విదేశీ విద్యార్థుల‌పై యూఎస్ 'ఆన్‌లైన్' అస్త్రం ప్ర‌యోగిస్తుంటే.. కెన‌డా మాత్రం..

ABN , First Publish Date - 2020-07-14T19:40:49+05:30 IST

అగ్ర‌రాజ్యం అమెరికా క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో విదేశీ విద్యార్థుల‌పై ఆన్‌లైన్ అస్త్రం ప్ర‌యోగించేందుకు రెడీ అవుతోంది. దీనిలో భాగంగా త‌రగతులు పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మారిపోతే త‌మ దేశంలో చ‌దువుకుంటున్న‌ విదేశీ విద్యార్థులను వారి దేశాల‌కు వెళ్ల‌గొట్టాల‌ని యూఎస్ భావిస్తోంది.

విదేశీ విద్యార్థుల‌పై యూఎస్ 'ఆన్‌లైన్' అస్త్రం ప్ర‌యోగిస్తుంటే.. కెన‌డా మాత్రం..

టొరంటో: అగ్ర‌రాజ్యం అమెరికా క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో విదేశీ విద్యార్థుల‌పై 'ఆన్‌లైన్' అస్త్రం ప్ర‌యోగించేందుకు రెడీ అవుతోంది. దీనిలో భాగంగా త‌రగతులు పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మారిపోతే త‌మ దేశంలో చ‌దువుకుంటున్న‌ విదేశీ విద్యార్థులను వారి దేశాల‌కు వెళ్ల‌గొట్టాల‌ని యూఎస్ భావిస్తోంది. అయితే, ఈ విధానాన్ని అక్క‌డి ప‌లు యూనివ‌ర్శిటీలు వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటు అమెరికా ఇలా విదేశీ విద్యార్థుల ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హారిస్తుంటే.. అటు కెన‌డా మాత్రం అంతర్జాతీయ విద్యార్థుల‌ను భారీగా ఆహ్వానిస్తోంది. ఒక్క మే నెల‌లోనే ఏకంగా 30,785 మంది విదేశీ విద్యార్థుల‌కు త‌మ దేశంలో చ‌దువుకునేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఇది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెల‌ల‌తో పొలిస్తే రెండింత‌లు ఉంటుంద‌ని అక్క‌డి అధికారులు పేర్కొన్నారు. అలాగే గ‌తేడాది ఇదే స‌మ‌యానికి విదేశీ విద్యార్థుల‌కు ఇచ్చిన ప‌ర్మిట్స్‌తో పొలిస్తే 11 శాతం అధికమ‌ని తెలిపారు. అయితే, ఈ ఏడాది ఎంత‌మంది భార‌త విద్యార్థుల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చార‌నేది తెలియ‌రాలేదు. 


కాగా, 2019 చివరినాటికి కెనడాలో మొత్తం 6,42,480 అంతర్జాతీయ విద్యార్థులలో 2,19,855 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఈ భారతీయ విద్యార్థులలో 1,44,900 మంది కెనడియన్ కాలేజీల్లో పోస్ట్ సెకండరీ కోర్సులు చేస్తుంటే... 53,335 మంది విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నట్లు అధికారులు వెల్ల‌డించారు. కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థులలో భారత్ 34 శాతం మందితో మొద‌టి స్థానంలో ఉంటే... ఆ త‌రువాతి స్థానంలో 22 శాతంతో చైనా ఉంది. కాగా, విదేశీ విద్యార్థుల చదువుల వ‌ల్ల ఫీజుల రూపంలో కెన‌డాకు ప్ర‌తి ఏడాది 22 బిలియ‌న్ డాల‌ర్లు(రూ. 16,59,33,90,00,000) ఆదాయం వ‌స్తోంది. 

Updated Date - 2020-07-14T19:40:49+05:30 IST