ఓట్ల కోసం చరిత్రను రద్దు చేస్తారా!

ABN , First Publish Date - 2020-09-17T06:29:31+05:30 IST

ఆత్మగౌరవంతో బతికేందుకే తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అయితే తెలంగాణ ప్రస్తుత పాలకులు ఆత్మగౌర ప్రతీక అయిన చరిత్రాత్మక సెప్టెంబర్ 17ని విమోచన...

ఓట్ల కోసం చరిత్రను రద్దు చేస్తారా!

ఆత్మగౌరవంతో బతికేందుకే తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అయితే తెలంగాణ ప్రస్తుత పాలకులు ఆత్మగౌర ప్రతీక అయిన చరిత్రాత్మక సెప్టెంబర్ 17ని విమోచన దినోత్సవంగా జరపకపోవడం అత్యంత దురదృష్టకరం, అవమానకరం, బాధాకరం.


హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం రాజులు ఈ ప్రాంతంలోని ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎప్పుడూ పరిపాలన కొనసాగించలేదు. అప్పట్లో చదువుకున్న కొందరు మేధావులు మన సమస్యలను గుర్తించి 1901లో గ్రంథాలయ ఉద్యమం పేరుతో అక్షర జ్ఞానాన్ని ఇచ్చి ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించారు. ఆ తర్వాత 1930లో ఆంధ్రమహా సభ పేరుతో ప్రతి సంవత్సరం సమావేశాలు నిర్వహించి ఇక్కడ ఉన్న సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా కూడా ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. కొద్దికాలం తర్వాత ఆంధ్రమహాసభలో చీలిక వచ్చి అతి, మిత వాద గ్రూప్‌లుగా ఏర్పడి నిజాం పరిపాలనపై సాయుధ పోరాటం చేయడం ఆరంభించారు. ఈ పోరాటాన్ని 1947 ఆగష్టు 15 తర్వాత ఇంకా ఉధృతం చేసారు. ప్రజల పోరాటాల ఫలితంగానే నిజాం నవాబు 1948 సెప్టెంబర్ 17న భారత సైన్యానికి లొంగిపోయారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిందని భావించిన తెలంగాణ ప్రజలకు కొద్దికాలానికే తెలిసి వచ్చింది ఏమంటే పొరుగు రాష్ట్రం వారు ఇక్కడికి వచ్చి మన వారిపై పెత్తనం చేస్తున్నారని! 1956లో పెద్దమనుషుల ఒప్పందం పేరుతో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర్ం విలీనమై ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకపోవడంతో 1969లో తొలిదశ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్స్‌ను ఢిల్లీ పాలకులకు వినిపించేలా చేసి, వందలాది విద్యార్థులు పోలీస్ తూటాలకు అమరులు అయ్యారు. ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు కానీ ఎన్నడూ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. వారే ఇప్పుడు పాలకులుగా ఉన్నారు. మరి సెప్టెంబర్ 17ని విమోచన దినోత్సవంగా ఎందుకు నిర్వహించడం లేదు? ఎవరి ఓట్ల కోసం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ చిహ్నానికి గుర్తింపు అయిన విమోచన దినోత్సవంను పక్కన పెట్టారు? ఆత్మగౌరవం కోసం ప్రాణాలు అర్పించిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కొమరం భీమ్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న వారసుల రక్తం మరిగి మరో ఉద్యమంలా మారి పాలకులను దహించి వేయక ముందే బాధ్యత గుర్తెరగాలి. ఉద్యమంలో ఊకదంపుడు ఉపన్యాసాలు వల్లెవేసిన మేధావులు, సెక్యులరిస్టులు, కమ్యూనిస్టు, కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనం దాల్చారు? రాష్ట్ర ప్రభుత్వం చరిత్రను గుర్తెరిగి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.

రేకులపల్లి భాస్కర్ రెడ్డి

Updated Date - 2020-09-17T06:29:31+05:30 IST