ఇలా అయితే ఉండలేం!

ABN , First Publish Date - 2022-06-29T05:07:40+05:30 IST

వైసీపీలో వర్గపోరు తీవ్రమవుతోందా? జిల్లాలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా? ఒకరికొకరు పొగ పెట్టుకుంటున్నారా? ఎమ్మెల్యేలకు దిగువస్థాయి కేడర్‌కు మధ్య అగాధం నెలకొందా? పరిస్థితి చేయిదాటుతోందా? ఇతర పార్టీల వైపు చూస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.

ఇలా అయితే ఉండలేం!


వైసీపీలో తీవ్రమైన వర్గపోరు
కీలక నేతల మధ్య విభేదాలు
ఆధిపత్యం కోసం ప్రయత్నాలు
ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి మధ్య అంతరం
అంటీముట్టనట్టుగా ఉంటున్న సీనియర్లు
అన్ని నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి
ఇతర పార్టీల వైపు కొందరు నాయకుల చూపు
జిల్లాలో పార్టీకి గడ్డు పరిస్థితి అంటున్న శ్రేణులు
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

వైసీపీలో వర్గపోరు తీవ్రమవుతోందా? జిల్లాలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా? ఒకరికొకరు  పొగ పెట్టుకుంటున్నారా?  ఎమ్మెల్యేలకు దిగువస్థాయి కేడర్‌కు మధ్య అగాధం నెలకొందా? పరిస్థితి చేయిదాటుతోందా? ఇతర పార్టీల వైపు చూస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. కొద్దిరోజులుగా జిల్లాలో అధికార పార్టీలో ఉన్న విభేదాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. శ్రేణులకు కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
- జిల్లాలో అధికార పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. అటు ఎమ్మెల్యేలకు ద్వితీయ శ్రేణి నాయకుల మఽధ్య పొసగడం లేదు. ఎక్కడికక్కడే నేతలు తమ అసంతృప్తి గళాన్ని వినిపిస్తున్నారు. పార్టీకోసం అహర్నిశలు శ్రమించిన తమకు రిక్తహస్తమే ఎదురైందని నాయకులు తెగ బాధపడుతున్నారు. చాలా నియోజకవర్గాలో కేడర్‌ నిట్టనిలువునా చీలిపోయింది. ఎన్నికలు సమీపించే నాటికి ఈ విభేదాలు మరింత ముదిరిపాకాన పడే అవకాశం ఉంది. గడిచిన ఎన్నికల ముందు పార్టీలో వచ్చిన వారికి సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. వారంతా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. అదును కోసం ఎదురుచూస్తున్నారు. పక్కదారులు చూస్తున్నారు. ఇలా అయితే పార్టీలో ఉండలేమంటూ తెగేసి చెబుతున్నారు. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని విశ్లేషిస్తే..
- నరసన్నపేట నియోజకవర్గంలో ధర్మాన కుటుంబం మధ్య ఆధిపత్య పోరు తెరలేచింది. ఇక్కడ కేడర్‌ నిట్టనిలువునా చీలిపోయింది. ఒకవర్గం ధర్మాన కృష్ణదాస్‌తో ఉండగా.. మరో వర్గం ధర్మాన ప్రసాదరావు వెన్నంటి ఉంది. దీంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఇటీవల వైసీపీ ప్లీనరీకి సారవకోట ఎంపీపీ కూర్మినాయుడు, జలుమూరు జడ్పీటీసీ మెండ విజయశాంతి గైర్హాజరయ్యారు. గత మూడేళ్లుగా ధర్మాన కృష్ణదాస్‌ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ధర్మాన ప్రసాదరావు వర్గాన్ని అన్నివిధాలా అణిచివేశారన్నది ప్రధాన ఆరోపణ. అదే సమయంలో నరసన్నపేట నియోజకవర్గంలో పరామర్శలు, సందర్శనల పేరిట ధర్మాన ప్రసాదరావు కొత్త సంప్రదాయాన్ని తెరతీశారు. ఆయనతో పాటు కుమారుడు రామ్‌మనోహర్‌నాయుడు నరసన్నపేటలోని కార్యక్రమాలకు హాజరయ్యేవారు. తాజా మంత్రివర్గ విస్తరణతో కృష్ణదాస్‌ పదవి కోల్పోయారు. ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో నరసన్నపేట నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు వర్గం యాక్టివ్‌ అయ్యింది. దీంతో విభేదాలు మరింత ముదిరిపాకాన పడుతున్నాయి.
- ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌కు నాలుగు మండలాల కీలక నాయకులతో పొసగడం లేదు. వచ్చే ఎన్నికల్లో కిరణ్‌కు టిక్కెట్‌ ఇస్తే సహకరించేది లేదని అసమ్మతి నాయకులు ప్రత్యేక సమావేశాలు, ప్రెస్‌మీట్లు పెట్టి మరీ హెచ్చరించారు. ప్రధానంగా ఎచ్చెర్ల జడ్పీటీసీ దంపతులు బల్లాడ హేమమాలినిరెడ్డి, జనార్దన్‌రెడ్డి వర్గం ఎమ్మెల్యే తీరును బాహటంగానే వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స కలుగుజేసుకొని సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోతోంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నాయకులు ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
- పలాస నియోజకవర్గంలో మంత్రి అప్పలరాజు వ్యవహార శైలిపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. మండల స్థాయి నాయకులతో మంత్రికి గ్యాప్‌ ఉంది. ప్రాధాన్యం లేకుండా పోయిందని వారు అసంతృప్తిగా ఉన్నారు. మంత్రి తీరుపై బాహటంగానే విమర్శలకు దిగుతున్నారు. పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో కీలక నాయకులు పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
- పాతపట్నంలో అయితే స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతికి పార్టీ శ్రేణులకు మధ్య పెద్ద అగాధమే ఉంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పార్టీ కేడర్‌ ఆమె తీరుపై అసంతృప్తిగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె ఎంపిక చేసిన వారు కాకుండా.. అసమ్మతి నాయకులే ఎంపీపీలుగా గెలిచారు. మెళియాపుట్టి, హిరమండలం, కొత్తూరులో వ్యతిరేకవర్గం వారే ఎంపీపీలుగా ఎన్నికయ్యారు.  హిరమండలం జడ్పీటీసీ ఎన్నికల్లో కుమారుడ్ని బరిలో దించి గెలిపించుకోలేకపోయారు. ఐదు మండలాల్లో పార్టీ కేడర్‌ మధ్య కూడా విభేదాలు ఉన్నాయి.
- టెక్కలి నియోజకవర్గం గురించి చెప్పనక్కర్లేదు. ఇక్కడ నియోజకవర్గ ఇన్‌చార్జిగా దువ్వాడ శ్రీనివాసరావు ఉన్నారు. కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేడాడ తిలక్‌, కేంద్ర మాజీ మంత్రి కృపారాణి ఇదే నియోజకవర్గానికి చెందిన వారు. దీంతో ఈ ముగ్గురు మధ్య విభేదాలున్నాయి. మూడు వర్గాలు కొనసాగుతున్నాయి. మెజార్టీ కేడర్‌తో దువ్వాడ శ్రీనివాస్‌కు పొసగడం లేదు. నందిగాం, కోటబొమ్మాళి మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు దువ్వాడ హాజరయ్యే కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు. దీనికి దువ్వాడ వ్యవహార శైలే కారణమన్న ఆరోపణలున్నాయి. ఇటీవల ఆయన కింజరాపు కుటుంబంపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై సొంత పార్టీ వారే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఆయన వ్యాఖ్యలు పార్టీకి మైనస్‌ అవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
- ఆమదాలవలస నియోజకవర్గంలో కూడా అధికార పార్టీలో విభేదాలు చాపకింద నీరులా ఉన్నాయి. ఇక్కడ కీలక నేతకు వ్యతిరేకంగా ఒకవర్గం పనిచేస్తోంది. సరుబుజ్జిలి, ఆమదాలవలస, పొందూరు, బూర్జ మండలాల్లోని అసంతృప్తి నాయకులకు జిల్లా కీలక నాయకుడి ఆశీస్సులున్నంటు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో వ్యతిరేక వర్గం ఇటీవల యాక్టివ్‌ అయినట్టు తెలుస్తోంది.
- ఇచ్ఛాపురం నియోజకవర్గం వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పిరియా సాయిరాజ్‌ ఉన్నారు. ఆయన భార్య పిరియా విజయ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపడుతున్నారు. కానీ ఇటీవల జరిగిన ప్లీనరీలో కొందరు నాయకులు సాయిరాజ్‌ వ్యవహార శైలిపై విమర్శలు గుప్పించారు. తమ మండలాల్లో జరుగుతున్న కార్యక్రమాలకు కనీస సమాచారం ఇవ్వడం లేదని సోంపేట, కంచిలి జడ్పీటీసీలు మంత్రి బొత్సకు ఫిర్యాదు చేశారు.
- మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే శ్రీకాకుళంలో మాత్రం విభేదాలు అంతంతమాత్రం. నియోజకవర్గ స్థాయిలో లేకున్నా.. ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య మాత్రం అంతరం ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం నగర వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కార్పొరేషన్‌ ఎన్నికల దృష్ట్యా ఇక్కడ నేతల మఽధ్య విభేదాలు పెరుగుతున్నాయి.


Updated Date - 2022-06-29T05:07:40+05:30 IST