కాలువ కబ్జా

ABN , First Publish Date - 2022-04-14T05:23:17+05:30 IST

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని నడింపల్లె 17వ వార్డులోమున్సిపల్‌ ప్రధాన కాలువ కబ్జా అయింది. ఈ కాలువను పలుచోట్ల పూడ్చివేసి అక్రమ కట్టడాలు నిర్మించారు.

కాలువ కబ్జా
వార్డు సచివాలయం వద్ద కాలువను పూడ్చి ఇళ్లు నిర్మించిన దృశ్యం

రూ.కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం

కాలువ పూడ్చి కట్టడాల నిర్మాణం 

మురుగునీటి పారుదలకు ఇక్కట్లు 

పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు


ప్రొద్దుటూరు అర్బన్‌, ఏప్రిల్‌ 13: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని నడింపల్లె 17వ వార్డులోమున్సిపల్‌ ప్రధాన కాలువ కబ్జా అయింది. ఈ కాలువను పలుచోట్ల పూడ్చివేసి అక్రమ కట్టడాలు నిర్మించారు. మోడంపల్లె ముస్లిం కబరస్తాన్‌ వద్ద కొత్తపల్లె ఛానల్‌ నుంచి 33 లింకుల వెడల్పుతో ఒకపాయగా ఉత్తరం దిశగా బుకారి మసీదును ఆనుకొనినడింపల్లెలోని 19వ వార్డు సచివాలయం మీదుగా ప్రవహించి మైదుకూరు రోడ్డును దాటి టూటౌన్‌ బైపాస్‌ మీదుగా మడూరు కాలువలో కలుస్తుంది. దాదాపు 500 మీటర్ల మేర ఉండే ఈ కాలువ ఎకరా పైగా విస్తీర్ణం ఉంటుందని స్థానికులు చెబు తున్నారు. ఇక్కడ సెంటు స్థలం రూ.15లక్షలకు పైగా పలుకుతోంది.పూర్వం ఈ కాలువ పంట కాలువ అని.. కాలక్రమంలో ఇది ప్రధాన మురుగునీటి కాలువగా మారిందని... కొంతకాలంగా ఇది పూర్తిగా ఆక్రమణలకు గురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కచ్చాకాలువగా ఉండటం వలన ప్రస్తుతం ఇది చాలా చోట్ల ఆక్రమణల్లో ఉంది.నడింపల్లెలో ప్రవహించే ఈ కాలువ కబ్జాకు గురికావడం వల్ల దానికి చుట్టుపక్కల ప్రాంతంలోని వీధుల నుంచి వచ్చే మురుగునీరు వెళ్లడానికి దారిలేక స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.


అధికారులు పట్టించుకోవడం లేదు

కాలువ కబ్జా అయిందని మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోలేదు. ఒకసారి టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది వచ్చి పరిశీలించి వెళ్లారే కానీ సర్వే చేయలేదు.

-కమలపూరి సుబ్బారెడ్డి, ఆకులవీధి


కబ్జాలు తొలగించాలి

ఆకులవీధి నుంచి కాలువలకు అవుట్‌ లెట్‌ లేదు. కబ్జాకు గురైన కాలువ నిర్మిస్తే వీధిలోని మురుగునీరు బయటికి వెళుతుంది. ఇప్పటికే చాలా చోట్ల ఆక్రమించారు. ఇకనైనా అధికారులు స్పందించి కబ్జాలు తొలగించి మురుగునీరు పోయేదారి ఏర్పాటు చేయాలి.

-నల్లంశెట్టి శివశంకర్‌, నడింపల్లె


కాలువ సర్వే చేస్తాం

నడింపల్లెలో కబ్జాకు గురైన కాలువను త్వరలో సర్వే చేయిస్తాం. గతంలో ఒకసారి పరిశీలించాం. కచ్చా కాలువగా ఉండటం వలన ఇది ఆక్రమణలకు గురవుతోంది. సర్వే పూర్తయ్యాక కాలువ నిర్మాణం చేపట్టడానికి మున్సిపల్‌ పాలక మండలికి ప్రతిపాదనలు పెడతాం. కాలువ నిర్మాణం జరిగితే మురుగునీటి పారుదల సౌకర్యం మెరుగుపడుతుంది.

- ఇందిర, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, ప్రొద్దుటూరు. 

Updated Date - 2022-04-14T05:23:17+05:30 IST