కాలువలకు అడ్డుకట్టలతో పొలాలు ముంపు

ABN , First Publish Date - 2022-08-09T07:10:03+05:30 IST

పంట కాలువలను పూడ్చి వేయడంతో వర్షపునీరు ముందుకు పారక పొలాలు నీటమునిగి నష్ట పోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాలువలకు అడ్డుకట్టలతో పొలాలు ముంపు

కొవ్వూరు, ఆగస్టు 8: పంట కాలువలను పూడ్చి వేయడంతో వర్షపునీరు ముందుకు పారక పొలాలు నీటమునిగి నష్ట పోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో రైతు సూరపనేని శివరామకృష్ణ పంట కాలువలు, మురుగునీటి కాలువలకు వేసిన అడ్డుకట్టలను తొలగించి రైతులను పంట ముంపు నుంచి కాపాడాలని కోరుతూ ఇన్‌చార్జి ఆర్డీవో గీతాంజలికి వినతిపత్రం అందజేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీరు కిందకు వెళ్లే మార్గం లేకపోవడంతో కొవ్వూరుదొమ్మేరు రోడ్‌లోని పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా రహదారికి ఇరుప్రక్కలా ఉన్న పొలాలు నీటముంపునకు గురయ్యాయన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదన్నారు. పట్టణ పరిధిలో వేసిన లేఅవుట్‌లతో వర్షపునీరు దిగువకు పోయే కాలువలకు అడ్డుకట్టలు వేసి పూడ్చి వేశారన్నారు. దీంతో పంట చేలలో నీరు బయటకుపోయే మార్గం లేక రోజుల తరబడి ముంపులో ఉండ డంతో పంట కుళ్లి పోతుందన్నారు. ఇప్పటికే రెండుసార్లు నారు ఊడ్చామని మరోసారి వర్షాలు కురవడంతో నారు కుళ్లిపోయి తీవ్రంగా నష్ట పోతున్నామన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి పంట పొలాల్లో నిలిచిన నీరు బయటకు పోయే విధంగా పంట కాలువలు, మురుగు కాలువలకు వేసిన అడ్డకట్టలు, తూరలు తొలగించి రైతులను నష్టాలనుంచి కాపాడాలని కోరారు.

Updated Date - 2022-08-09T07:10:03+05:30 IST