చైనాకు మరో దేశం ఝలక్..

ABN , First Publish Date - 2020-07-09T21:24:39+05:30 IST

ప్రపంచం నుంచి చైనా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కరోనా విషయంలో ఇప్పటికే అనేక దేశాలు ఒక్కటవడంతో....

చైనాకు మరో దేశం ఝలక్..

ఒట్టావా: ప్రపంచం నుంచి చైనా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కరోనా విషయంలో ఇప్పటికే అనేక దేశాలు ఒక్కటవడంతో చైనా ఏకాకిగా మిగిలింది. ఈ నేపథ్యంలో హాంకాంగ్‌లో అమలులోకి తెచ్చిన హాంకాంగ్ సెక్యూరిటీ లా చైనా తెచ్చిన కొత్త చట్టం మరిన్ని తలనెప్పులను తెచ్చిపెట్టింది. ఈ చట్టం కారణంగా హాంకాంగ్‌ ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయిందని, అందువల్ల ఇన్నిరోజులుగా తాము ఆ ప్రాంతానికి అందిస్తున్న ప్రత్యేక వాణిజ్య రాయితీలను రద్దు చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో చైనాకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఓ ఝలక్ ఇచ్చారు. హాంకాంగ్‌లో చైనా అమలులోకి తెచ్చిన కొత్త చట్టం వల్ల ఇకపై ఆ దేశాన్ని చైనాలో ఓ ప్రాంతంగా పరిగణిస్తామని తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఇప్పటివరకు హాంకాంగ్‌కు తమ దేశం నుంచి అనేక ఆవశ్యకమైన సైనిక పరికరాలను అందించేవారమని, ఇకనుంచి ఆ ఎగుమతులను నిలిపివేస్తున్నామని స్పష్టం చేశారు.


ఈ ఆదేశాలు ఇప్పటినుంచే అమలవుతాయని, కెనడాలోని ఏ సంస్థ కూడా హాంకాంగ్‌కు సైనిక పరికరాలను ఎగుమతి చేయడానికి వీల్లేదని హెచ్చరించారు. ఇకనుంచి తమదేశం ద్వారా హాంకాంగ్‌కు జరిగే ఎగుమతులన్నీ చైనాకు జరిగినట్లే పరిగణిస్తామని వెల్లడించారు. కెనడా విదేశాంగ మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ మాట్లాడుతూ, హాంకాంగ్ విషయంలో చైనా అమలులోకి తెచ్చిన కొత్త చట్టం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా ఉందని, చైనా అణచివేత ధోరణికి నిదర్శనంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై చైనా నిప్పులు చెరిగింది. తమ ఆంతరంగిక విషయాల్లో ఇతరుల జోక్యం అవసరం లేదని తీవ్రంగా హెచ్చరించింది. అయితే హాంకాంగ్ మాత్రం కెనడా వైఖరిపై ఆవేదన వ్యక్తం చేసింది. తమ ప్రత్యేక ప్రతిపత్తి అన్ని వైపుల నుంచి కనుమరుగవుతోందని వాపోయింది.

Updated Date - 2020-07-09T21:24:39+05:30 IST