దారీ తెన్నూలేక!

ABN , First Publish Date - 2022-10-03T08:07:40+05:30 IST

ఏజెన్సీ ప్రాంతాల్లో వందల గ్రామాల్లో ఇదే పరిస్థితి. అటవీ అనుమతులు రాకపోవడంతో రోడ్ల నిర్మాణం పనులు ముందుకు సాగడం లేదు.

దారీ  తెన్నూలేక!

  • కాలిబాటే గతి.. 
  • వాగులు దాటాలంటే ఎడ్లబండ్లే దిక్కు.. 
  • ఎమర్జెన్సీలో ప్రయాణం నరకమే
  • ప్రసవ వేదన, గుండెపోటు వస్తే దేవుడిపైనే భారం.. 
  • భారీ వర్షాలు కురిస్తే రాకపోకలు బంద్‌
  • అడవిబిడ్డలకు కష్టాలు.. 
  • కలగానే రహదారులు.. 
  • అటవీ అనుమతులు లేకపోవడంతోనే జాప్యం


ఆసిఫాబాద్‌ జిల్లాలో కుషాన్‌పల్లి-సోమిని గ్రామాల మధ్యలో రెండు వంతెనలను నిర్మించాల్సి ఉంది. పనులకు అనుమతులు లేకపోవడంతో నిర్మాణాలు మొదలు పెట్టలేదు. చిన్నపాటి వర్షం కురిసినా వాగులు పారుతున్నాయి. వీటిని దాటలంటే ఎడ్ల బండ్లే దిక్కవుతున్నాయి. దాదాపు 6 కిలోమీటర్ల మేర రోడ్డు వేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తిచేస్తే 12 గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతోంది. 


జెన్సీ ప్రాంతాల్లో  వందల గ్రామాల్లో ఇదే పరిస్థితి. అటవీ అనుమతులు రాకపోవడంతో రోడ్ల నిర్మాణం పనులు ముందుకు సాగడం లేదు. ఫలితంగా ఏళ్ల తరబడి అక్కడి అడవి బిడ్డలు కాలిబాట, నడకే శరణ్యమవుతోంది. జిల్లా, మంండల కేంద్రాలకు వెళ్లాలన్నా,   మార్కెట్‌కు కూరగాయలు, ధాన్యం తీసుకెళ్లాలన్నా, ఇతర అవసరాల నిమిత్తం పట్టణ ప్రాంతాలకు వెళ్లిరావాలన్నా వాగులు, వంకలు దాటుకుంటూ వెళాల్సిన దుర్భర పరస్థితులు నెలకొన్నాయి.  భారీ వర్షాలు కురిస్తే మాత్రం మొత్తంగా రాకపోకలే బంద్‌ అవుతున్నాయి. అత్యవసర సమయాల్లో ప్రయాణం నరకంగా మారుతోంది. ప్రసవ వేదన పడుతున్న గర్భిణులను, గుండె పోటు వచ్చిన వారిని, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించడంలో ఇబ్బందులెదురవుతుండటంతో దేవుడి మీదే భారం వేయాల్సి వస్తోంది. ఏజెన్సీలు అధికంగా ఉన్న జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అటవీ అనుమతుల జాప్యం కారణంగా రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం పనులు, ప్రైవేట్‌ ఏజెన్సీలు చేపడుతున్న కేబుల్‌ నెట్‌వర్క్‌ పనులు ముందుకు సాగడం లేదు. కొన్ని చోట్లలో స్టేజ్‌-1 అనుమతులు వచ్చినప్పటికీ స్టేజ్‌-2 అనుమతుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ వన్యప్రాణుల బోర్డు అనుమతులకు పరివాష్‌ అనే సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, ప్రైవేట్‌ ఏజెన్సీలు ఆన్‌లైన్‌లో అనుమతులకు కావల్సిన డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో అటవీ అనుమతుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది.



సమస్యల్లో కొన్ని 

మంచిర్యాల జిల్లా కోటపల్లి, నెన్నెల మండలాల్లో 12 గ్రామాల ప్రజలకు ఉపయోగపడే డబుల్‌ రోడ్ల నిర్మాణం నాలుగేళ్ల కిందట మొదలైనా.. నక్కలపల్లి, బ్రహ్మణపల్లి, శామనపల్లి, బద్దంపల్లి, బమ్మెన, బెల్లపల్లి, పొప్పారం, దుగ్నపల్లి, మన్నెగూడం, కొనంపేట గ్రామాలను కలుపుతూ వేయాల్సిన డబుల్‌ లైన్‌ రోడ్డు పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి.


మహరాష్ట్రలోని కల్యాణ్‌ నుంచి నిర్మల్‌, జగిత్యాల జిల్లా కేంద్రాలను కలుపుతూ వెళ్లే ఎన్‌హెచ్‌-61 నిర్మాణం పనులు కనకపూర్‌-ఖానాపూర్‌ మధ్యలో అటవీ అనుమతులు రాక నిలిచిపోయాయి. 2012 డిసెంబరు నుంచి  అనుమతులకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే అటవీశాఖకు డబ్బులు చెల్లించి స్టేజ్‌ -1 అనుమతులు పొందుతామని అధికారులు పేర్కొన్నారు. 


పర్యవేక్షణాధికారిగా మోహన్‌చంద్ర  

రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతుల కోసం ప్రతేక పీసీసీఎ్‌ఫగా మోహన్‌చంద్ర పర్గేయిన్‌ తాజాగా బాధ్యతలు చేపట్టారు. ములుగు, ఆసిఫాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాలో చేపట్టాల్సిన బీటీ రోడ్ల నిర్మాణాలకు పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖలు నిధులు కేటాయించాయి. పనుల పర్యవేక్షణను కూడా ఈ శాఖలే చేపడుతున్నాయి. ఈ పనులు చేపట్టేందుకు రాష్ట్ర వన్యప్రాణుల బోర్డు అనుమతులిచ్చినా.. జాతీయ వైల్డ్‌లైఫ్‌ బోర్డు అనుమతులు జారీచేయడం లేదు. ఈ బోర్డుకు అన్ని పత్రాలు అందజేస్తేనే అనుమతులు జారీచేస్తుంది. పనులను పర్యవేక్షిస్తున్న ఏజెన్సీలు(కాంట్రాక్టర్లు) అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయకపోవడంతోనే అనుమతుల పరంగా జాప్యం జరుగుతుందని సమాచారం. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 

- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌

Updated Date - 2022-10-03T08:07:40+05:30 IST