Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పనులు చేయలేం!

twitter-iconwatsapp-iconfb-icon
పనులు చేయలేం! పలాస-కాశీబుగ్గ మున్సిపల్‌ కార్యాలయం

బిల్లుల మంజూరులో జాప్యమే కారణం
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో కాంట్రాక్టర్ల ఆవేదన
(పలాస)

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి సంబంధించి జగనన్న కాలనీ లేఅవుట్‌ కోసం కోసంగిపురం వద్ద 50 ఎకరాల కొండ పోరంబోకు స్థలాన్ని చదును చేసి ప్లాట్లు కేటాయించారు. ప్రస్తుతం పనులు సైతం జరుగుతున్నాయి. కానీ ఏళ్లు గడుస్తున్నా కొండలు, గుట్టలను తవ్వి లేఅవుట్‌గా మార్చిన కాంట్రాక్టర్లకు మాత్రం ఇంతవరకూ బిల్లులు చెల్లించలేదు. అధికారులను అడిగితే..అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు.
-- ఇలా ఒకటి కాదు.. రెండు కాదు కోట్లాది రూపాయల పనులకు సంబంధించి బిల్లులు చెల్లించడం లేదు. దీంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు విసిగి వేశారిపోతున్నారు. కుటుంబసభ్యుల బంగారం బ్యాంకుల్లో కుదువపెట్టి పనులు చేశామని..బిల్లులు చెల్లించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు అధికారుల వేధింపులు, అక్రమ వసూళ్లతో పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి ఓ దండమంటూ కాంట్రాక్టర్లు పక్కకు తప్పుకుంటున్నారు. ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో పనులు చేసి అప్పులపాలవడం కంటే.. చేయకుండా ఉండడమే ఉత్తమమని భావిస్తున్నారు. బిల్లులు చెల్లించకుండా పనులు చేయలేమని స్పష్టం చేస్తున్నారు. మునిసిపాలిటీలో వందకు పైగా అభివృద్ధి పనులకు సంబంధించి రూ.5 కోట్ల మేర బిల్లుల బకాయిలు ఉండిపోయాయి. దీంతో చిన్న కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రాకపోగా.. పెద్ద కాంట్రాక్టర్లు మాత్రం తమ వద్ద ఉన్న యంత్ర సామగ్రి తుప్పు పట్టిపోకుండా అరకొరగా పనులు చేస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వంతోనే..
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కాంట్రాక్టర్లకు కష్టాలు ప్రారంభమయ్యాయి.  ఒక్కో కాంట్రాక్టర్‌కు రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు బకాయి చెల్లించాల్సి ఉంది. బిల్లులు వస్తాయని ఆశతో ఎదురు చూసినా కొర్రీలు పెడుతూ బిల్లులు ఎగ్గొడుతున్నారు. పరిస్థితి చేజారుతుండడంతో కంటితుడుపు చర్యలుగా అరకొరగా డబ్బులు చెల్లిస్తున్నారు. పనులు చేయండి.. ప్రాధాన్యతాక్రమంలో బిల్లులు చెల్లిస్తామని ఇంజనీరింగ్‌ అధికారులు తొలుత నమ్మకంగా చెబుతున్నారు. తరువాత ముఖం చాటేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకుంటే తామేం చేయగలమని చేతులు దులుపుకొంటున్నారు. అందుకే చిన్న కాంట్రాక్టర్లంతా ఇప్పుడు జగనన్న కాలనీ లేఅవుట్లలో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ప్రైవేటు భవనాల కాంట్రాక్ట్‌ పనులు తీసుకుంటున్నారు. మరోవైపు విభజించు పాలించు అన్న చందంగా ఒకరిద్దరు కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మిగిలిన వారికి మాత్రం కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. వారి ఆవేదన అంతా ఇంతా కాదు. అందులో భాగంగానే లంచం డిమాండ్‌ చేసిన జూనియర్‌ అకౌంట్‌ అధికారి (జేఏవో)ని ఓ కాంట్రాక్టర్‌ శనివారం ఏసీబీ అధికారులకు పట్టించాడు.  వాస్తవానికి బిల్లుల చెల్లింపుల్లో చాలావరకూ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముత్యాలమ్మ కోనేరు-నెహ్రూ పార్కు, పెసరపాడు రోడ్డు నిర్మాణంలో ఈ విధంగానే పనులు చేయకుండానే ముందస్తుగా బిల్లులు అధికారులు ఇచ్చారు. తీరా కాంట్రాక్టర్లు పనులు చేయకుండానే పరారీ అయ్యారు. దీని వెనుక కొంతమంది అధికారులకు మామూళ్లు అందాయనే ఆరోపణలున్నాయి. కార్యాలయం ఖర్చులు కాంట్రాక్టర్లు ఇవ్వకపోతే మరెవరు ఇస్తారని ఓ ఉన్నతాధికారే స్వయంగా సెలవివ్వడం స్థానికంగా హాట్‌టాఫిక్‌గా మారింది. కొవిడ్‌ సమయంలో చేసిన పనులకే ఇంతవరకు బిల్లులు చెల్లించడం లేదు. టెంట్లు, కంటైన్మెంట్‌ జోన్‌లో కర్రలు కట్టడానికి, కుర్చీలు వేయడానికి ఇలా.. డబ్బులు పెట్టిన కాంట్రాక్టర్లకు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏసీబీ అధికారుల దాడులతోనైనా అధికారులు మేలుకుంటారని కాంట్రాక్టర్లు ఆశతో ఉన్నారు.

జాప్యం లేదు
బిల్లుల చెల్లింపుల్లో శాఖాపరంగా జాప్యం లేదు. చిన్న చిన్న బిల్లులు రికార్డుల ప్రాప్తికి చెల్లిస్తున్నాం. జనరల్‌ ఫండ్‌ ఉంటే వెంటనే బిల్లులు మంజూరు చేస్తున్నాం. పెద్ద మొత్తానికి సంబంధించి మాత్రం ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకే మంజూరు చేయాల్సి ఉంది.
-అవినాష్‌, మునిసిపల్‌ ఏఈ, పలాస-కాశీబుగ్గ

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.