ఎస్సీల సంక్షేమానికి స్వస్తి!

ABN , First Publish Date - 2020-07-11T07:44:55+05:30 IST

బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తామన్నారు! విద్య, ఉద్యోగరంగాల్లో వారు మరింత ముందుకెళ్లేలా చేయూత ఇస్తామనీ ప్రకటించారు. నాడు జగన్‌ చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలను

ఎస్సీల సంక్షేమానికి స్వస్తి!

  • పాత పథకాలను రద్దు చేసిన జగన్‌ ప్రభుత్వం
  • స్వయం ఉపాధి పథకాలకు గుడ్‌బై
  • విదేశీ విద్య, విద్యోన్నతికి గండి
  • ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులు నిల్‌
  • కార్పొరేట్‌ విద్యకు పేద పిల్లలు దూరం
  • మంజూరైన కమ్యూనిటీ హాళ్లు రద్దు
  • అంబేడ్కర్‌ స్మృతివనంపైనా నీలినీడలు
  • అన్నింటినీ నవరత్నాల్లోనే చూడాలట!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తామన్నారు! విద్య, ఉద్యోగరంగాల్లో వారు మరింత ముందుకెళ్లేలా చేయూత ఇస్తామనీ ప్రకటించారు. నాడు జగన్‌ చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలను చూసిన ఎస్సీలు... ఆయన ప్రభుత్వమొస్తే తమ కోసం మరిన్ని పథకాలు తెస్తారని, మేలు జరుగుతుందని ఆశ పడ్డారు. తీరా చూస్తే ఉన్న పథకాలనే జగన్‌ ప్రభుత్వం రద్దు చేసింది. సంక్షేమ మంటే ‘నవరత్నా’లే అన్నట్లుగా  ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఎస్సీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొత్త ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలన్నీ ఏడాదిలోనే ఆవిరయ్యాయని నిరాశ చెందుతున్నారు. గత ప్రభుత్వంలో ఏటా వేలాది మంది ఎస్సీ యువత తమ అభిరుచి మేరకు స్వయం ఉపాధి పథకాల కింద ప్రభుత్వం అందించే 60శాతం సబ్సిడీతో పలు రకాల యూనిట్లు ఏర్పాటు చేసుకునేవారు. దీనికోసం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఏటా సుమారు రూ.400కోట్ల దాకా ప్రభుత్వం ఖర్చు చేసేది.


టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా డ్రైవింగ్‌ వృత్తిలో ఉన్న యువతకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి ఇన్నోవా కార్లు అందజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో యంత్రాల కొనుగోలుకు సబ్సిడీ ఇచ్చింది. ఒక్కో యువకుడికి రూ.లక్ష నుంచి రూ.20లక్షల దాకా రుణసాయం అందించేందుకు బ్యాంకుల ద్వారా సహకారమందించింది. బ్యాంకులు రుణాలివ్వని సందర్భంలో ఎన్‌ఎ్‌సఎ ఫ్‌డీఎస్‌ సహకారంతో నేరుగా ప్రభుత్వమే రుణాలందించింది. కానీ, వైసీపీ ప్రభుత్వం ఈ తరహా పథకాలకు స్వస్తి చెప్పేసింది! 


విదేశీ విద్య అందని ద్రాక్షే

విదేశాల్లో చదవాలనుకున్న ఎస్సీ యువతకు టీడీపీ ప్రభుత్వం ‘అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌’ పథకాన్ని తెచ్చింది. విదేశాల్లో ప్రముఖ వర్సిటీల్లో సీట్లు పొందిన ఎస్సీ యువతకు మొదట రూ.10లక్షల ఆర్థిక సాయం అందించింది. ఆ తర్వాత మరో రూ.5లక్షలు పెంచి 15లక్షలు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు సివిల్స్‌కు అవసరమైన శిక్షణ కూడా ‘విద్యోన్నతి’ పథకం ద్వారా అందించింది. హాస్టల్‌ ఖర్చులకూ సాయం అందించింది. ఇప్పుడీ పథకాలే లేవు. 


ఎస్సీ కార్పొరేషన్‌ ఖాతా ఖాళీ!

