కాలువ గట్లు ఖాళీ!

ABN , First Publish Date - 2020-02-20T09:58:22+05:30 IST

కాలువ గట్లను అందమైన వాకింగ్‌ ట్రాక్‌లుగా మార్చాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. కాలువల సమీపంలోని ప్రాంతాలను చక్కటి పార్కులుగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం...

కాలువ గట్లు ఖాళీ!

  • వాటి వెంబడి ఇళ్ల తొలగింపు
  • వాకింగ్‌ ట్రాక్‌లుగా మార్చాలి
  • సమీప ప్రాంతాల్లో పార్కులు
  • నిర్వాసితులకు వేరే స్థలాలు
  • సాగు-తాగుకు స్వచ్ఛ నీరే!
  • కాలువల శుద్ధికి ప్రత్యేక ‘మిషన్‌’
  • వాటి వెంబడి ఇళ్ల తొలగింపు



    అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): కాలువ గట్లను అందమైన వాకింగ్‌ ట్రాక్‌లుగా మార్చాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. కాలువల సమీపంలోని ప్రాంతాలను చక్కటి పార్కులుగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కాలువ గట్లపై ఉన్న ఇళ్లను ఖాళీ చేయించాలన్నారు. కాలువ కట్టలపై సిమెంట్‌, కాంక్రీట్‌ వినియోగించకుండా పాత్‌వేలను రాళ్లతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికి ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి జల వనరుల శాఖ సహా స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలన్నారు. 

    తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గోదావరి, కృష్ణా నది కాలువల శుద్ధిపై జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. కాలువగట్ల వెంబడి నివసిస్తున్న వారిని అక్కడ నుంచి తరలించాలని ఆదేశించారు. తరలించే సమయంలో ప్రజలను ఎక్కడా ఇబ్బంది పెట్టకూడదన్నా రు. ఒకసారి తొలగించాక.. మరెవరూ ఆయా గట్లను ఆక్రమించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ‘‘కాలువ కట్టలపై ఉన్నవారికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి.. వారు ఇళ్లు కట్టుకునేలా చర్యలు తీసుకోవాలి. తాడేపల్లి మునిసిపాలిటీలో ఈ కార్యక్రమాన్ని ముందుగా అమలు చేయాలి. దీనిపై మూడు నెలల్లోగా పూర్తి స్థాయి నివేదికలు ఇవ్వాలన్నారు. కృష్ణా జిల్లాలో రైవస్‌ కెనాల్‌, గుంటూరులో కృష్ణా పశ్చిమ కెనాల్‌, పశ్చిమ గోదావరిలో ఏలూరు కెనాల్‌, తూర్పుగోదావరిలో జీఈ మెయిన్‌ కెనాల్‌, పులివెందుల, విశాఖలో పైలట్‌ ప్రాజెక్టులుగా దీనిని అమలు చేయాలి. ఈ కార్యక్రమం నాడు-నేడు తరహాలో ఉండాలి’’ అని జగన్‌ ఆదేశించారు. కాలువలపై పార్కులు, వాకింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే దాతలను ప్రోత్సహించాలన్నారు. 


    స్వచ్ఛ నీరే... 
    సాగు-తాగు కోసం స్వచ్ఛమైన నీటినే అందించాలని, కృష్ణా, గోదావరి నదుల వెంబడి ఉన్న అన్ని నగర, గ్రామీణ ప్రాంతాల్లోని కాలువలను యుద్ధ ప్రాతిపదికన శుద్ధి చేయాలని జలవనరుల శాఖను సీఎం ఆదేశించారు. కాలువల శుద్ధి కోసం ప్రత్యేకంగా ఒక మిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ మిషన్‌లో ప్రభుత్వ శాఖలనూ భాగస్వామ్యం చేయాలని తెలిపారు. రాష్ట్రంలో నదుల ఆధారంగా నిర్మించిన కాలువలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గోదావరి డెల్టా పరిధిలో 10,000 కిలోమీటర్లు, కృష్ణా డెల్టా పరిధిలో 9,800 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయని సీఎంకు అధికారులు తెలిపారు. ఒక్కో కాలువలో ఎంత మురికినీరు కలుస్తుందో.. దాన్ని నివారించేందుకు ఎంత ఖర్చవుతుందో సమాచారం సేకరించాలని సీఎం సూచించారు.

    సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వివరాలు.. బ్యూటిఫికేషన్‌కు అయ్యే ఖర్చు వివరాలపై సీఎం ఆరా తీశారు. విజయవాడ, విశాఖలపై ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. 18 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. వేస్ట్‌ కలెక్షన్‌, డిస్పోజబుల్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించా రు. సమీక్షా సమావేశానికి మిషన్‌ ఫర్‌ క్లీన్‌ కృష్ణా అండ్‌ గోదావరి కెనాల్స్‌ డైరెక్టర్‌ కాటమనేని భాస్కర్‌, ఆర్థిక, జలవనరులశాఖ, మునిసిపల్‌, కాలుష్య ని యంత్రణ మండలి ఉన్నతాధికారులు హాజరయ్యారు.


    Updated Date - 2020-02-20T09:58:22+05:30 IST