కొనలేం.. చేయలేం!

ABN , First Publish Date - 2021-10-13T06:03:35+05:30 IST

అన్నదాతకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ధరల నియంత్రణపై ప్రభుత్వ అజమాయిషీ కొరవడటంతో కంపెనీల ఇష్టారాజ్యమైంది.

కొనలేం.. చేయలేం!

మళ్లీ ఎరువుల ధరల పెంపు

మరింత భారం కానున్న సేద్యం

జిల్లా రైతులపై రూ.400 కోట్ల అదనపు భారం

దశాబ్దకాలంలో  ఇది 15వ సారి

చిన్న, సన్నకారు  కుదేలు

అన్నదాతకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ధరల నియంత్రణపై ప్రభుత్వ అజమాయిషీ కొరవడటంతో కంపెనీల ఇష్టారాజ్యమైంది. పదేపదే ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డివిరుస్తున్నాయి. ఇప్పటికే పెరిగిపోతున్న పెట్టుబడి ఖర్చులతో రైతులు చితికిపోతున్నారు. ప్రభుత్వాలు చేసే మొక్కుబడి సాయం ధైర్యాన్నివ్వడం లేదు. దీంతో సాగు నుంచి పలువురు తప్పుకుంటున్నారు. ఈ సమయంలో ఎరువుల కంపెనీలు తాజాగా ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో వారి పరిస్థితి మరింత దిగజారనుంది.  గడిచిన దశాబ్దకాలంలో దాదాపుగా 15సార్లు ధరలు పెంచి సొమ్ము చేసుకున్నాయి. నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండటంతో రైతుల వేదన అరణ్యరోదన గానే మిగిలిపోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ధరల విషయంలో కంపెనీలను కట్టడి చేయడం కానీ, పెంపు మొత్తాన్ని రైతులకు రాయితీ రూపంలో ఇవ్వడం కానీ చేయకపోతే వ్యవసాయరంగం మరింత గడ్డుపరిస్థితిని ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఒంగోలు (జడ్పీ), అక్టోబరు 12: వ్యవసాయం వ్యయసాయంగా మారింది. ఏటికేడు సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. దీంతో నేలను నమ్ముకున్న రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. తాజాగా ఎరువుల ధరల పెంపు అన్నదాతలకు పెనుభారం కానుంది. ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలోని రైతులు  80,588 మెట్రిక్‌ టన్నుల ఎరువులను వినియోగిస్తారని వ్యవసాయశాఖ అంచ నా. వీటిలో ఎక్కువభాగం యూరియా ఉంటుంది. తర్వాత స్థానాల్లో డీఏపీ, కాంప్లెక్స్‌, ఎస్‌ఎస్‌పీ, ఎంవోపీ  ఉన్నాయి. అత్యధికంగా 23,526 మెట్రిక్‌ టన్నుల యూరియాను రైతులు వినియోగించే అవకాశం ఉంది. 11,610 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 39,000 మెట్రిక్‌ టన్ను ల కాంప్లెక్స్‌, 3,718 టన్నుల ఎస్‌ఎస్‌పీ, 2,733.7 మెట్రి క్‌ టన్నుల ఇతర రకాల ఎరువులను ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు వాడతారు. అయితే ధరలు మరోసారి పెం చడంతో సాగు సాధ్యం కాదని రైతులు అంటున్నారు.

గత రబీలో 2,59,959.6 మెట్రిక్‌ టన్నుల ఎరువుల అమ్మకం

2020 అక్టోబరు నుంచి 2021 మార్చి వరకు జరిగిన ఎరువుల అమ్మకాలన్నీ రబీ సీజన్‌ వినియోగం కిందకే వస్తాయి. గత ఖరీఫ్‌ ఆలస్యంగా మొదలవడంతో అందుకు సంబంధించి అక్టోబరులో వాడిన ఎరువుల వాడకం కూడా చాలావరకు రబీ ఖాతాలో పడింది. ఖరీఫ్‌లో వేసిన పంటలకు కూడా రెండు, మూడు కోతలు చాలావరకు రబీలో కలవడంతో ఎరువుల వాడకం  2020 ఖరీఫ్‌తో పోల్చితే రబీలో  గణనీయంగా పెరిగింది. యూరియా 66,230.6 మెట్రిక్‌ టన్నులు కాగా, డీఏపీ 28,264.44, కాంప్లెక్స్‌ ఎరువుల వాడకం 1,48,484.62 మెట్రిక్‌ టన్ను లతో వినియోగంలో ముందు వరుసలో ఉన్నాయి.


 రూ.400కోట్ల అదనపు భారం

పెరిగిన ఎరువుల ధరలతో జిల్లా రైతులపై దాదాపు రూ.400కోట్ల మేర అదనపు భారం పడనుంది. ముఖ్యంగా డీఏపీపై గరిష్ఠంగా రూ.500 పెంచడం రైతులకు శరాఘాతంలా పరిణమించింది. డీఏపీకి కేంద్రం సబ్సిడీ ఇవ్వడం కొంత ఊరట కలిగించే అంశం. కానీ భవిష్యత్తులో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని ఆ భారాన్ని రైతులే మోయాల్సి ఉంటుందని కంపెనీలు చెబుతున్నాయి. అదేవిధంగా కాంప్లెక్స్‌ ఎరువులపై కూడా రూ.300 నుంచి రూ.400 వరకు పెరగడం పట్ల కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా ధర పెంపును ప్రస్తుతానికి మినహాయించినా భవిష్యత్తులో దానిని కూడా పెంచే యోచనలో ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.


ముడిసరుకుల ధరలు పెరగడమే  కారణమంటున్న కంపెనీలు

అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలు పెరగడంతో అనివార్యంగా ఎరువుల ధరలు పెంచాల్సి వచ్చిందనేది ఎరువుల కంపెనీలు చెప్తున్నాయి. దీనికి పెట్రోలు, డీజిల్‌ ధరలు కూడా తోడవడంతో రవాణా తదితర ఖర్చులు పెరిగాయని అందువల్లే ధరల పెంచాల్సి వస్తోందని ఆయా కంపెనీల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి.


బ్లాక్‌ మార్కెట్‌పై వ్యాపారుల కన్ను 

తాజా ధరల పెంపుతో వ్యాపారులు తమదైన శైలిలో బ్లాక్‌మార్కెట్‌కు తెరలేపినట్లు తెలుస్తోంది. పుష్కలంగా అందుబాటులో ఉన్న ఎరువులకు కృత్రిమ కొరత స్పష్టించి, నిల్వ చేసి పెరిగిన ధరలను సొమ్ము చేసుకోవాలని కొంతమంది వ్యాపారులు పథక రచన చేసినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే ఉన్న పాత నిల్వలను అంతకుముందు ఉన్న ధరలకే విక్రయించాలని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ వ్యాపారులు ఈ ఆదేశాలను బేఖాతరు చేసి పెరిగిన ధరలకే ఎరువులను అమ్ముకుని లబ్ధిపొందాలని చూస్తున్నారు. జిల్లా వ్యవసాయశాఖ ఈ తరహా సిండికేట్‌ మాయాజాలంపై దృష్టిసారించడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి నిల్వ ఉంచిన వ్యాపారులపై చర్యలకు నడుంబిగించాల్సి ఉంది.



Updated Date - 2021-10-13T06:03:35+05:30 IST