కేన్సర్‌ సర్జరీలు - ట్రీట్మెంట్‌ తర్వాత

ABN , First Publish Date - 2021-09-07T05:30:00+05:30 IST

కేన్సర్‌ రోగుల అనుభవాలను తెలుసుకోవడం, జయించిన క్రమాన్ని

కేన్సర్‌ సర్జరీలు - ట్రీట్మెంట్‌ తర్వాత

కేన్సర్‌ గురించిన అనుమానాలకు మించి అవగాహన అవసరం. కణితి శరీర అంతర్గత అవయవాల్లో తలెత్తినా, రక్తానికి సంబంధించిన కేన్సర్‌ అయినా అవి చేతికి తగలవు. లక్షణాలు కూడా బయల్పడకపోవచ్చు. కొన్నిసార్లు ఆరోగ్య పరీక్షల్లో బయటపడవచ్చు. దాంతో రోగులు హఠాత్తుగా కుంగిపోతారు. అలాంటప్పుడే సమర్థమైన చికిత్సతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంచేలా కౌన్సెలింగ్‌ కూడా అవసరమే!


కేన్సర్‌ రోగుల అనుభవాలను తెలుసుకోవడం, జయించిన క్రమాన్ని తెలుసుకోవడం వల్ల కొంత మేరకు ఆత్మస్థైర్యం పొందుతారు. రోగి పరిస్థితి, మనస్తత్వం ఆధారంగా కౌన్సెలింగ్‌ ఇవ్వవలసి ఉంటుంది. ఫ్యామిలీ కౌన్సెలింగ్‌, గ్రూప్‌ కౌన్సెలింగ్‌, బిహేవియరల్‌ థెరపీ, కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీలు కూడా అవసరమవుతాయి. 


కేన్సర్‌లను తొలిదశలోనే గుర్తించి, కేన్సర్‌ సోకిన భాగంతో పాటు దాని చుట్టూ ఉండే కణజాలం, లింఫ్‌నోడ్స్‌లను తొలగించగలిగితే వ్యాధి చాలా వరకూ అదుపులో ఉంటుంది. పూర్తిగా నయమయ్యే అవకాశాలూ ఉంటాయి. ఈ రోజుల్లో కీహోల్‌ సర్జరీ ద్వారానే కేన్సర్‌ సర్జరీలు కూడా జరుగుతున్నాయి. ఈ సర్జరీలో మానిటర్‌ మీద పదింతలు పెద్దదిగా చూడగలిగే వీలుండడం వల్ల కచ్చితంగా సర్జరీ చేయడంతో పాటు, కీహోల్‌ గాయం చాలా తక్కువ సమయంలోనే మానిపోతుంది. రొమ్ము లేదా ఊపిరితిత్తుల కేన్సర్‌లలో తిరిగి రెండో దానికీ వచ్చే వీలుంది కాబట్టి చికిత్స పూర్తయిన తర్వాత కూడా ఫాలో అప్‌కు వెళ్లవలసి ఉంటుంది. మొదటి ఐదేళ్లలో కేన్సర్‌ తిరగబెట్టకపోతే ఆ వ్యాధి నుంచి బయటపడినట్టు భావించవచ్చు. 20, 30 ఏళ్ల తర్వాత కూడా కేన్సర్‌ తిరగబెట్టిన సందర్భాలూ లేకపోలేదు. 


కేన్సర్‌ సర్జరీ ముందు, తర్వాత, రేడియేషన్‌, కీమో, హార్మోన్‌, ఇమ్యునోథెరపీలు కేన్సర్‌ రకం, వ్యక్తి వయసు, దశల ఆధారంగా వైద్యులు నిర్ణయిస్తారు. చికిత్సతో దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ, వ్యాధి నుంచి బయటపడవచ్చనే నిజాన్ని రోగులు గ్రహించాలి. అత్యాధునిక రేడియేషన్‌ ప్రక్రియల ద్వారా 15 నిమిషాలు పట్టే చికిత్స 2 నిమిషాల్లోనే ముగుస్తోంది. అలాగే విగ్గుల మొదలు ఇంప్లాంట్స్‌ వరకూ కేన్సర్‌ చికిత్స తర్వాతి లోపాలను భర్తీ చేసే వెసులుబాట్లు ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి.


చికిత్స తీసుకోవడంతో పాటు కేన్సర్‌ విజయగాధలు, ఆటోబయాగ్రఫీలు చదవడం, యోగా, ధ్యానం, ఇతర వ్యాపకాలతో ప్రశాంతంగా జీవనం గడపడం అలవాటు చేసుకోవాలి. వైద్యుల సూచన మేరకు బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ వీలైనంత ఒత్తిడి లేని జీవితం గడపాలి. భయాందోళనకు గురి చేసే కేన్సర్‌ వార్తలు, కథనాలకు దూరంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి, వ్యాధి పట్ల అవగాహన పెంచుకుని, దాంతో ధైర్యంగా పోరాడగలిగితే కేన్సర్‌ను జయించడం సాధ్యమే!

   డాక్టర్‌ మోహన వంశీ

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,

ఒమేగా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

ఫోన్‌: 9848011421


Updated Date - 2021-09-07T05:30:00+05:30 IST