కాల్వలు.. కష్టాలు..

ABN , First Publish Date - 2022-05-15T06:10:00+05:30 IST

కాల్వలు.. కష్టాలు..

కాల్వలు.. కష్టాలు..
గుడివాడ ప్రధాన కాల్వలో గుర్రపుడెక్క, తూడు

డెల్టా కాల్వల నిర్వహణ అస్తవ్యస్తం

ఖరీఫ్‌ సమీపిస్తున్నా కొలిక్కిరాని టెండర్‌ ప్రక్రియ

డ్రెయిన్‌ నీటితో దాహార్తి తీర్చుకుంటున్న గ్రామీణులు 

ఇంకా కళ్లు తెరవని యంత్రాంగం


కాల్వల నిర్వహణలో నీటి పారుదల శాఖ వైఫల్యం ప్రజలకు తాగునీటి కష్టాలు కలగజేస్తోంది. చివరి భూముల్లోని ఊర చెరువులు నింపుకోవడానికి సైతం కాల్వల నుంచి నీరు వెళ్లకపోవడంతో డ్రెయిన్ల నీటితో తాగునీటి చెరువులను నింపి మమ.. అనిపిస్తున్నారు. చేపల చెరువులకు మాత్రం అధికారులు దగ్గరుండి మోటార్లతో నీరు తోడిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.


గుడివాడ, మే 14 : ఆక్వా సాగు విస్తరించిన ప్రస్తుత తరుణంలో సాగునీటి కాల్వల నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేశారు. ఏటా ఖరీఫ్‌లో జూన్‌ నుంచి మార్చి నడుమ కాల్వ పూడికతీత, నిర్వహణకు రూ.కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ ఏడాది కూడా రూ.55 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇంతవరకు టెండర్‌ ప్రక్రియ మొదలు కాలేదు. ఏటా ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌ పనులను తూతూమంత్రంగా నిర్వహించడంతో కాల్వ చివరి భూములకు నీరు వెళ్లట్లేదు. ఎగువ ప్రాంతాల్లోని చేపల చెరువుల సాగుదారులు తూములు ఏర్పాటు చేసుకుని అక్రమంగా నీరు మళ్లిస్తుండటంతో దిగువ ప్రాంతాలకు అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కృష్ణాడెల్టా కాల్వలపై అజమాయిషీ మొత్తం నూతన కృష్ణాజిల్లా అధికారులకు చేరడంతో పరిస్థితిలో సానుకూల మార్పు వస్తుందని ప్రజలు, రైతులు ఆశిస్తున్నారు.  

గుడివాడ డ్రెయినేజీ డీఈ ఆఫీసులోనే కృష్ణాజిల్లా సర్కిల్‌

జిల్లాల విభజనతో జలవనరుల శాఖ రెండుగా విడిపోయింది. డెల్టాలోని బందరు, రైవస్‌, ఏలూరు, కరువు కాల్వల నిర్వహణ కృష్ణాజిల్లా పరిధిలోకి వచ్చాయి. వీటి కింద 6.79 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. కాల్వలకు నీటిని విడుదల చేసే ప్రకాశం బ్యారేజీ నిర్వహణ ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో ఉంది. కృష్ణాజిల్లా సర్కిల్‌ కార్యాలయాన్ని గుడివాడలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల సాగునీటి శాఖ అధికారులు గుడివాడలోని సాగునీటి వనరుల శాఖ కార్యాలయ సముదాయాల్ని పరిశీలించారు. ఇక్కడి డ్రెయినేజీ డివిజన్‌ కార్యాలయంలోనే కృష్ణా సర్కిల్‌ను ఏర్పాటుచేశారు. డ్రెయినేజీ ఈఈకి కృష్ణాజిల్లా సర్కిల్‌ ఎస్‌ఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. డ్రెయినేజీ విభాగమే సర్కిల్‌ కార్యాలయంగా మారడంతో అక్కడి నుంచే టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టాల్సి ఉంది. ప్రస్తుతం బందరు కాల్వలో 12.5 కిలోమీటర్ల పరిధిలో రూ.7.5 కోట్లతో పూడికతీత పనులు ప్రారంభించారు. మిగిలిన పనులకు రూ.55 కోట్లతో అంచనాలు రూపొందించారు. రబీకి సాగునీరు వదలకుండా క్రాప్‌ హాలీడే ప్రకటించి నిర్వహణ పనులు ముందస్తుగా చేపట్టాలని తలచారు. నిధులు, సిబ్బంది కొరతతో కొలిక్కి రాక టెండర్ల ప్రక్రియ ప్రారంభమే కాలేదు. దీంతో కాల్వ నిర్వహణ అస్తవ్యస్తంగా సాగుతోంది.  

చేపల చెరువులు కళకళ.. ఊర చెరువులు వెలవెల..

చేపల చెరువులు నూరుశాతం నీటితో కళకళలాడుతుంటే, ఊర చెరువులను డ్రెయిన్ల నీటితో నింపుకోవాల్సి రావడంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు. కాల్వలకు నీరు విడుదల చేసే సమయంలో చేపల చెరువుల యజమానులు మధ్యలో నీటిని తోడేయకుండా చూడాలని కోరుతున్నారు. కాల్వల్లోని పూడికను పూర్తిస్థాయిలో తీయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రధాన కాల్వల నుంచి నీటిని దారి మళ్లించేందుకు ముందుగా ఏర్పాటు చేసుకున్న తూములను చూసీచూడనట్లు వదిలేయడం సాగునీటి శాఖ అధికారులకు, చేపల చెరువుల యజమానులకు ఉన్న లాలూచీకి అద్దం పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. గుడివాడ రూరల్‌ మండలంలోని పలు గ్రామాల్లో మట్టి మాఫియా ఊర చెరువులను ఎండగట్టాయి. గుడివాడ ప్రధాన కాల్వలో గుర్రపుడెక్క, తూడు దట్టంగా పట్టేయడంతో నందివాడ మండలం తమిరిశ నుంచి కిందకు చుక్కనీరు వెళ్లడం లేదు. పోలుకొండ, అనమనపూడి, గాజులపాడు, గండేపూడి, పొణుకుమాడు, దండిగానపూడి గ్రామాలకు చంద్రయ్య డ్రెయిన్‌ మురుగునీరే గతి అవుతోంది. దోసపాడు కాల్వ నుంచి వెళ్లే అరిపిరాల బ్రాంచ్‌ కాల్వకు ఇలాంటి పరిస్థితే ఉండటంతో నందివాడ మండలంలోని అరిపిరాల, పోలాసివానిపాలెం, రామాపురం ఊర చెరువులను బుడమేరు మురుగునీటితో నింపుతున్నారు. దోసపాడు కాల్వ పెదవిరివాడ-కుదరవల్లి పరిధిలో నీటి ప్రవాహం లేకపోవడంతో కుదరవల్లి, ఇలపర్రు, పెదవరివాడ, ఎల్‌ఎన్‌ పురం గ్రామాల్లోని ఊర చెరువులు బుడమేరు డ్రెయిన్‌ నీటితో నింపుతున్నారు.

ప్రతి గ్రామానికి మంచినీరు : ఇరిగేషన్‌ డీఈఈ

ఇరిగేషన్‌ డీఈఈ కొడాలి బాబు వివరణ ఇస్తూ.. ప్రతి గ్రామానికి మంచినీటిని నింపుతామని స్పష్టం చేశారు. కాల్వలో నీరు విడుదల చేసిన సమయంలో ఊర చెరువులను నింపుకోవాలని కోరారు. 



Updated Date - 2022-05-15T06:10:00+05:30 IST