‌/ఖమ్మం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాజకీయ వివాదాల్లోకి కుటుంబాలను లాగడం, వారిని కించపరిచేలా సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేయడం బీజేపీకి తెలిసిన వ్యూహమని, ఇలాంటి వాటితో టీఆర్‌ఎ్‌సను అడ్డుకోలేరని మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. కేటీఆర్‌ కుమారుడు హిమాన్షుపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ కంచుకోట లాంటిదని, బెదిరింపులకు లొంగే పార్టీ కాదని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. టీఆర్‌ఎ్‌సను నేరుగా ఎదుర్కోలేక తమ పార్టీ నేతలపై సోషల్‌ మీడియా ద్వారా బీజేపీ విషప్రచారం సాగిస్తోందని మంత్రి పువ్వాడ అజయ్‌ ఆరోపించారు. హిమాన్షును కించపరిచేలా మాట్లాడడం అమానుషమని అన్నారు. ఖమ్మంలో శనివారం ఆయన మాట్లాడుతూ కేటీఆర్‌ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ నేతలు సోషల్‌మీడియా ద్వారా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారన్నారు. తీన్మార్‌ మల్లన్న లాంటి వ్యక్తులు జర్నలిజానికే చీడపురుగులని, ఆయన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. 


ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిని కొందరు కించపరిచేలా మాట్లాడారని, దీంతో ఆయన కన్నీటి పర్యంతమయ్యారని గుర్తు చేశారు. తాము అధికారంలో ఉన్నందునే సహనంతో ఉన్నామని, ఇలాంటి చర్యలు పునరావృతమైతే  టీఆర్‌ఎస్‌ శ్రేణులు చూస్తూ ఊరుకోవన్నారు. టీఆర్‌ఎ్‌సతో పాటు కేసీఆర్‌ కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేస్తున్న తీన్మార్‌ మల్లన్నను రోడ్డుపై ఉరికించి కొట్టే రోజులు వస్తాయని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. తీన్మార్‌ మల్లన్న జర్నలిస్టు కాదని, బ్లాక్‌ లిస్టులో ఉన్న బీజేపీ నేత అని, ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే టీఆర్‌ఎస్‌ శ్రేణులు తగిన బుద్ధి చెబుతాయని పేర్కొన్నారు.  తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలు అప్రజాస్వామికమని మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ పేర్కొన్నారు. యూట్యూబ్‌ చానల్‌లో వినియోగిస్తున్న భాష జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. కుటుంబ సభ్యులను అవమానించే ప్రకటనలను ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగా తాను తీవ్రంగా ఖండిస్తున్నానని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల పేర్కొన్నారు. తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తూ కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై ఆమె స్పందించారు.  ఒక తల్లిగా పిల్లలపై వేధింపులను తాను అసహ్యించుకుంటానని పేర్కొన్నారు. 

 

మా ఫిర్యాదులపై డీజీపీ స్పందించట్లేదు

మంత్రులపై దుష్ప్రచారాన్ని పట్టించుకోరా?

మా కార్యకర్తలే స్పందిస్తారు: బాల్క సుమన్‌

సామాజిక మాధ్యమాల్లో సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, వారి కుటుంబ సభ్యులు, మంత్రులపై విష ప్రచారం చేస్తుంటే పోలీసు విభాగం ఏం చేస్తోందని విప్‌ బాల్క సుమన్‌ ప్రశ్నించారు. తమ ఫిర్యాదులపై డీజీపీ స్పందించడం లేదని ఆరోపించారు. పోలీసులు చర్యలు తీసుకోకుంటే తమ కార్యకర్తలు స్పందిస్తారని, దానికి తాము బాధ్యులం కాదని పేర్కొన్నారు. టీఆర్‌ఎ్‌సఎల్పీలో శనివారం ఆయన మాట్లాడారు. సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేస్తున్న వారిని కచ్చితంగా శిక్షించాలని, పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. తీన్మార్‌ మల్లన్నకు చెంప దెబ్బలు కాదు.. చెప్పు దెబ్బలు పడాలన్నారు. మహిళలు, పిల్లలను, కుటుంబ సభ్యులను బీజేపీ కించపరుస్తోందని, ఈ ధోరణి మంచిది కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరుద్యోగ దీక్ష హాస్యాస్పదమని, కేంద్ర పరిధిలో ఖాళీగా ఉన్న 8.72 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయరా? అని నిలదీశారు.

Updated Date - 2021-12-26T08:40:56+05:30 IST