కన్నీటి కష్టాలు

ABN , First Publish Date - 2021-06-13T05:40:17+05:30 IST

వ్యవసాయానికి నీరే ప్రాణం.. సాగు సాఫీగా సాగాలంటే కాల్వలు ఏ అడ్డంకులూ లేకుండా జలజలా పారాలి..కానీ ఇప్పుడు ప్రధాన కాల్వలతో పాటు పంటకాల్వలు కూడా తూడు,చెత్తతో నిండిపోతున్నాయి.

కన్నీటి కష్టాలు
చెత్త, తూడుతో నిండిపోయిన లోసరి మెయిన్‌ పంట కాలువ

ప్రవాహానికి అడుగడుగునా అడ్డంకులు

ఊసే లేని డెల్టా ఆధునికీకరణ

మరమ్మతులకు ముందుకు రాని కాంట్రాక్టర్లు

ప్రమాదపు అంచుల్లో ప్రధాన కాల్వలు

తూడు, చెత్తతో పూడుకుంటే నీరు పారేనా..?

సాగు చేసేదెలా ? రైతుల్లో ఆందోళన


వ్యవసాయానికి నీరే ప్రాణం.. సాగు సాఫీగా సాగాలంటే కాల్వలు ఏ అడ్డంకులూ లేకుండా జలజలా పారాలి..కానీ ఇప్పుడు ప్రధాన కాల్వలతో పాటు పంటకాల్వలు కూడా తూడు,చెత్తతో నిండిపోతున్నాయి. దీంతో ఏటా రైతులు నానా అవస్థలు పడుతున్నారు..కొన్నిచోట్ల చేలల్లోకి నీరు చేరదు.. మరికొన్ని చోట్ల ముంపు లాగదు.. ప్రభుత్వం కాల్వల ఆధునికీకరణ పేరుతో కోట్ల రూపాయలు వెచ్చించి పూడికతీత, గట్లు పటిష్టం, డ్రెయిన్లలో చెత్త, గుర్రపుడెక్క తొలగింపు, స్లూయిజ్‌లు, లాకుల మరమ్మతులు వంటి పనులు చేపట్టేది.. కానీ రెండు సంవత్సరాలుగా ఈ పనులు  పడకేశాయి.. కనీస నిర్వహణ కూడా కరువైంది.. ఎక్కడికక్కడ పంట కాల్వల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది.. ఈ నెల 15 నుంచి కాల్వలకు నీరు విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.. ఈ పరిస్థితిలో తమ చేలకు నీరందుతుందా లేదా అనే ఆందోళనలో రైతులున్నారు...


నిడదవోలు, జూన్‌ 12 : ఈ ఏడాది ఆధునికీకరణ పనులకు ప్రభుత్వ అనుమతులు రాకపోవడంతో పనుల ఊసే లేదు. నీటి పారుదల శాఖకు పశ్చిమ డెల్టా పరిధిలో నిర్వహణ పనులకు ప్రభుత్వం నుంచి 136 పనులను రూ.13 కోట్లతో చేపట్టేందుకు అనుమతులు మంజూరుచేసింది. అధికారులు ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పం దన రాలేదు. గతంలో చేసిన పనులకే నేటికి బిల్లులు మంజూరు కాకపోవడం, కరోనా వైరస్‌ కర్ఫ్యూ వంటి కారణాలతో కాంట్రా క్టర్లు టెండర్లు వేసేందుకు వెనుకడుగు వేశారు. ఈ నెల 15 నుంచి అన్ని కాల్వలకు తాగు, సాగునీరు విడుదల చేసేం దుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇక స్లూయీజ్‌లు, వియ్యర్లు, లాకుల షట్టర్లు మరమ్మతు పను లపై సందేహం నెలకొంది. రూ.7 కోట్లతో 73 పనులు చేపట్టేం దుకు టెండర్లు ఖరారు కాగా నేటికీ రూ.6 కోట్లతో చేపట్టే 63 పనులకు టెండర్లే రాలేదు. ఇక ఈ ఏడాది నిర్వహణ మర మ్మతు పనులు కొండె క్కినట్టేనని భావిస్తున్నారు. కాల్వలు ఎక్కడా పూడికలు తీయ లేదు. దీంతో ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  


