Abn logo
Apr 11 2021 @ 00:11AM

ప్రమాణం చేసి చెప్పగలరా?

సొంతింట్లోనే దారుణ హత్యకు గురైన వైఎస్‌ వివేకానందరెడ్డి ఏకైక కుమార్తె డాక్టర్‌ సునీతా రెడ్డి సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ఉంటుందని గత వారం నేను రాసిన ‘కొత్త పలుకు’కు సమాధానం చెప్పవలసింది పోయి.. శ్రీమతి విజయలక్ష్మి పేరిట ఒక లేఖ విడుదల చేయించి యథావిధిగా నాకు దురుద్దేశాలు ఆపాదించారు. హత్యకు గురైన వ్యక్తి ముఖ్యమంత్రి సొంత బాబాయి. ఆరోపణలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి సోదరి. ఇది వారి కుటుంబ వ్యవహారం ఎంత మాత్రం కాబోదు. ఎవరైనా పత్రికలలో వచ్చిన వార్తలకు లేదా వ్యాసాలకు అదే రోజు స్పందిస్తారు. ‘కొత్త పలుకు’కు సమాధానంగా విజయలక్ష్మి పేరిట రాసిన లేఖను మాత్రం ఒక రోజు ఆలస్యంగా మరుసటి రోజు విడుదల చేశారు. వైఎస్‌ విజయా రాజశేఖర్‌ రెడ్డి పేరిట విడుదల చేసిన లేఖపై ఆమె సంతకం కూడా లేదు. శ్రీమతి విజయలక్ష్మి తనకు తాను వైఎస్‌ విజయా రాజశేఖర రెడ్డిగా గతంలో ఎప్పుడూ చెప్పుకోలేదు. విజయమ్మగా మాత్రమే అందరూ పిలుస్తారు. ఆమె కూడా విజయమ్మ అని మాత్రమే సంతకం చేస్తారు. దీన్నిబట్టి ఆ లేఖను ఎవరు రూపొందించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. గతంలో అన్న జగన్మోహన్‌ రెడ్డితో చెల్లి షర్మిలకు విభేదాలు ఏర్పడ్డాయని నేను రాసినప్పుడు కూడా షర్మిలపై ఒత్తిడి తెచ్చి మరో వివరణ ఇప్పించారు. ఆ తర్వాత షర్మిల అలా చేయడానికి కూడా నిరాకరించారు. తెలంగాణలో షర్మిల ప్రారంభించనున్న రాజకీయ పార్టీకి విజయలక్ష్మి మద్దతు ఉంటుందని నేను చెప్పినట్టుగానే శుక్రవారంనాడు ఖమ్మంలో జరిగిన సభలో ఆమె పాల్గొన్నారు. షర్మిల తన రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించిన నాటి నుంచి ఎక్కడా జగన్మోహన్‌ రెడ్డి పేరు ఎత్తకపోవడమే కాకుండా పోస్టర్లు, ఫ్లెక్సీలలో అన్న ఫొటోలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీన్నిబట్టి అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు ఉన్నట్టు స్పష్టమవుతోంది కదా! గతంలో నేనే కాదు, ఇతర మీడియా కూడా రాజశేఖర్‌ రెడ్డి కుటుంబంలో విభేదాలు ఉన్నాయని వార్తలు ప్రచురించలేదు. ఇప్పుడే అలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? వాటికి ఎవరు కారకులో విజయలక్ష్మి చెప్పాలి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉంటున్న విజయలక్ష్మి ముఖ్యమంత్రి జగన్‌ అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ గడ్డపై షర్మిల ఏర్పాటుచేసిన రాజకీయ సభలో పాల్గొనడంలోని ఆంతర్యమేమిటో జగన్‌ అండ్‌ కో చెబుతారా? జర్నలిజం గురించి వారు నాకు పాఠాలు చెప్పే సాహసం కూడా చేశారు.