దళితులకు ఎస్సీ కార్పొరేషన్‌ కల్పతరువులాంటిది. పలు పథకాలు ఈ కార్పొరేషన్‌ ద్వారా అందించేవారు. గేదెలు, ఆవులు, గొర్రెలు, మినీ డైరీ తదితర ప్రయోజనాలు పేద రైతులకు దీనిద్వారా సమకూర్చుతారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా వెట్టి, జోగినులకు పునరావాస కార్యక్రమాలు, పేద రైతుల పొలాల్లో బోర్లు, పంపుసెట్లు, విద్యుత్‌ సౌకర్యం, పేదలకు భూములు, ఇంటిస్థలాలు కొనుగోలు చేసి ఇవ్వడం, వడ్డీ లేని రుణాలు, స్వయం ఉపాధి యూ నిట్లుకు రుణాలు తదితర కార్యక్రమాలు అందేవి. జగన్‌ ప్రభు త్వం దీన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించింది. వీటికి చైర్మన్లను నియమించింది గానీ ఎలాంటి పథకాలూ అమలు చేయకుండా, ఒక్క పైసా కూడా కేటాయించకుండా వదిలేసింది! 


కార్పొరేట్‌ విద్యకు స్వస్తి!

గతంలో మెరికల్లాంటి ఎస్సీ విద్యార్థులను కార్పొరేట్‌ కళాశాలల ద్వారా ఇంటర్‌, డిగ్రీ చదివించేవారు. ప్రాథమిక విద్యను కూడా పేరొందిన కార్పొరేట్‌ పాఠశాలలో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల పేరుతో చదివించేవారు. అందుకు ఫీజు ప్రభుత్వమే చెల్లించేది. జగన్‌ ప్రభుత్వం ఈ అడ్మిషన్లు రద్దుచేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ విద్యార్థులు కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో చదివే అదృష్టం కోల్పోయారు. ఎస్సీ హాస్టళ్లను రెసిడెన్షియల్‌ స్కూళ్లుగా మార్చేందుకు టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ ప్రక్రియ మధ్యలో ఉండగానే అధికారంలోకి వచ్చిన వైసీపీ.. దానిని ఆపేసింది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల బడ్జెట్‌కు కోత విధించి మెనూను తగ్గించింది. గురుకుల భవనాల నిర్మాణాలు కూడా ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీల అభివృద్ధి కోసం మంజూరుచేసిన వందల కోట్ల పనులను జగన్‌ ప్రభుత్వం రద్దు చేసింది.


రూ.3వేల కోట్లతో చేపట్టదలచిన ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని సిమెంట్‌రోడ్ల పనులన్నీ ఒక్క జీవోతో రద్దు చేశారు. గత ప్రభుత్వం ప్రతి ఎస్సీ కాలనీకి ఒకటి చొప్పున వందలాది కమ్యూనిటీ హాళ్లు, జిల్లా కేంద్రాల్లో రూ.5కోట్లతో అంబేడ్కర్‌ భవనాలను మంజూరుచేసింది. కొత్త ప్రభుత్వంలో ఆ పనులన్నింటికీ స్వస్తి పలికారు. నిర్మాణంలో ఉన్న ఎస్సీల ఇళ్లన్నీ రద్దయ్యాయి. 


పనులు ప్రారంభమైనా తరలింపు

బీఆర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా టీడీపీ ప్రభుత్వం అమరావతి నడిబొడ్డున శాకమూరులో స్మృతివనం ఏర్పాటు చేయతలపెట్టింది. 20 ఎకరాల విస్తీర్ణంలో 125అడుగుల విగ్రహం, మెమోరియల్‌ పార్కు, బుద్ధ ధ్యానకేంద్రం, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. అందుకోసం మొదట రూ.97.69 కోట్లు మంజూరుచేశారు. పనులు 22శాతం పూర్తయ్యాయి. వైసీపీ ప్రభుత్వం ఈ పనులను నిలిపివేసింది. రాజధానిని తరలించే ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టింది. ఆ ప్రక్రియ పూర్తి కాకుండానేఅంబేడ్కర్‌ స్మృతివనంగా విజయవాడ స్వరాజ్‌మైదానాన్ని మార్చాలని నిర్ణయించింది. దళిత జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా పేర్కొంటున్న స్మృతివనం నిలిపేయడంపై ఎస్సీ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

Updated Date - 2020-07-11T07:44:55+05:30 IST