‘అంగన్‌వాడీ’ల్లో తినలేం

ABN , First Publish Date - 2022-07-28T04:17:11+05:30 IST

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకానికి స్పందన కరువవుతోంది. ఈ పథకం కింద గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో భోజనం పెట్టాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ నెల 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తోంది. దీనిపై గర్భిణులు, బాలింతల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్రాలకు వెళ్లి తినేందుకు ఆసక్తి చూపడం లేదు.

‘అంగన్‌వాడీ’ల్లో తినలేం
బెల్లుపడ అంగన్‌వాడీ కేంద్రంలో తక్కువ సంఖ్యలో భోజనం చేస్తున్న బాలింతలు, గర్భిణులు

- కేంద్రాలకు వెళ్లేందుకు గర్భిణులు, బాలింతల అనాసక్తి
- వైఎస్సార్‌ సంపూర్ణ పోషణకు స్పందన కరువు
- పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌
(ఇచ్ఛాపురం)

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకానికి స్పందన కరువవుతోంది. ఈ పథకం కింద గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో భోజనం పెట్టాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ నెల 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తోంది. దీనిపై గర్భిణులు, బాలింతల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  కేంద్రాలకు వెళ్లి తినేందుకు ఆసక్తి చూపడం లేదు. వంటలు నాణ్యతగా ఉండడం లేదని.. గర్భిణులు కూర్చొనేందుకు వసతులు లేవని పేర్కొంటున్నారు. ఎండ వేళ.. వీధులు దాటుకుని.. అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి భోజనం చేయలేమని స్పష్టం చేస్తున్నారు. పాత విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో 14 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 3,358 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 17,645 మంది గర్భిణులు, 17,042 మంది బాలింతలు ఉన్నారు. గతంలో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం కింద ప్రతి నెలా గర్భిణులు, బాలింతలకు ఒక కేజీ కందిపప్పు, మూడు కేజీల బియ్యం, అరకేజీ నూనె, ఐదు లీటర్ల పాలు, 25 గుడ్లు పౌష్టికాహారంగా అందజేసేవారు. వీటితో పాటు అటుకులు, చోడిపిండి, జొన్నపిండి కేజీ చొప్పున, ఎండు కర్జూరం, బెల్లం, చక్కీ పావు చొప్పున ఇచ్చేవారు. ప్రస్తుతం వీటి బదులు అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి రోజూ భోజనం పెడుతున్నారు. కాగా, గర్భిణులు, బాలింతల్లో కనీసం 50శాతం మంది కూడా అంగన్‌వాడీ కేంద్రాల్లో భోజనం చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒక్కో  అంగన్‌వాడీ కేంద్రంలో సుమారు 20 నుంచి 30 మంది లబ్ధిదారులు ఉండగా.. కనీసం పది మంది కూడా రావడం లేదు. కొంతమంది కేంద్రాలకు వచ్చినా సగం భోజనం చేసి.. తినలేక బయట పారవేస్తున్నారు. ఆ భోజనం అరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండతో కేంద్రాలకు రాలేమని స్పష్టం చేస్తున్నారు. పాత పద్ధతిలోనే పౌష్టికాహారాన్ని అందజేయాలని కోరుతున్నారు.

అవగాహన కల్పిస్తున్నాం
అంగన్‌వాడీ కేంద్రాల్లో మెనూ ప్రకారం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ అమలు చేస్తున్నాం. కేంద్రాలకు వచ్చి భోజనం చేసేందుకు కొంతమంది ఆసక్తి చూపడం లేదు. దీనిపై అవగాహన కల్పిస్తున్నాం.
- కె.అనంతలక్ష్మి, ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌

 

Updated Date - 2022-07-28T04:17:11+05:30 IST