కరోనాలోనూ కేన్సర్‌ చికిత్స

ABN , First Publish Date - 2020-07-21T05:30:00+05:30 IST

కరోనా విస్తరించిన సమయంలో కేన్సర్‌ చికిత్సల పట్ల భయాలు నెలకొంటున్నాయి. కొన్ని కేన్సర్లు కరోనా లక్షణాలను పోలి ఉండడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది...

కరోనాలోనూ కేన్సర్‌ చికిత్స

కరోనా విస్తరించిన సమయంలో కేన్సర్‌ చికిత్సల పట్ల భయాలు నెలకొంటున్నాయి. కొన్ని కేన్సర్లు కరోనా లక్షణాలను పోలి ఉండడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. ఇలాంటప్పుడు ఎలా నడుచుకోవాలి? కేన్సర్‌ రోగులు ఎలా వ్యవహరించాలి?


దగ్గు, జ్వరం, ఊపిరి ఆడకపోవడం, తేలికగా అలసిపోవడం లాంటి కరోనా లక్షణాలు కొందరు కేన్సర్‌ రోగుల్లో కూడా ఉంటాయి. అలాగే వాపులు, నొప్పులు లాంటి లక్షణాలతో కొన్ని కేన్సర్‌లు బయల్పడుతూ ఉంటాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే, కేన్సర్‌ దశలు దాటి మరింత ముదిరిపోయే ప్రమాదం ఉంటుంది. కరోనా సోకుతుందేమోననే భయంతో ఆస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోకపోతే, కొన్ని కేన్సర్లను కనిపెట్టడం కష్టం. కాబట్టి భయంతో ఇంటికే పరిమితం కాకుండా ఈ లక్షణాలు కలిగినవారు తప్పక వైద్యులను సంప్రతించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. కరోనా ఇన్‌ఫెక్షన్‌ను కనిపెట్టడం కోసం చేసే సిటి స్కాన్‌ పరీక్షల్లో ఊపిరితిత్తులు, మెడ భాగాల్లో కేన్సర్‌ కారక కణుతులను గుర్తించిన సందర్భాలు ఉన్నాయి. అయితే గాలిలో తుంపర్లు ఎగసిపడే వీలున్న ఎండోస్కోపీ, బ్రాంకోస్కోపీ ప్రొసీజర్లకు వైద్యులు వెనకాడుతున్న పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో కరోనా సోకే వీలు లేని ఇమేజింగ్‌ విధానాలను అనుసరించవచ్చు. కరోనా లక్షణాలు కనిపించని, కనిపించే వారు ఇద్దరికీ ఇమేజింగ్‌ విధానం ద్వారా చేసే కేన్సర్‌ పరీక్షలతో వైద్యులకు కరోనా సోకే వీలు ఏమాత్రం ఉండకపోవడం విశేషం. కాబట్టి ఇలాంటి వెసులుబాట్లను ఉపయోగించుకోవడం అవసరం. 


కేన్సర్‌ రోగులకు కరోనా

 కీమోథెరపీ, సర్జరీ, రేడియోథెరపీ... ఈ మూడూ వ్యాధినిరోధకశక్తిని కుంటుపరిచేవే! కాబట్టి కరోనా ఇన్‌ఫెక్షన్‌ త్వరితంగా తీవ్రమయ్యేందుకు తోడ్పడే ఈ చికిత్సలను ప్రస్తుత కరోనా సమయంలో చేయించుకోవడం ఎలా? అనే విషయం గురించి ఎన్నో అనుమానాలు, ఆందోళనలు నెలకొని ఉంటున్నాయి. ఇలాంటప్పుడు ఈ చికిత్సలు చేసే ముందు ప్రతి కేన్సర్‌ రోగికీ మెదట కరోనా పరీక్షలు చేయడం తప్పనిసరి. అలాగే హైరిస్క్‌ కలిగి ఉన్న కేన్సర్‌ రోగులకు పి.సి.ఆర్‌ పరీక్షకు అదనంగా ఛాతీ ఎక్స్‌రే కూడా తీసి కరోనాను నిర్ధారించుకోవాలి. ఒకవేళ కరోనా సోకి ఉంటే, ఇచ్చే చికిత్సల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కొన్ని కేన్సర్‌ చికిత్సలు ఆలస్యం అయ్యే కొద్దీ రోగికి జరిగే నష్టం కూడా పెరిగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కరోనా పరీక్షా ఫలితం వచ్చేవరకూ వేచి చూడకుండా కేన్సర్‌ చికిత్స మొదలుపెట్టాలి. వైద్యులకు కరోనా సోకే వీలు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి.


- డాక్టర్‌ గీతా నాగశ్రీ

సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌

Updated Date - 2020-07-21T05:30:00+05:30 IST