నిర్లక్ష్యం ఎక్కడెక్కడ..?

ABN , First Publish Date - 2022-05-02T05:49:59+05:30 IST

నిర్లక్ష్యం ఎక్కడెక్కడ..?

నిర్లక్ష్యం ఎక్కడెక్కడ..?
చిన్నాపురం వద్ద గుండేరు డ్రెయిన్‌లో పేరుకున్న గుర్రపుడెక్క

కాల్వల్లో పేరుకుపోయిన తూడు, నాచు, గుర్రపుడెక్క

కాల్వలు, డ్రెయినేజీ పనుల ప్రతిపాదనలకు ఆమోదమెప్పుడు?

ప్రవాహానికి అడ్డు తగులుతున్న గుర్రపుడెక్క

శివారు ప్రాంతాలకు నీరందని పరిస్థితి

బలహీనంగా కాలువ గట్లు, మరమ్మతులు శూన్యం

పనులకు లభించని రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం


అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్టు కాల్వలకు నీరున్నా సక్రమంగా పారుదల లేని పరిస్థితి. శివారు ప్రాంతాలకు సాగు, తాగునీరందించలేని దుస్థితి. తూడు, నాచు, గుర్రపుడెక్క  తొలగింపు ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడకపోవడంతో పనులు నిలిచిపోయి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటమే ఇందుకు కారణం.


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : ఖరీఫ్‌లో రైతులకు సాగునీటి కష్టాలు తప్పేలా లేవు. ఈ ఏడాది కాల్వలు, డ్రెయినేజీల పూడికతీత, కాల్వగట్ల బలోపేతం వంటి పనులు జరిగే సూచనలు కనిపించట్లేదు. వేసవిలో చేసే అత్యవసర పనులు, ప్రధాన కాల్వల్లో నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా తూడు, నాచు, గుర్రపు డెక్కను తొలగించేందుకు 2023, జనవరి వరకు ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌(ఓఅండ్‌ఎం) పనుల కోసం రూ.55 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందలేదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. పంట కాల్వలు, డ్రెయినేజీల్లోని తూడు, గుర్రపుడెక్కను చంపేందుకు రసాయనాలు పిచికారీ చేస్తారు. ఈ పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆమోదం ఎప్పుడు లభిస్తుంది, ఎప్పుడు టెండర్లు పిలుస్తారు, ఎప్పటికి సాగునీటి కాల్వలు, డ్రెయినేజీల్లో రసాయనాలు పిచికారీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఏటా మాదిరిగానే కాల్వలకు నీటిని వదిలే సమయంలో రసాయనాలు పిచికారీ చేసినట్లుగా చూపి కాంట్రాక్టర్లు బిల్లులు చేసుకుంటారా అనే అనుమానాలూ లేకపోలేదు. 

మట్టి పనులు లేనట్టే.. 

టీడీపీ హయాంలో ఆయా రెవెన్యూ గ్రామాల పరిధిలో 226 వరకు సాగునీటి సంఘాలుండేవి. నీటితీరువా ద్వారా వసూలైన నగదుతో పాటు కృష్ణాడెల్టా ఆధునికీకరణ ద్వారా కేటాయించిన నిధులతో సాగునీటి, డ్రెయినేజీ పనులు చేసేవారు. సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించి ఏయే ప్రాంతాల్లో కాల్వ పనులు చేయాలో నిర్ణయించేవారు. వైసీపీ వచ్చాక సాగునీటి సంఘాల ఉనికే లేకుండాపోయింది. దీంతో సాగునీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయించిన పనులే చేయాల్సిన స్థితి నెలకొంది.    

ఈ సమయంలో ఎలా?

జిల్లాలోని తాగునీటి చెరువులను నింపేందుకు ప్రధాన కాల్వలకు ప్రస్తుతం నీటిని వదులుతున్నారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీటి ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారని, దీంతో కాల్వలకు ఎక్కువ రోజులు నీరొచ్చే అవకాశం ఉందని నీటిపారుదల అధికారులు అంటున్నారు. ప్రధాన కాల్వల్లో నీరు ప్రవహిస్తుంటే తూడు, నాచు, గుర్రపు డెక్క నిర్మూలనకు రసాయనాలు పిచికారీ చేసినా ఫలితం ఉండదు.

