మంచును తొలగిస్తున్న భార్య ఫొటో పోస్ట్ చేసిన మంత్రిపై జనాగ్రహం

ABN , First Publish Date - 2022-01-13T18:30:29+05:30 IST

కెనడాలోని మనిటొబ ప్రావిన్స్ కేబినెట్ మంత్రి జాన్

మంచును తొలగిస్తున్న భార్య ఫొటో పోస్ట్ చేసిన మంత్రిపై జనాగ్రహం

న్యూఢిల్లీ : కెనడాలోని మనిటొబ ప్రావిన్స్ కేబినెట్ మంత్రి జాన్ రెయెస్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం ఆయన తన భార్య 12 గంటలపాటు ఆసుపత్రిలో పని చేసి, ఉద్యోగ విధులు ముగించుకుని తిరిగి వచ్చి, ఇంట్లోని దారిలో పడిన మంచును తొలగిస్తున్నట్లు కనిపించే ఫొటోను ట్వీట్ చేయడమే. 


‘‘గత రాత్రి ఆసుపత్రిలో 12 గంటల నైట్ షిఫ్ట్‌లో పని చేసిన తర్వాత కూడా, దారిలోని మంచును తొలగించడానికి నా భార్యకు ఇంకా శక్తి ఉంది. ఆమెను, అందరు ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌ను దేవుడు ఆశీర్వదించాలి. ఆమెకు అల్పాహారం ఇవ్వవలసి సమయం’’ అని పేర్కొన్నారు. 


ఆయన పోస్ట్ చేసిన ఫొటోలో ఆయన భార్య సింతియా వారి ఇంట్లోని దారిలో పడిన మంచును తుడుస్తున్నట్లు కనిపించింది. ఆమె దట్టమైన కోటును ధరించి, మంచును తొలగిస్తున్నట్లు కనిపించింది. 


గత శనివారం ఉదయం విన్నిపెగ్‌లో ఉష్ణోగ్రత మైనస్ 2 డిగ్రీల ఫారన్‌హీట్ ఉంది. ఆ సమయంలో సింతియా తన ఇంట్లోని దారిలో మంచును తొలగించారు. 


సింతియా ఫొటోను చూసిన నెటిజన్లు రెయెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత కష్టపడి వచ్చినామెకు ఎందుకు సాయం చేయలేదని రెయెస్‌ను ప్రశ్నించారు. నువ్వెందుకు సాయం చేయలేదు? అని ఓ ట్విటరాటీ ప్రశ్నించారు. దీనికి రెయెస్ బదులిస్తూ, 12 గంటలపాటు కష్టపడి వచ్చిన తర్వాత మంచును తొలగిస్తున్న తన భార్యను చూసిన వెంటనే ట్వీట్ చేయాలనిపించిందని చెప్పారు. 


‘‘మీ ప్రభుత్వ వైఫల్యం 12 గంటల నైట్ షిఫ్ట్‌లో ఆమెను పీల్చిపిప్పి చేసింది. ఆ మంచును తొలగించడానికి మీకు సమయం దొరకలేదు?’’ అని మరొక ట్విటరాటీ అన్నారు. మనిటొబలో ఇటీవల కోవిడ్ కేసులు పెరిగిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. 


అయితే సింతియా తన భర్తకు మద్దతుగా ఓ ట్వీట్ చేశారు. తన ఇంట్లోని దారిని శుభ్రం చేయాలనే ఆలోచన తనకే వచ్చిందని, తానే స్వయంగా ఆ మంచును తొలగించానని చెప్పారు. 


అప్పటికీ నెటిజన్లు రెయెస్‌ను వదిలిపెట్టలేదు. తనకు మద్దతుగా ట్వీట్ చేయడానికే ఆమె చేత ట్విటర్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేయించారని ఆరోపించారు. 



Updated Date - 2022-01-13T18:30:29+05:30 IST