Canberra airport: విమానాశ్రయంలో తుపాకి కాల్పులు.. పోలీసుల అదుపులో అనుమానితుడు

ABN , First Publish Date - 2022-08-14T22:51:25+05:30 IST

ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా విమానాశ్రయం(Canberra airport)లో కాల్పుల కలకలం రేగింది. చెక్ ఇన్ ప్రాంతంలో సాయుధుడు

Canberra airport: విమానాశ్రయంలో తుపాకి కాల్పులు.. పోలీసుల అదుపులో అనుమానితుడు

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా విమానాశ్రయం(Canberra airport)లో కాల్పుల కలకలం రేగింది. చెక్ ఇన్ ప్రాంతంలో సాయుధుడు ఐదు రౌండ్లు కాల్పులు జరపడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని, అతడి నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.


విమానాశ్రయంలో కాల్పులు ఘటనలో మరెవరైనా ఉన్నారా? అన్న అనుమానంతో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు అనుమానితుడు ఒక్కటే ఈ ఘటనకు పాల్పడినట్టు నిర్ధారించారు. కాగా, కాల్పుల ఘటనలో ఎవరూ గాయపడలేదని ఏసీటీ పోలీసులు తెలిపారు. అయితే, తుపాకి తూటాలు గోడల్లోకి చొచ్చుకెళ్లి రంధ్రాలు చేశాయని, కిటికీ అద్దాలు పగిలిపోయాయని పేర్కొన్నారు. కాల్పుల నేపథ్యంలో ప్రయాణికులందరినీ విమానాశ్రయం నుంచి ఖాళీ చేయించారు.


తుపాకి కాల్పులు జరిగినప్పుడు తాను అప్పుడే సెక్యూరిటీ చెక్ కోసం బ్యాగులు పెట్టానని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తాము సెక్యూరిటీ చెక్ వద్ద ఉన్నప్పుడు తుపాకి చప్పుళ్లు వినిపించాయని, వెనక్కి తిరిగి చూస్తే ఓ వ్యక్తి పిస్టల్ పట్టుకుని కారు డ్రాప్ ఆఫ్ వైపు చూస్తూ కనిపించాడని ఆమె పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యగా టెర్మినల్ నుంచి ఖాళీ చేయించారని, ఆ సమయంలో ఎవరూ లోపలికి వెళ్లొద్దని పోలీసులు కోరారని ఆమె తెలిపారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత విమాన సర్వీసులను పునరుద్ధరించారు. 

Updated Date - 2022-08-14T22:51:25+05:30 IST