శివారుకు సాగు నీరందేనా?

రెండు జిల్లాల్లో 3.24 లక్షల హెక్టార్లలో వివిధ పంటల సాగు జరుగుతోంది. వరి సాగు 2.48 లక్షల హెక్టార్లుగా ఉంది. బందరు కాల్వ, కేఈబీ కెనాల్‌ ద్వారా దాదాపు 2 లక్షల హెక్టార్లకు సాగునీరు అందాల్సి ఉంది. ఈ రెండు ప్రధాన కాల్వలు, వాటికి అనుంబంధంగా ఉన్న బ్రాంచి కాల్వలకు కనీస మరమ్మతులు చేయకుంటే శివారు ప్రాంతాల భూములకు ఎంతమేర సాగునీరు అందుతుందనేది ప్రశ్నార్థకమే. ఈ రెండింటికీ అనుబంధంగా ఉన్న బ్రాంచి కాల్వల్లో డ్రాప్‌లు, రెగ్యులేటర్లకు మూడేళ్లుగా కనీస మరమ్మతులు చేయలేదు. ఈ ఏడాది ఈ పనులు చేసే అవకాశమూ లేదు. ఈ బ్రాంచి కాల్వగట్లు బలహీనంగా ఉన్నాయి. ఈ వేసవిలో వీటిని బలోపేతం చేస్తే వర్షాకాలంలో ఇబ్బందులు తప్పుతాయి.

క్రస్ట్‌ గేట్లు ఏర్పాటు చేసేనా? 

అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద రత్నకోడు డ్రెయిన్‌కు క్రస్ట్‌ గేట్లు అమర్చాలని రైతులు ఎంతోకాలంగా కోరుతున్నారు. సముద్రపు నీరు డ్రెయిన్‌లోకి చొచ్చుకురాకుండా క్రస్ట్‌ గేట్లను పటిష్టంగా ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ ప్రతిపాదనలు ఈ ఏడాది కూడా బుట్టదాఖలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నాగాయలంక మండలం గుల్లలమోద-నాలి గ్రామాల మధ్య మేకల కాల్వకు క్రస్ట్‌ గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ పనులు ఈ ఏడాది ఎంతమేరకు చేస్తారనేది తెలియదు. కోడూరు మండలం ఇరాలి గ్రామస్థులు గత ఖరీఫ్‌లో వరినాట్లు వేయగా, భారీ వర్షాల కారణంగా ఆయకట్టులోని ఐదు వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. రెండోసారి వరినాట్లు వేసే ధైర్యం చేయలేక పంట విరామం ప్రకటించారు. గూడూరులో ప్రారంభమై పెడన, బంటుమిల్లి మండలాలను కలుపుతూ 24 కిలోమీటర్లు ప్రయాణించి బందరు మండలం కానూరు వద్ద సముద్రంలో కలిసే లజ్జబండ డ్రెయిన్‌కు మరమ్మతులు చేసి 15 సంవత్సరాలైంది. ఈ డ్రెయిన్‌లో గుర్రపు డెక్క పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి. అయినా ఈ డ్రెయిన్‌లో పూడికతీతకు ప్రతిపాదనలు పంపడమే తప్ప పనులు జరగట్లేదు. 2020, నవంబరు మొదటివారంలో కురిసిన భారీ వర్షాలకు డ్రెయిన్లు పొంగిపొర్లాయి. రోజుల తరబడి నీరు పొలాల్లో నిల్వ ఉండిపోవడంతో నేలవాలిన వరిపంట నీటిలోనే ఉండిపోయి పూర్తిగా దెబ్బతింది. డ్రెయిన్లలో పూడికతీసి ఉంటే ఇంతగా రైతులు నష్టపోయేవారు కాదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని డ్రెయినేజీలకు కనీస మరమ్మతులు చేయాలని తీరప్రాంత రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-02T05:49:59+05:30 IST