హామీలివ్వకుండా అడ్డుకోలేం

ABN , First Publish Date - 2022-08-18T10:10:44+05:30 IST

రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాల సాధన నిమిత్తం పార్టీలు, వ్యక్తులు ఎన్నికల్లో హామీలివ్వకుండా తాము అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

హామీలివ్వకుండా అడ్డుకోలేం

వాగ్దానాలు చేసినా పార్టీలు ఓడాయి ఉచితాల కోసం ఓటర్లు ఎదురుచూడరు గౌరవప్రద సంపాదనపైనే వారికి ఆసక్తి  ఫ్రీగా టీవీలు ఇవ్వడానికి, కరెంటు సరఫరాకు తేడా ఉంది పథకాల అమలు రాజ్యాంగపర కర్తవ్యం సీజేఐ జస్టిస్‌ రమణ వ్యాఖ్యలు


వాగ్దానాలు చేసినా  పార్టీలు ఓడిపోయాయి .. ఉచితాల కోసం ఓటర్లు ఎదురుచూడరు

న్యూఢిల్లీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాల సాధన నిమిత్తం పార్టీలు, వ్యక్తులు ఎన్నికల్లో హామీలివ్వకుండా తాము అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఏది సరైన హామీయో తేల్చాల్సి ఉందని తెలిపింది. నిజమైన సంక్షేమ ప్రతిపాదనలకూ నగలూ, టెలివిజన్‌ సెట్లు, ఎలెక్ర్టానిక్స్‌ వస్తువులు పంచిపెడతామన్న ‘ఉచిత హామీ’లకూ తేడా చూడాలని పేర్కొంది. వృత్తి విద్యా కోర్సులకు ఉచిత కోచింగ్‌ కల్పించడానికీ, ఉచితంగా వస్తువులు పంపిణీ చేయడానికి వ్యత్యాసం ఉందని తెలిపింది. ఎన్నికల సందర్భంగా పార్టీలు ‘ఉచితాల’ను ప్రకటించడాన్ని సవాలు చేస్తూ బీజేపీ నాయకుడు అశ్విని ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బుధవారం సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్‌ రమణ మాట్లాడుతూ ఓటర్లు ఉచితాల కోసం ఎదురు చూస్తున్నారని తాను అనుకోవడం లేదని చెప్పారు.  రాజకీయ పార్టీలు ఎన్ని ఉచితాలను హామీ ఇచ్చినా ఓడిపోయిన సందర్భాలు లేకపోలేదని గుర్తు చేశారు. అవకాశం ఇస్తే గౌరవంగా డబ్బు సంపాదించేందుకే ఓటర్లు ఇష్టపడతారని చెప్పారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం మూలంగా ప్రజలు గౌరవంగా డబ్బు సంపాదించుకోవడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ఆస్తులను ఏర్పాటు చేశారని అన్నారు.


ఇదీ ప్రధాన సమస్య

ప్రజా ధనాన్ని సరైన విధంగా ఎలా ఖర్చుపెట్టాలన్నదే ప్రధాన సమస్య అని జస్టిస్‌ రమణ అన్నారు, ఉచితాలను సంక్షేమ పథకాలతో పోల్చి అయోమయం చెందరాదని ఆయన అన్నారు. విద్యుత్తు, విత్తనాలు, ఎరువులను రాయితీ ఇచ్చి తద్వారా వ్యవసాయాన్ని ఫలవంతం చేయడం ఉచితంగా భావించవచ్చా? సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, సురక్షితమైన తాగునీరు కల్పించడం ఉచితంగా భావించాలా?  పన్ను చెల్లించేవారు కష్టించి సంపాదించిన డ బ్బును ఉచితాల కోసం వృఽథా అవుతోందని కొందరు చెబుతున్నారు. సంక్షేమ పథఖాలపై ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం అవసరమని మరికొందరు అంటున్నారు. అసలు ఇలాంటి అంశాలను పరిశీలించడం కోర్టుకు సాధ్యమా? అన్న ప్రశ్నలను ఆయన లేవనెత్తారు. సంక్షేమ పథకాలతో ప్రజల మధ్య అసమానతలు తగ్గించడం రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు. ఉచితాలపై జాతీయ, రాష్ట్ర పార్టీలతో పాటు అన్ని పక్షాలు తమ అభిప్రాయాలు, సిఫారసులతో ముందుకు రావాలని స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేశారు. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టే అధికారం రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చిందని డీఎంకే అడ్వకేట్‌ విల్సన్‌ చెప్పారు.


ఇష్టం వచ్చినట్టు కేసులు తొలగిస్తున్నారు

సుప్రీంకోర్టు రిజిస్ర్టీ పనితీరుపై సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే జస్టిస్‌ రమణకు  ఫిర్యాదు చేశారు. కేసులు లిస్టు చేయడం, డిలీట్‌ చేయడంలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ‘‘ఎన్నో సమావేశాల్లో పాల్గొన్నా. రాత్రి 8 గంటల వరకు కేసుపై అధ్యయనం చేశా. తీరా కోర్టుకు వచ్చే సరికి లిస్టు నుంచి కేసు డిలీట్‌ చేశారని తెలిసింది. ఇది సరికాదు. ముఖ్యమైన కేసులను చివరి నిమిషంలో లిస్టు నుంచి తొలగించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విధానం మారాలి’’ అని అన్నారు. దీనిపై జస్టిస్‌ రమణ స్పందిస్తూ ‘‘చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ ప్రస్తావిస్తా. అయితే పదవీ విరమణ చేసే వరకు ఏమీ అనను. వీడ్కోలు సమావేశంలో అన్నీ చెబుతా.అప్పటిదాకా వేచి ఉండండి’’ అని అన్నారు. 

Updated Date - 2022-08-18T10:10:44+05:30 IST