అదరగొట్టిన కెనరా బ్యాంక్‌

ABN , First Publish Date - 2022-01-28T05:35:30+05:30 IST

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ..

అదరగొట్టిన కెనరా బ్యాంక్‌

  • క్యూ3 లాభంలో 116% వృద్ధి


బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో నికర లాభం ఏకంగా 115.80 శాతం వృద్ధి చెంది రూ.1,502 కోట్లుగా నమోదైందని బ్యాంక్‌ వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.696 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం పెరగటంతో పాటు ప్రొవిజనింగ్స్‌ తక్కువ స్థాయిలో ఉండటం కలిసి వచ్చిందని ఆర్థిక ఫలితాలు వెల్లడించిన సందర్భంగా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ తెలిపారు. త్రైమాసిక సమీక్షా కాలం లో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.21,312 కోట్లుగా ఉందన్నారు.


త్రైమాసిక కాలంలో నికర వడ్డీ ఆదాయం రూ.6,087 కోట్ల నుంచి రూ.6,946 కోట్లకు పెరిగిందన్నారు. స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఎ) 7.80 శాతంగా ఉండగా నికర ఎన్‌పీఏలు 2.64 శాతం నుంచి 2.86 శాతానికి పెరిగినట్లు ఆయన చెప్పారు. కాగా ఈ కాలంలో మొండి బకాయిలు రూ.2,699 కోట్లుగా ఉండగా రైటాఫ్‌ చేసిన ఖాతాల నుంచి చేసిన రికవరీలతో పాటు మొత్తం నగదు రికవరీలు రూ.2,784 కోట్లుగా ఉన్నాయని ప్రభాకర్‌ వెల్లడించారు. మరోవైపు డిసెంబరు త్రైమాసికంలో మొండి పద్దుల కోసం చేసిన కేటాయింపులు 35.56 శాతం తగ్గుదలతో రూ.2,946 కోట్లుగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ కేటాయింపులు 4,572 కోట్లుగా ఉన్నాయి. కాగా డిసెంబరు త్రైమాసికంలో  కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన బ్యాంక్‌ నికర లాభం ఏకంగా మూడింతలు పెరిగి రూ.1,631 కోట్లుగా నమోదైంది. 

Updated Date - 2022-01-28T05:35:30+05:30 IST