 ప్రమాదంలో నరసాపురం కాల్వ 

పాలకొల్లు రూరల్‌ : పశ్చిమ డెల్టాలో ప్రధానమైన నరసా పురం కాలువ పెరవలి నుంచి మొగల్తూరు శివారు వరకు 50 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ కాల్వపై 90 వేల ఎకరాల ఆయ కట్టు ఆధారపడి ఉంది. దీర్ఘకాలికంగా కాల్వ నిర్వహణ సరిగా లేకపోవడంతో ఏటా ప్రధాన కాల్వతోపాటు దీనిపై ఆధారపడిన ఉపకాలువలు ప్రమాదపంచుల్లో కనిపి స్తుం టాయి. చిన్నపాటి వర్షం వస్తే బలహీనంగా ఉన్న కాల్వ గట్లకు గండిపడి ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుం దోనని రైతులతో పాటు కాలువ వెంబడి గ్రామస్థులు భయపడు తున్నారు. ఆధునికీక రణలో భాగంగా పదేళ్ల కిందట రూ.132 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలనుకున్నా పది శాతం పనులు నేటికి నోచు కోలేదు. ఈ ఏడాది ప్రభుత్వానికి రూ.125 కోట్లతో ప్రతిపాదనలు వెళ్లినా అనుమతులు నోచుకోలేదు. ఓ అండ్‌ఎం నిధులు రూ.9 కోట్లతో పలు పనులను ప్రతిపాదిం చిన సకాలంలో టెండర్లు పిలవకపోవడం.. పిలిచిన వాటికి బకాయిల పేరుతో టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందు కు రాకపోవడం వంటి వాటి వల్ల పది శాతం మాత్రమే పనుల్లో కదలిక కనిపించింది. 


పి.పోలవరం–మొగల్తూరు కాల్వ దుస్థితి..

నిడదవోలు–నరసాపురం ప్రధాన కాల్వ నుంచి పి.పోలవరం మీదుగా మొగల్తూరు వరకు వేలాది ఎకరాలకు సాగునీరు, అనేక గ్రామాల ప్రజలకు తాగునీరు అందిస్తున్న పి.పోలవరం– మొగల్తూరు కాల్వ దుస్థితిపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వలో తుక్కు తూడు మొలిచి నీటిప్రవాహం జరగడం లేదని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులను కాంట్రాక్టుదారులకు అప్పగించించినప్పటికీ పనులు నత్తనడకన సాగడంతో కాల్వల పరిస్థితి దయనీయంగా మారింది.


శిథిలావస్థలో స్లూయిస్‌లు

నరసాపురం : నరసాపురం తీర ప్రాంతంలో స్లూయిస్‌ తలుపులు రిపేరు చేయకపోవడం వల్ల గోదావరి పాటు పోటులకు ఉప్పునీరు పంట కాల్వలో చేరి వ్యవసాయభూములు చౌడుబారుతున్నాయి. రెండేళ్లుగా ప్రభుత్వం తలుపుల మరమ్మతులు కూడా చేయలేదు. పట్టణంలోని ఐదు తూములు, సరిపల్లి, ఈస్ట్‌ కొక్కిలేరు, ధర్భరేవు స్లూయిస్‌ తలుపులు శిఽథిలావస్థకు చేరాయి. లీకేజీలు ఏర్పడటం వల్ల ఉప్పునీరు పంట కాల్వలోకి చేరుతోంది. దీనివల్ల వందలాది ఎకరాలు చౌడు బారుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలని అనేక మార్లు రైతులు ఉద్యమించారు. ఇదిగో.. అదిగో.. రిపేర్‌ అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఈ కారణంగా గతేడాది దర్భరేవు ప్రాంతంలోని కొంత మంది రైతులు రెండో పంట వేయలేదు.


ప్రతిపాదనలే.. పనుల్లేవు 

 వీరవాసరం : వీరవాసరం పశ్చిమ కాలువ..  వేండ్ర నుంచి మత్స్యపురి వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కాలువ గట్లు బలహీనంగా ఉండి, రహదారుల వెంబడి గట్లు కోతకు గురైనప్పటికీ వీటి మరమ్మతులకు ప్రతిపాదనలు చేస్తున్నారు. శివారు ఆయకట్టుగా వున్న మత్స్యపురి భూములకు సాగునీరు ఇబ్బందుల దృష్ట్యా రైతులు శివారున వున్న డ్యాంనకు లాక్‌ ఏర్పాటు చేయా లని కోరారు. నరసాపురం సబ్‌ కలెక్టర్‌గా వున్న కేఎస్‌ విశ్వనాథన్‌ సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వ డంతో ఈ పనులకు కూడా ప్రతిపాదనలకు వెళ్లింది. ఈ ఏడాది పనులలో ప్రతిపాదనలే తప్ప పనులు లేకుండా పోయాయి. 

