కరోనా ఐసీయూ వార్డులో ఈ నర్సు చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. నెట్టింట వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-04-30T18:52:56+05:30 IST

బెడ్లు దొరక్క, రోడ్డుపైనే ప్రాణాలు విడుస్తున్న కరోనా రోగులకు సంబంధించిన దృశ్యాలు అందరినీ కలవరపెడుతున్నాయి. కరోనా రోగులనే కాదు, సామాన్య జనాన్ని కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

కరోనా ఐసీయూ వార్డులో ఈ నర్సు చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. నెట్టింట వీడియో వైరల్
ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచ దేశాలన్నీ కరోనాను కట్టడి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. లాక్‌డౌన్లు, ఆంక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియతో అన్ని దేశాలు బిజిబిజీగా ఉన్నాయి. అదే సమయంలో ప్రపంచ దేశాల్లోని ప్రధాన ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. మరో వైపు బెడ్లు దొరక్క, రోడ్డుపైనే ప్రాణాలు విడుస్తున్న కరోనా రోగులకు సంబంధించిన దృశ్యాలు అందరినీ కలవరపెడుతున్నాయి. కరోనా రోగులనే కాదు, సామాన్య జనాన్ని కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కరోనా కంటే భయమే మరింత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా వచ్చినా కోలుకోవచ్చుననీ, కరోనాతో మరణిస్తున్న వారి సంఖ్య, దాని బారిన పడిన వారితో పోల్చితే తక్కువేనని లెక్కలు తీస్తున్నారు. కరోనా రోగులు కనిపిస్తేనే భయపడిపోయి పారిపోతున్న ఇలాంటి పరిస్థితుల్లో వారికి దగ్గరుండి మరీ డాక్టర్లు, నర్సులు వైద్య సేవలు చేస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. 


రోగులకు ట్రీట్ మెంట్ ఇవ్వడమే కాకుండా, వారిలో మనోస్థైర్యాన్ని కల్పించడం కూడా చాలా అత్యవసరం అని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ నర్సు చేసిన పని పట్ల నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సర్వత్రా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కెనడాలోని ఓట్టవా అనే ప్రధాన ఆసుపత్రిలో అమీ లీన్  హౌసాన్ అనే ఓ నర్సు పనిచేస్తోంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను ఆ నర్సు దగ్గర ఉండి మరీ పర్యవేక్షిస్తోంది. వారికి సమయానికి మెడిసిన్స్ ఇవ్వడమే కాకుండా వారిలో మనోధైర్యాన్ని పెంచేలా చేయడమే ఈ నర్సు ప్రత్యేకత. తనకు తెలిసిన నైపుణ్యంతో గిటారు వాయించి, ఓ పాటను పాడి కరోనా రోగుల్లో ఉత్సాహాన్ని పెంపొందించింది. ‘మీరు ఒంటరి కాదు. మీకు తోడుగా మేమున్నాం. విజయం మన సొంతం’ అంటూ ఓ పాటను పాడి కరోనా రోగుల్లో ధైర్యాన్ని పెంపొందించింది. 


దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ తెగ వైరల్ అయింది. ఆ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే 76వేల వివ్స్, దాదాపు నాలుగు వేల లైక్స్ వచ్చాయి. రీట్వీట్లు, కామెంట్లతో ఆ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఆమెను ప్రశంసల వర్షంలో ముంచెత్తుతున్నారు. అమీ లీన్ వంటి నర్సు ఉంటే ఎంతటి రోగాన్నైనా జయించొచ్చంటూ ట్వీట్స్ చేస్తున్నారు. 

Updated Date - 2021-04-30T18:52:56+05:30 IST