Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇది సేఫ్‌ కాదు!

ఆంధ్రజ్యోతి(16-04-2020)

ఇల్లూ వాకిలీ లేక... సొంత ఊరికి వెళ్లలేక అవస్థలు పడుతున్న వలస కూలీలపై క్రిమిసంహారకాలు చల్లిన వీడియో ఒకటి ఆ మధ్య సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.. గుర్తుందా..! కరోనా వైరస్‌ సోకుతుందన్న భయంతో అవగాహన లేకుండా అధికారులు చూపిన ఈ అత్యుత్యాహంపై పెద్ద దుమారమే రేగింది. ఆ తరువాత కొన్ని రోజులకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ‘డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్స్‌’ వెలిశాయి. వాటిల్లోకి వెళితే అందులోని వాటర్‌ గన్స్‌ మనపై క్రిమిసంహారకాలను స్ర్పే చేస్తాయి. దానివల్ల కొవిడ్‌-19 లాంటి వైరస్‌లు దరిచేరవని అధికారులు చెప్పుకొచ్చారు. అయితే ఎలాంటి రక్షణ కవచం లేకుండా శరీరంపై ఈ స్ర్పే చేయడం వల్ల ప్రయోజనం కంటే అనర్థాలే ఎక్కువని పలు అధ్యయనాల్లో రుజువైంది. 


ఎందుకు వాడొద్దంటే...

ఈ క్రిమిసంహారకాల్లో ఉపయోగించే సోడియమ్‌ హైపోక్లోరైట్‌ సొల్యూషన్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వంటివి చర్మానికి హాని చేస్తాయంటున్నారు శాస్త్రజ్ఞులు. సోడియమ్‌ హైపోక్లోరైట్‌ శక్తిమంతమైన క్రిమిసంహారకం. నిర్ధారిత మోతాదులో దాన్ని డైల్యూట్‌ చేసి ఫ్లోర్లు, వస్తువుల వంటివి క్రిమిరహితంగా మార్చడానికి ఉపయోగించాలి. ఇది చర్మంపై పడితే దురద, మంట తదితర సమస్యలు వచ్చి, చర్మవ్యాధులకు దారితీస్తాయి. 


అదేవిధంగా హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ శక్తిమంతమైన బ్లీచింగ్‌ ఏజెంట్‌. దీన్ని నేల మీద, వస్తువులపై మాత్రమే వాడాలి. ఈ రసాయనాలు ముఖానికి తాకితే మరిన్ని దుష్పరిణామాలు కలుగుతాయి. కళ్లు, ముక్కు, నోట్లోకి వెళితే ఆరోగ్య సమస్యలొస్తాయి. దగ్గు, ముక్కు కారడం వంటి ఇబ్బందులు రావచ్చు. 


కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ: కార్యాలయాలు, కారిడార్లు, ఎస్కలేటర్లు, ఎలివేటర్లు, కేఫెటేరియాల వంటి ప్రాంతాలను శుభ్రం చేయడానికి శాఖ కొన్ని సూచనలు చేసింది. దాని ప్రకారం ఒక శాతం సోడియమ్‌ హైపోక్లోరైట్‌ ఉన్న డిస్‌ఇన్‌ఫెక్టెంట్‌లతో తుడవాలి. 


ఏఎంఐ ఏం చెప్పిందంటే..: సోడియమ్‌ హైపోక్లోరైట్‌, క్లోరిన్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, బ్లీచ్‌ వంటి రసాయనాలు ఉపయోగించే ముందు అవి చర్మానికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ చర్మంపై పడితే ఆ ప్రాంతాన్ని కుళాయి నీటి ధార కింద బాగా కడుక్కోవాలి.  


డబ్ల్యూహెచ్‌ఓ: ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ మార్గదర్శకాల ప్రకారం వివిధ ఉపరితలాలు, వస్తువులను శుభ్రం చేయడానికి డిస్‌ఇన్‌ఫెక్షన్‌ రసాయనాలను నిర్ధారిత ప్రమాణాల్లో డైల్యూట్‌ చేసిన తరువాతనే ఉపయోగించాలి. వ్యక్తిగత పరిశుభ్రతకు తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలి. 


వీటన్నింటి నేపథ్యంలో తమిళనాడు ‘డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్స్‌’ను తొలగించాలని ఆదేశాలిచ్చింది. దేశంలో తొలుత ‘టన్నెల్‌’ ఏర్పాటు చేసింది తమిళనాడులోనే! 


మరోవైపు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం, సైబరాబాద్‌ కమిషనరేట్‌ల వద్ద  ‘డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్స్‌’ను అధికారులు పక్కన పెట్టేశారు. దీన్నిబట్టి ఇక ‘టన్నెల్స్‌’ కథ ముగిసినట్టే! 

Advertisement
Advertisement