 తణుకు : తణుకు ఇరిగేషన్‌ కాల్వలో తూడు పేరుకుపో యింది. గతేడాది మరమ్మతులు చేపట్టడం వల్ల కాల్వలు పటిష్టంగానే ఉన్నప్పటికీ పెద్దఎత్తున తూడు పేరుకుపోయింది. 89 కిలోమీటర్లు పొడవువున్న జీఅండ్‌వీ, భీమవరం, అత్తిలి కెనాల్లో వున్న తూడు తొలగింపునకు సుమారు రూ.50 లక్షలతో ప్రతిపాదనలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పనులు ప్రగతి ఏమాత్రం కనిపించలేదు. నీటి ప్రవాహంపై దీని ప్రభావం కనిపించనుంది. 


ఏలూరు కాల్వకు చెట్లే అడ్డంకి

ఉంగుటూరు : ఏలూరు ప్రధాన కాల్వ ప్రవాహానికి చెట్లు అడ్డంకిగా ఉన్నాయి. ఉంగుటూరు, నారాయ ణపురం, చేబ్రోలు, కైకరంల వద్ద కాల్వ  వెంబడి చెట్లు నీటి ప్రవాహం మట్టానికి వేళ్లాడుతూ నాటు పడవల ప్రయాణాలకు అడ్డంకిగా ఉన్నాయి. గతంలో నీటి సంఘాలు ఉన్నప్పుడు కాల్వ వచ్చే సమయానికి జేసీ బీలతో పూడిక తీసి మమ అనిపించేవారు. ఇరిగేషన్‌ అధికారులు ఆయా ప్రాంతాలలో అధికార పార్టీల నాయ కులు, సామిల్లుల వారు ఎటువంటి అనుమతులు లేకుండా కాల్వ వెంబడి ఉన్న చెట్లను కోత యంత్రాలతో ట్రాక్టర్లపై అక్రమ రవాణా చేస్తున్నారు. అయినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.


తూడుతో తంటాలు

 ఆకివీడు : వెంకయ్య వయ్యేరు పంట కాల్వలో తూడు, గుర్రపు డెక్క పేరుకుపోయింది. రైతులతోపాటు శివారు ప్రాం త ప్రజలకు తాగునీటికి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల మంచినీటి అవసరాలకు తూడు, గుర్రపుడెక్క తొలగించకుండా నీరు వదలడంతో ఆ నీటిని పశువులు తాగడంతో పాల దిగుబడి తగ్గిపోయిందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చినకాపవరం, ఆవిశాల మురుగు కాల్వలు అభివృద్ధి చేయకపోవడంతో  ఏటా ముంపు బారిన పడుతున్నామని రైతులు చెబుతున్నారు. 

 భీమవరం రూరల్‌ : పంట, మురుగు కాల్వల్లో ఈ ఏడాది మట్టి పూడికతీతలు లేవు. వేసవిలో కాల్వ పనులు జరగకుండా ఇంతకు ముందు ఎప్పుడూ లేదని రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. భీమవరం మండలం అనాకోడేరు చానల్‌, లోసరి మెయిన్‌ కాలువ, ముత్యంకోడు, తుందుర్రు కాలువ, యనమదుర్రు ప్రధాన పంట కాల్వల్లో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదు. 12 వేల ఎకరాల్లో వరి సాగుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.  

 ఆచంట : సిద్ధాంతం–కోడేరు బ్యాంకు కెనాల్‌కు సంబంధించి ఈసారి ఎటువంటి పనులు చేపట్టలేదు. బ్యాంకు కెనాల్‌ గట్లు బాగానే ఉన్నప్పటికి అనేకచోట్ల ఇరువైపులా పెద్దపెద్ద పిచ్చిమొక్కలు మొలిచి కాలువను కప్పేయడంతో నీటి సరఫరాకు ఇబ్బంది అవుతుంది. మురుగు డ్రెయిన్లు పూర్తిగా గుర్రపుడెక్కతో నిండిపోయాయి. కొన్ని రోజులుగా గుర్రపు డెక్క కుళ్లి పోవడానికి స్ర్పే చేస్తున్నారు. 

