దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి

ABN , First Publish Date - 2022-07-12T08:24:03+05:30 IST

సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ సవాల్‌ చేశారు.

దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి

15 రోజుల్లో ఎన్నికలు వచ్చినా మేం సిద్ధం

యోగిపై విమర్శలు సిగ్గుచేటు: తరుణ్‌ చుగ్‌ 

గతంలో మేం చెబితేనే రద్దు చేశారా?: అరుణ నిరాశా నిస్పృహల్లో 

కూరుకుపోయిన కేసీఆర్‌: లక్ష్మణ్‌

కేసీఆర్‌ను ఓడిస్తేనే తెలంగాణకు 

పట్టిన శని విరగడ: ఈటల రాజేందర్‌


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ సవాల్‌ చేశారు. 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహించినా తాము సిద్ధమేనని, ప్రజలు బీజేపీకే పట్టం కడతారని, కేసీఆర్‌ ప్రభుత్వానికి మంగళం పాడుతారని అన్నారు. అయితే ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్‌ నిర్ణయిస్తుందనే విషయాన్ని కేసీఆర్‌ తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో తరుణ్‌ చుగ్‌ విలేకరులతో మాట్లాడారు. బీజేపీకి రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోందని, ప్రధాని మోదీ పట్ల తెలంగాణ ప్రజల్లో విశ్వాసం బలపడుతోందని చెప్పారు. సంకల్ప సభకు హాజరైన లక్షలాదిమంది ప్రజలు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేసినప్పటి నుంచి కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబం మొత్తం వణికిపోతోందన్నారు. ప్రధాని మోదీ లక్ష్యంగా ఆదివారం సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి పరాకాష్ఠ అని అన్నారు. ఈ మేరకు తరుణ్‌ చుగ్‌ సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ వస్త్రధారణను విమర్శించడం సిగ్గుచేటన్నారు. కాగా, తాము తేదీ చెబితేనే కిందటిసారి అసెంబ్లీని రద్దు చేశారా? ముందస్తు ఎన్నికలపై కేసీఆర్‌కు ఎందుకంత ఉలికిపాటు? అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి గెలిచినవాళ్లను కొనుగోలు చేస్తే అది ప్రజాస్వామ్యమా? వారిని మంత్రులుగా చేసినందుకు సిగ్గులేదా? అని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా గెలిచేందుకు మీ బిడ్డ (కవిత) ఎంతమంది కాళ్లు మొక్కారు? అని ప్రశ్నించారు. ప్రతి సర్వేలోనూ టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోతోందని తేలడంతో కేసీఆర్‌కు ఏం మాట్లాడాలో తోచడం లేదన్నారు. 


ప్రభుత్వ పాపాల పుట్ట పగిలింది..

కేసీఆర్‌ ప్రభుత్వ పాపాల పుట్ట పగిలిందని, ఆయన పాలనను ప్రజలు భరించలేకపోతున్నారని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. పుత్రవాత్సల్యం కారణంగా కాంగ్రె్‌సతోపాటు ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీ వంటి పార్టీలు ఎలా పతనమయ్యాయో టీఆర్‌ఎ్‌సకూ అదే గతి పడుతుందన్నారు. కేసీఆర్‌ నిరాశ నిస్పృహలో కూరుకుపోయారని వ్యాఖ్యానించారు. కాగా, కేసీఆర్‌ శక్తి, ధైర్యం, ఆయన పిరికితనం, ఆయన వ్యూహాలు తనకు తెలుసునని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఆయనను ఓడిస్తేనే తెలంగాణకు పట్టిన శని విరగడవుతుందన్నారు. అందుకే తాను గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తానని ప్రకటించినట్లు తెలిపారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో కేసీఆర్‌కు మతి తప్పిందని, ఆయనను కొట్టే శక్తి ఈటలకే ఉందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. తన భూములకు సంబంధించి తన భార్య మాటలకు కేసీఆర్‌కు సిగ్గుంటే చచ్చిపోవాలని ఈటల వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ఎనిమిదేళ్లలో సాధించింది విపక్షాల ఎమ్మెల్యేలను ఆకర్షించడమేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ విమర్శించారు. తాను గొప్ప పరిపాలనదక్షుడిగా ప్రచారం చేసుకునే కేసీఆర్‌ వైఖరి కారణంగానే ప్రభుత్వ ఉద్యోగులు సకాలంలో జీతాల కోసం ఆందోళనలు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  

Updated Date - 2022-07-12T08:24:03+05:30 IST