టొరొంటో: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ భారతీయ కుటుంబం మరణించిన ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో శుక్రవారం స్పందించారు. ఈ ఘటన అత్యంత విషాదకరమైనదని ఆయన పేర్కొన్నారు. కెనడా నుంచి అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ నలుగురు సభ్యులున్న భారతీయ కుటుంబం మంచు తుఫానులో చిక్కి మరణించిన విషయం తెలిసిందే. అతిశీతల వాతావరణానికి తట్టుకోలేక ఆ భార్యాభర్తలతో పాటూ వారి ఇద్దరు పిల్లలు కూడా మృతి చెందారు. మంచులో చిక్కుకుపోయిన వారి మృత దేహాలను సరిహద్దు వద్ద కెనడా భూభాగంలో అధికారులు గుర్తించారు.
కాగా.. మానవ అక్రమరవాణాను అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతోందని ట్రూడో పేర్కొన్నారు. ‘‘ఇది మనసును కలచివేసే ఘటన. మనుషుల అక్రమరవాణాకు ఓ కుటుంబం ఇలా బలి కావడం విచారకరం. మంచి జీవితం కోసం ఆ కుటుంబం పడిన ఆరాటాన్ని నిందితులు అవకాశంగా తీసుకున్నారు. ఇలా ప్రమాదకర రీతిలో సరిహద్దు దాటేవారిని నిరోధించేందుకు కెనడా ప్రభుత్వం అమెరికా భాగస్వామ్యంతో అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇలా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించడం ఎంతో ప్రమాదకరం’’ అని జస్టిన్ ట్రూడో తెలిపారు.