తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయండి

ABN , First Publish Date - 2021-04-21T08:19:13+05:30 IST

తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ అభ్యర్థి రత్నప్రభ మంగళవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాలు

తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయండి

ఫలితాలు ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వండి

హైకోర్టులో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ పిటిషన్‌

భారీగా అధికార పార్టీ అక్రమాలు

బస్సుల్లో వేల మందిని తెచ్చి దొంగ ఓట్లు వేయించారు

నకిలీ ఓటర్ల పరారీకి పోలీసులు సహకరించారు

ఫోర్జరీ గుర్తింపు కార్డుల సృష్టి

ఇందుకు ఆధారాలూ ఉన్నాయి

దొంగ ఓట్లపై పోలింగ్‌ రోజే ఆర్వో దృష్టికి తీసుకెళ్లాం

ప్రధాన కమిషనర్‌కూ లేఖ రాశాం

అయినా చర్యలు తీసుకోలేదు

వ్యాజ్యంలో రత్నప్రభ వెల్లడి


అమరావతి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ అభ్యర్థి రత్నప్రభ మంగళవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్ధించారు. ఎన్నికల అక్రమాలపై ఈ నెల 17న కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి తామిచ్చిన వినతి ఆధారంగా విచారణ జరిపి నివేదిక ఆందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌, తిరుపతి లోక్‌సభ రిటర్నింగ్‌ అధికారి, రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ ప్రధానమైనదని.. ఈ నెల 17న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్‌ స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరగలేదని పిటిషన్‌లో రత్నప్రభ పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందినవారు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని.. బూత్‌ ఆక్రమణ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని తెలిపారు.


అధికార పార్టీ కుతంత్రాలకు ఎన్నికల యంత్రాంగం మౌన సాక్షిగా నిలిచిందని ఆరోపించారు. ‘పోలింగ్‌ సందర్భంగా చట్టబద్ధమైన ఓటర్లకు బదులుగా నకిలీ ఓటర్‌ గుర్తింపు కార్డులతో దొంగ ఓట్లు వేయడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆ గుర్తింపు కార్డులపై సీరియల్‌ నంబరుతో ఓ స్టిక్కర్‌ అంటించి ఉంది. ఎన్నికల అధికారులు, పార్టీ ఏజెంట్లు ప్రశ్నించినప్పుడు దొంగ ఓటర్లు కనీసం తమ చిరునామా, తండ్రి పేరు వంటి ప్రాథమిక వివరాలు కూడా చెప్పలేకపోయారు. అధికారులు ప్రశ్నించడంతో మరికొంత మంది ఓటర్లు అక్కడ నుంచి పారిపోయారు. వేరే వారు వచ్చి దొంగ ఓట్లు వేయడంతో చట్టబద్ధమైన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా అధికారులు అడ్డుకున్నారు. దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వేల మందిని వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు.


బస్సుల్లో వచ్చినవారిని ప్రశ్నించగా.. స్థానిక అధికార పార్టీ నేతలు చెప్పినట్లు చేయాలని కోరినట్లు వారు తెలిపారు. రాష్ట్ర అధికార యంత్రాంగం సరిహద్దుల్లో బారికేడ్లు, చెక్‌ పోస్టులు తొలగించి మోసపూరిత చర్యలకు సహకరించింది. దొంగ ఓటర్లను పట్టుకోవాల్సిన పోలీసులు.. వారు అక్కడ నుంచి పారిపోయేందుకు సహకరించారు. అధికార పార్టీ వారు పోలీసుల సహకారంతో చట్టబద్ధ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా భయాందోళనలకు గురిచేశారు. అధికార పార్టీ నాయకులు ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు దొంగ ఓట్లు వేయించడంతో పాటు ఫోర్జరీ ఓటర్‌ గుర్తింపు కార్డులు సృష్టించారనడానికి ఆధారాలు ఉన్నాయి. ఎన్నికలు జరిగిన రోజే దొంగ ఓట్ల గురించి రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) దృష్టికి తీసుకెళ్లాం. ప్రజాప్రాతినిధ్య చట్టం మేరకు తగిన చర్యలు తీసుకోవడంలో ఆర్వో విఫలమయ్యారు. దొంగ ఓట్లు, అధికార పార్టీ వారి పోలింగ్‌ బూత్‌ల స్వాధీనం గురించి 17న ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు లేఖ రాశాం. అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాం. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 58ఏ(2)బి కింద అధికారాన్ని వినియోగించి ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరాం. అయితే రిటర్నింగ్‌ అధికారి, కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించాం’ అని పిటిషన్‌లో వివరించారు.

Updated Date - 2021-04-21T08:19:13+05:30 IST