3,793 ఎకరాలకు నీరు..రూ.లక్షన్నర ఇవ్వలేరా సారూ?

ABN , First Publish Date - 2022-09-23T09:09:06+05:30 IST

3,793 ఎకరాలకు నీరు..రూ.లక్షన్నర ఇవ్వలేరా సారూ?

3,793 ఎకరాలకు నీరు..రూ.లక్షన్నర ఇవ్వలేరా సారూ?

గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా మూగలదొడ్డి లిఫ్టు నిర్మాణం

మోటార్లు పనిచేయకపోవడంతో నీటిని ఎత్తిపోయలేని పరిస్థితి

20 కోట్ల సాగు పెట్టుబడి మట్టిపాలయ్యే ప్రమాదం

రైతన్నల ఆందోళన

మూడున్నరేళ్లుగా నిర్వహణ నిధులివ్వని జగన్‌ ప్రభుత్వం 


(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

రాయలసీమ ప్రాజెక్టులపై జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో తార్కాణం. మూడున్నరేళ్లుగా ప్రాజెక్టుల ఆపరేషన్‌-నిర్వహణ (ఓ అండ్‌ ఎం) నిధులు విడుదల చేయడం లేదు. కనీసం రూ.లక్షన్నర కూడా ఇవ్వకపోవడంతో 3,793 ఎకరాలకు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా కర్నూలు జిల్లా కోసిగి మండలంలో మూగలదొడ్డి ఎత్తిపోతల పథకం నిర్మించారు. దీనికోసం రూ.10.91 కోట్లు ఖర్చు చేశారు. మూగలదొడ్డి, చిర్తనకల్లు, ఎస్‌.కొట్టాల, కోలమాన్‌పేట్‌, దుద్ది గ్రామాల్లో 3,793 ఎకరాల వరకు లో లెవల్‌ కెనాల్‌ (ఎలెల్సీ) ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. రాజోళిబండ మళ్లింపు పథకం (ఆర్‌డీఎస్‌) దిగువన ఏర్పాటు చేసిన ప్రధాన పంప్‌ హౌస్‌లోని రెండు పంపుల ద్వారా 54.808 క్యూసెక్కుల తుంగభద్ర వరద జలాలను ఎత్తిపోసి మూగలదొడ్డి గ్రామ సమీపంలో నిర్మించిన జలాశయంలో నిల్వ చేయాలి. ప్రస్తుతం తుంగభద్ర నది ఉప్పొంగుతోంది. మంగళవారం వరకు 444 టీఎంసీల వరద జలాలను శ్రీశైలం జలాశయంలోకి వదిలేశారు. కానీ మూగలదొడ్డి  పథకం ద్వారా ఒక్క క్యూసెక్కు నీటిని కూడా ఎత్తిపోయలేదు. కారణం.. విద్యుత్‌ పంపులకు విద్యుత్‌ సరఫరా చేసే పవర్‌ కేబుల్‌ కాలిపోయింది. దీంతో విద్యుత్‌ మోటార్లు పని చేయడం లేదు. ఫలితంగా నీటిని ఎత్తిపోయడం కుదరడం లేదని.. మరమ్మతులకు రూ.1.50 లక్షలకు మించి ఖర్చు కాదని గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఈఈ వెంకటేశులు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఇంత చిన్న మొత్తం కూడా ఇవ్వకపోవడంతో కేబుల్‌ మరమ్మతులు చేయలేదు. మూగలదొడ్డి జలాశయం పరిధిలో వరి, పత్తి వంటి పంటలు సాగు చేశారు. రూ.20 కోట్ల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఓ అండ్‌ ఎం నిధులు ఇవ్వకపోవడంతో లక్షన్నర కూడా ఖర్చుచేయలేని దుస్థితి ఏర్పడిందని.. ఈ కారణంగా సకాలంలో నీటి తడులు అందక రూ.20 కోట్ల పెట్టుబడి మట్టిపాలయ్యే ప్రమాదం తలెత్తిందని ఆందోళన చెందుతున్నారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టు పరిధిలో మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 11 లిఫ్టు స్కీంలు నిర్మించారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక మూడున్నరేళ్ల్లుగా ఓఅండ్‌ఎం నిధులు ఇవ్వలేదు. రూ.15 కోట్లు నిర్వహణ కోసం ఇవ్వాలని అధికారులు పంపిన ప్రతిపాదనలకు అతీగతీ లేదు.

Updated Date - 2022-09-23T09:09:06+05:30 IST