Abn logo
Sep 28 2021 @ 02:47AM

దీవెన వచ్చే.. ఎయిడ్‌ పాయె

  • ఒక స్కీమ్‌ ఇస్తే ఇంకొకటి ఎత్తేయడమే
  • జగనన్న విద్యా దీవెన ఇస్తున్నామంటూ 
  • ఎయిడెడ్‌ కాలేజీలకు సాయం కట్‌
  • తాజాగా పాలిటెక్నిక్‌కూ వర్తిస్తూ గెజిట్‌
  • ఇష్టమైతే భూములతో సహా స్వాధీనం
  • ఇతర అవసరాలకు వాటి వినియోగం
  • గెజిట్‌లో స్పష్టంచేసిన ప్రభుత్వం


అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఒక పథకం ఇస్తే, మరో పథకం ఎత్తేయడం! ఒక పథకం కొత్తగా పెడితే, దానికి సరిపడా ఒక పాత పథకం రద్దుచేయడం! ఒక పథకం కింద డబ్బులిస్తుంటే, దానికి రెట్టింపు మొత్తం ఏదో ఒక రూపంలో మళ్లీ పిండేయడం! సంక్షేమం పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని ఇదేనన్న విమర్శ ఇప్పటికే ఉంది. తాజాగా ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల విషయంలోనూ అదే పని చేసింది. జగనన్న విద్యాదీవన, జగనన్న వసతిదీవెన ఇస్తున్నాం కాబట్టి, ఇక ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలకు సాయం అందించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తేల్చేసింది. ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ల ఏర్పాటుకు స్థలాలు, భవనాలు, నిధులు, సామగ్రి తదితరాలను ఆయా ట్రస్టులే సమకూర్చాయి. ప్రభుత్వం మాత్రం కొంతమంది లెక్చరర్లకు జీతాల రూపంలో సాయం అందిస్తోంది. ఇప్పుడు ఆ సాయమూ ఆపేసింది. ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లోని లెక్చరర్లకు ఇస్తున్న జీతాలను ఇక ఇవ్వాల్సిన అవసరం లేదని నిర్ణయించింది. ఆ మేరకు ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సోమవారం గెజిట్‌ జారీచేసింది.


జగనన్న విద్యాకానుక, జగనన్న వసతిదీవెన కార్యక్రమాలు అమలుచేస్తున్నందున...ఇక ఎయిడెడ్‌ కళాశాలలకు సాయం చేయాల్సిన అవసరం లేదని ఆ గెజిట్‌లో అభిప్రాయపడింది. దీంతో ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల ముందు రెండో దారులు మిగిలాయి. ఇష్టమైతే అవి ఆస్తులతోసహా ప్రభుత్వంలో విలీనం కావొచ్చు. ఒకవేళ ఆస్తులతో విలీనమయ్యేందుకు అవి ఇష్టపడకపోతే లెక్చరర్లను ప్రభుత్వంలో విలీనం చేసేసుకుంటుంది. ఎయిడెడ్‌ కళాశాలల్లో ఉండగా ఇస్తున్న జీతాలనే వారికి ఇక్కడా చెల్లించడం వల్ల ప్రభుత్వంపై భారం ఉండదు. అయితే అలా లెక్చరర్లు ప్రభుత్వంలోకి వచ్చేయడం వల్ల ఇక్కడున్న ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే ఆ మేరకు ప్రభుత్వంపై ఆర్థికభారం తగ్గుతుందన్నమాట. కానీ ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలకు ప్రభుత్వ సాయం ఎప్పుడు కట్‌ అవుతుందో...అప్పుడవి ప్రైవేటు కళాశాలలుగా మారిపోతాయి. అలా మారిపోవాలని ప్రభుత్వమే చెప్తోంది. అంటే ప్రైవేటు కళాశాలలుగా మారాక...అక్కడ ఫీజులు పెంచుతారు. ఒకవేళ ఫీజులు పెంచకుంటే విద్య నాణ్యత దెబ్బతింటుందనే అభిప్రాయం ఉంది. ఏతావాతా విద్యార్థుల చదువులపై ఈ నిర్ణయం ప్రభావం పడుతుంది.


బాండ్‌ రాస్తేనే..

ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలను...వాటికి అంగీకారమైతే ఆస్తులతో సహా స్వాధీనం చేయాలని గెజిట్‌లో స్పష్టం చేశారు. మళ్లీ వెనక్కుతీసుకోవడానికి, రద్దు చేయడానికి వీల్లేని బాండ్‌ ద్వారా ఆస్తుల విలీనప్రక్రియ పూర్తిచేయాలని కోరారు. ఆ ఆస్తుల్లో విద్యకు అవసరమైన వాటిని ఉంచి...మిగిలినవాటిని ప్రజాప్రయోజనం పేరుతో ఇతర అవసరాలకు వాడుకోవచ్చనే వెసులుబాటును పెట్టారు. మరోవైపు ఎయిడెడ్‌ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నాక...ఇక మిగిలిన ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బంది ఉంటే...వారిని సదరు ఎయిడెడ్‌ కళాశాలల్లోనే  కొనసాగిస్తారు. కానీ దానికీ..‘అవసరమైనంత మందినే’ అనే నిబంధన పెట్టారు. అదేసమయంలో వారు భవిష్యత్తులో ఎప్పుడూ తమను క్రమబద్ధీకరించాలని అడగకూడదు. ఆ మేరకు ఒక బాండ్‌ కూడా రాసివ్వాలి. పాలిటెక్నిక్‌ కళాశాలల విలీన ప్రక్రియకు సంబంధించిన అంశాలను సాంకేతిక విద్యా కమిషనర్‌ తక్షణం చేపట్టాలని గెజిట్‌లో పేర్కొన్నారు.

క్రైమ్ మరిన్ని...