కాలువ గట్టు.. కబ్జా పెట్టు

ABN , First Publish Date - 2021-01-24T08:23:32+05:30 IST

జగిత్యాల జిల్లాలో రూ.కోట్ల విలువైన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాకతీయ కాలువ భూములు కబ్జాకు గురయ్యాయి. 880.37 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులే తేల్చారు. ఇటీవల కాకతీయ కాలువ

కాలువ గట్టు.. కబ్జా పెట్టు

ఆక్రమణలో కాకతీయ భూములు.. జగిత్యాల జిల్లాలో 880 ఎకరాలు స్వాహా


జగిత్యాల, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలో రూ.కోట్ల విలువైన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాకతీయ కాలువ భూములు కబ్జాకు గురయ్యాయి. 880.37 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులే తేల్చారు. ఇటీవల కాకతీయ కాలువ భూముల కబ్జాపై సర్వే నిర్వహించి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఎస్సారెస్పీ నిర్మాణ సమయంలో కాకతీయ కాలువకు అవసరమైన గట్టు భూమిని అధికారులు సేకరించారు. ఈ కాలువ నిజామాబాద్‌ జిల్లా పోచంపాడ్‌ వద్ద ప్రారంభమై జగిత్యాల జిల్లా గుండా కరీంనగర్‌ జిల్లా వైపునకు వెళ్తోంది. ఈ కాలువ పక్కన రూ.కోట్ల విలువచేసే గట్టు భూమి భారీ స్థాయిలో కబ్జాలకు గురైంది. పల్లెలు, పట్టణాల్లో సుమారు రూ.170 కోట్ల విలువ గల ఎస్సారెస్పీ భూములు ఆక్రమణకు గురయ్యాయి. కాలువ పొడవునా ఇరువైపులా గట్ల మట్టిని తొలగించి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో పలుచోట్ల పక్కా భవనాలు వెలిశాయి. భారీ స్థాయిలో కాకతీయ కాలువ గట్ల పక్కన ఎస్సారెస్పీ స్థలాల్లో వ్యవసాయం చేస్తున్నారు. దీంతో మున్ముందు కాకతీయ కాలువకు ప్రమాదం పొంచి ఉంది. గట్టు భూమి కబ్జాలకు గురవుతుండడంతో కాలువ సైడ్‌ వాల్స్‌ బలహీనపడే ప్రమాదం ఉంది.


రెవెన్యూ సర్వేతో వెలుగులోకి..

జగిత్యాల జిల్లా గుండా వెళ్తున్న కాకతీయ కాలువ గట్టు స్థలాలను రెవెన్యూ అధికారులు ఇటీవల సర్వే చేశారు. జిల్లాలో 880.37 ఎకరాలు కబ్జాకు కాగా ఇందులో 734.34 ఎకరాలు వ్యవసాయ భూమి, 142.39 ఎకరాల వ్యవసాయేతర భూములున్నట్లు సర్వేలో తేలింది. జగిత్యాల డివిజన్‌లో 158.08 ఎకరాలు, కోరుట్ల డివిజన్‌లో 307.12, మెట్‌పల్లి డివిజన్‌లో 415.13 ఎకరాలు కబ్జాకు గురయ్యాయని అధికారులు తేల్చారు. ఇదంతా తెలిసినా ఎస్సారెస్పీ అధికారులు, సిబ్బంది ఆక్రమణదారులతో కుమ్మక్కై ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల సర్వే జరిపిన రెవెన్యూ అధికారులు మరోమారు హద్దు రాళ్లు ఏర్పాటు చేసినా,ఆక్రమణదారులు తొలగించారు.

Updated Date - 2021-01-24T08:23:32+05:30 IST