కరోనా టీకా కోసం మనం వెయిట్ చేయాల్సిందే: కెనడా ప్రధాని

ABN , First Publish Date - 2020-11-25T21:10:17+05:30 IST

కరోనా టీకా కోసం కెనడా ప్రజలు కొంత కాలం వేచి చూడాల్సి ఉంటుందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రుడో వ్యాఖ్యానించారు.

కరోనా టీకా కోసం మనం వెయిట్ చేయాల్సిందే: కెనడా ప్రధాని

టొరొంటో: కరోనా టీకా కోసం కెనడా ప్రజలు కొంత కాలం వేచి చూడాల్సి ఉంటుందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రుడో వ్యాఖ్యానించారు. కెనాడాలో ప్రస్తుతం టీకా తయారీ యూనిట్లు లేవని చెప్పిన ఆయన.. వివిధ దేశాల్లో తయారయ్యే తొలి విడత టీకాలన్నీ ఆయా దేశాల ప్రజలకే కేటాయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అయితే.. ఓ అమెరికా కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌ తొలుత అమెరికన్లకు అందాకే మిగతా ప్రపంచానికి చేరటమనేది సబబేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 


‘తొలుత ఆయా దేశాల అవసరాలు తీరాక.. మనకు టీకా అందుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో కెనడాకు టీకా డెలివరీ జరగొచ్చని నేను అనుకుంటున్నాను’ అని ఆయన అన్నారు. అయితే..అమెరికన్లు అందరికీ కరోనా టీకా అందాకే కెనేడియన్లకు లభిస్తుందని భావించవద్దని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మిలయన్ల కొద్దీ కరోనా టీకా డోసుల కోసం ఇప్పటికే కెనడా అనేక ఒప్పందాలు చేసుకుందని ప్రధాని ట్రూడో తెలిపారు. 

Updated Date - 2020-11-25T21:10:17+05:30 IST