 ఉండి : యండగండి మీడియం డ్రెయిన్‌ పరిధిలో సుమారు 2,800 ఎకరాలకు పైగా వరిసాగు సాగుతుంది. ఇప్పటికే గుర్రపుడెక్క, తూడు పేరుకుపోయాయి. వేసవిలో అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో సార్వా ఎలా చేయాలో తెలి యని పరిస్థితి రైతుల్లో నెలకొంది. బొండాడ డ్రెయిన్‌ కూడా అభివృద్ధికి నోచుకోకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 భీమడోలు : ఏలూరు గోదావరి కాల్వలో పేరుకుపోయిన గుర్రపు డెక్క కారణంగా రానున్న వ్యవసాయ నీటి అవస రాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. పలు గ్రామాల్లో సాగునీటి అవసరాలకు గతనెల 29 నుంచే ఏలూరు కాల్వకు నీటి విడుదల చేయడంతో అధికారులు ప్రతి ఏడాది తొలగించే గుర్రపు డెక్క ఈ ఏడాది తొలగించలేదు. పూళ్ళ, కురెళ్ళగూడెం, భీమడోలు, గుండుగొలను గ్రామాల వరకూ గుర్రపు డెక్క పేరుకుపోయింది. 

 పెంటపాడు  : పెంటపాడు మిడ్‌ లెవిల్‌ కాల్వలో అధికారులు తూడు ప్రక్షాళన పనులు చేపట్టి మందులు చల్లి తొలగించారు. పైకి తేలిన తూడు కాల్వలోనే వది లేయడంతో సమస్య యథావిధిగా ఉంది. కాలువ మధ్య వున్న డ్యాం వద్ద తూడు నిలిచిపోతుంది. పైకి తేలిన తూడును శుభ్రంగా తొలగిస్తే కాలువ నీరు వేగంగా ప్రవహిచేందుకు వీలుంటుందని రైతులు కోరుతున్నారు.

 పెనుగొండ  : మండలంలో నరసాపురం ప్రధాన కాలువ  నుంచి యల్లప్పకాలువ ద్వారా సుమారు 8 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఈ ఏడాది కాల్వలకు ఎటువంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రధాన కాల్వలకు ఇబ్బంది లేకపోయినా పిల్ల కాల్వలకు సాగునీరు ఇబ్బందులు తప్పవని రైతులు చెబుతున్నారు. పిల్ల కాల్వల్లో అక్కడక్కడ తూడు పేరుకుపోయి ఉందన్నారు. 

 పెరవలి : మండలంలో సుమారు ఎనిమిది వేల ఎకరాల వరి పంటకు, రెండు వేల ఎకరాల ఉద్యాన పంటలకు ప్రధాన పంట కాల్వల ద్వారా నీరు అందుతుంది. ఈ ఏడాది  మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రధాన పంట కాల్వలకు ఇబ్బంది లేకపోయినా చిన్న పంట కాల్వల్లో తూడు, గుర్రపు డెక్క పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల రైతులే చిన్న చిన్న కాల్వలను శుభ్రం చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో మందు పిచికారీ చేసి తూడు, గుర్రపుడెక్క తొలగిస్తున్నారు. 

 కాళ్ల : కాళ్ల మండలంలో ప్రధాన పంట కాల్వలు పూర్తిగా పూడుకుపోయి అటు తాగు, సాగునీరు ఇబ్బందిని రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో కాల్వల ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడంతో అధిక వర్షాలు కారణంగా మండలంలో చాలా గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. వెంకయ్య వయ్యేరు, కె.లంక చానల్‌, బొండాడ కాల్వ, అజ్జమూరు కాల్వ, మేడవరం కాల్వ, అన్నయ్యకోడు చానల్‌తో పాటు ప్రధాన మురుగు డ్రెయిన్లు రుద్రాయికోడు, బొండాడ, మొగదిండి డ్రెయిన్లు సైతం పూర్తిగా పూడుకుపోయాయి. కొన్ని గ్రామాల ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా కాల్వలను బాగు చేసుకున్నారు. 

 ఉండ్రాజవరం : రామయ్యకుంట కాల్వ, సుబ్బారాయుడు కాల్వలు ఉన్నాయి. ఇవి పూడిక తీత, మరమ్మతు పనులకు నోచుకోలేదు. రెండు కాల్వల పరిధిలో సుమారు 2 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. కాల్వ గట్లు బలహీనంగా ఉండడంతోపాటు తూడు గుర్రపు డెక్క పేరుకుపోయాయి. వర్షాలు వస్తే కింది పొలాలకు నీరు వెళ్లక ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. 






Updated Date - 2021-06-13T05:40:17+05:30 IST