తులసి వనంలో గంజాయి మొక్కలా ఒక మీడియా సంస్థను ఏర్పాటుచేసుకుని రోత జర్నలిజానికి తెర లేపింది జగన్‌ అండ్‌ కో కాదా? వైఎస్‌ వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరో నిగ్గు తేలాల్సిందేనన్నది తన మాట మాత్రమే కాదని, జగన్‌ కూడా అదే ఉద్దేశంతో ఉన్నారని విజయలక్ష్మి పేరిట విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే నిజమైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిపాటు నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారు? వివేకా హత్య కేసును దర్యాప్తు చేయడం కోసం  చంద్రబాబు నియమించిన కమిటీలోని అధికారులు అందరినీ ఎందుకు బదిలీ చేశారో చెబుతారా? జిల్లా ఎస్పీ మహంతిని కూడా బదిలీ చేశారు కదా! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కావాలని హైకోర్టును ఆశ్రయించిన జగన్‌ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయ్యాక సీబీఐ విచారణ అవసరం లేదని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? హత్య కేసులో అనుమానితుడైన శ్రీనివాసరెడ్డిది అసహజ మరణమైనా ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించారు? కేసు డైరీని ఇంతవరకు పులివెందుల కోర్టు నుంచి సీబీఐకి ఎందుకు పంపలేదు? సీబీఐ విచారణను వేగవంతం చేయాలని కేంద్రాన్ని జగన్‌ ఎందుకు కోరడంలేదు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు శ్రీమతి విజయలక్ష్మి లేఖలో సమాధానం దొరకలేదు. మీడియా మీద బురద జల్లడం మీకు అలవాటే గనుక లేఖలో ప్రస్తావించిన అంశాలు మాకు ఆశ్చర్యం కలిగించలేదు. నేను అడిగే ప్రశ్నలకు కాకపోయినా, మీ కుటుంబంలో ఒకరైన డాక్టర్‌ సునీత సంధించిన ప్రశ్నలకైనా సమాధానం చెప్పాలి కదా! కుటుంబ పెద్దగా విజయలక్ష్మికి ఆ బాధ్యత లేదా? జగన్‌ రెడ్డి ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని డాక్టర్‌ సునీత స్వయంగా చెప్పారు కదా! దానికేమంటారు? అంతెందుకు, జగన్‌ బాబు అని ముద్దుగా పిలుచుకొనే జగన్మోహన్‌ రెడ్డిపై తన భర్త రాజశేఖర్‌ రెడ్డి అభిప్రాయం ఎలా ఉండేదో విజయలక్ష్మి చెప్పగలరా? రాజశేఖర్‌ రెడ్డి హెలికాప్టర్‌లో చనిపోవడానికి ముందు జగన్‌ రెడ్డిని బెంగళూరుకే పరిమితం కావాలని ఆదేశించిన విషయం నిజం కాదా? అయినా జగన్‌ చెప్పాపెట్టకుండా ఇంట్లో ప్రత్యక్షం కావడంతో రాజశేఖర్‌ రెడ్డి అసహనం ప్రదర్శించడం నిజం కాదా? ఈ విషయాలు నిజం కాదని మీరు నమ్మితే, నిత్యం మీ వెంటే ఉంచుకొనే బైబిల్‌పై ప్రమాణం చేసి చెప్పగలరా విజయలక్ష్మిగారూ? దీన్నిబట్టి కన్నతండ్రి కూడా భరించలేని వ్యక్తిత్వం జగన్‌ రెడ్డిది అని ఎవరైనా ఎందుకు భావించకూడదు? వివేకానందరెడ్డి హత్య విషయానికి వస్తే, తన తండ్రి చావుకు భాస్కరరెడ్డి, కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి కారణమని స్వయంగా డాక్టర్‌ సునీతా రెడ్డే చెబుతున్నారు కదా! అయినా పోలీసులు ఇంతవరకు వారిద్దరినీ ఎందుకు ప్రశ్నించలేదు? ఈ కారణంగానే సోదరుడు జగన్‌ రెడ్డి ప్రభుత్వంపై డాకర్ట్‌ సునీత విశ్వాసం కోల్పోయిన విషయం వాస్తవం కాదా? అవినాష్‌ రెడ్డిపై చర్య తీసుకుంటే ఆయన భారతీయ జనతాపార్టీలో చేరిపోయే అవకాశం ఉందని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి చెప్పడం నిజం కాదా? జగన్‌ స్వభావం, మనస్తత్వం ఎలాంటివో రాష్ట్ర ప్రజలందరూ చూశారంటున్న విజయలక్ష్మి, ఆయనపై తండ్రి రాజశేఖర్‌ రెడ్డి ఎందుకు చిరాకుపడేవారో చెప్పగలరా? ప్రజలు అమాయకులు కనుక వారు జగన్‌ను నమ్ముతుండవచ్చు. కుమారుడి మనస్తత్వం ఎలాంటిదో తండ్రికి తెలుస్తుంది కదా! అందుకే జగన్‌ను దివంగత రాజశేఖర రెడ్డి కట్టడిచేసే ప్రయత్నం చేశారని ఎవరైనా అంటే కాదనగలరా? రాజశేఖర్‌ రెడ్డి భార్యగా, జగన్‌ రెడ్డి తల్లిగా మీరు గర్వపడుతూ ఉండవచ్చు గానీ కుటుంబ వ్యవహారాల్లో మీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందన్నది నిజం కాదా విజయలక్ష్మి గారూ? తన పిల్లల మధ్య విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా నిందిస్తున్న విజయలక్ష్మి, విభేదాలు లేవని బైబిల్‌ సాక్షిగా చెప్పగలరా? డాక్టర్‌ సునీతకు తమ అందరి మద్దతు ఉందని విజయలక్ష్మితో చెప్పించిన వాళ్లు ఆచరణలో అది రుజువు చేసుకోవాలి కదా! రాజశేఖర్‌ రెడ్డి మరణంపై తమకు అనుమానాలు ఉండేవని చెబుతున్న విజయలక్ష్మి, ఇప్పుడు కన్నబిడ్డ అధికారంలో ఉన్నందున కనీసం విచారణ అయినా చేయించే ప్రయత్నం ఎందుకు చేయలేదో చెబుతారా? కేంద్ర ప్రభుత్వంతో జగన్‌కు సత్సంబంధాలు ఉన్నందున రాజశేఖర్‌ రెడ్డి మరణంపై ఇప్పుడైనా విచారణ జరిపించవచ్చు కదా! ఆనాడు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం రాజశేఖర్‌ రెడ్డిని చంపించారని ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది మీ కుటుంబం కాదా? అప్పుడు హెలికాప్టర్‌ ప్రమాదానికి కారకుడని మీరు నిందించిన రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీకి ముఖ్యమంత్రిగా మీ కుమారుడు సాదర స్వాగతం చెప్పడాన్ని ఏమనుకోవాలి? రాజకీయ ప్రయోజనాల కోసం ప్రమాదాన్ని కూడా కుట్రగా అభివర్ణించడం మీ కుటుంబానికే చెల్లుతుంది. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో! అలాంటి మీరు మళ్లీ ఇప్పుడు ‘మా కుటుంబంపై కుట్ర జరుగుతోంది’ అని శోకాలు పెట్టడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబుపై మీకు కోపం ఉంటే అధికారం ఉంది గనుక ఏమైనా చేసుకోండి. మధ్యలో మీడియాను లాగడమంటే మీ కుత్సితాలను కప్పిపుచ్చుకోవడమే అవుతుంది. తప్పులు మాత్రమే కాదు, అక్రమాలకు సైతం పాల్పడుతూ వాటిని ఎత్తిచూపిన వారిపై బురద జల్లుతూ ఎదురుదాడి చేస్తూ ఎంతకాలం తప్పించుకుంటారు? ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిపై ఆయన పార్టీకి చెందిన వారే ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకొనే ప్రయత్నం చేయవలసిందిగా విజయలక్ష్మికి విజ్ఞప్తి. నిజానికి విజయలక్ష్మి మానవత్వం ఉన్న మంచి మనిషి అని చాలా మంది చెబుతారు. రాజశేఖర్‌ రెడ్డి జీవించి ఉన్నంతకాలం ఆయన కుటుంబంపై మీడియాలో వార్తలు రాలేదే! ఇప్పుడెందుకు వస్తున్నాయి? ఇందుకు జగన్‌ రెడ్డి కారణమా? కాదా? అన్నది విజయలక్ష్మి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. కుమారుడి నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి తన పేరుతో లేఖ విడుదల చేయడానికి విజయలక్ష్మి అంగీకరించి ఉండవచ్చు. లేఖపై సంతకం లేకపోవడాన్ని బట్టి ఏమి జరిగిఉంటుందో ఊహించుకోవచ్చు. మౌనమే అన్నింటికీ సమాధానం, పరిష్కారం అని జగన్‌ రెడ్డి భావిస్తూ ఉండవచ్చు గానీ అది ఎంతో కాలం సాగదు. తనపై హత్యాయత్నం జరిగిందని ఎన్నికల ముందు గగ్గోలు పెట్టిన జగన్‌ ఇప్పుడు కేంద్రప్రభుత్వం వద్ద తనకున్న పలుకుబడి ఉపయోగించి ఎన్‌ఐఏ దర్యాప్తును వేగవంతం చేయించలేరా? అధికారంలోకి రావాలన్న లక్ష్యం నెరవేరింది కనుక ఇప్పుడు ఆ సంఘటన ముఖ్యమంత్రికి గుర్తుకొస్తున్నట్టు లేదు. రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబును ఇన్ని ముప్పుతిప్పలు పెట్టే బదులు నిజంగా తనపై జరిగిన సోకాల్డ్‌ హత్యాయత్నం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉండి ఉంటే ఎన్‌ఐఏ ద్వారా ఆయనను అరెస్టు చేయించే శక్తి జగన్‌కు లేదా? దీన్నిబట్టి ఎవరు కపటదారులో, ఎవరు కుట్రలు చేస్తారో అర్థం కావడం లేదా? ఆంధ్రప్రదేశ్‌ పౌరుల వ్యక్తిగత డేటాను చంద్రబాబు, లోకేష్‌ బినామీ కంపెనీ ద్వారా కాజేశారని ఎన్నికలకు ముందు నానా హడావుడీ చేసి సొంతంగా పెట్టుకున్న రోత పత్రికలో పుంఖానుపుంఖానుగా వార్తలు రాయించిన జగన్‌రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా దాని ఊసు ఎత్తకపోవడానికి కారణం ఏమిటి? పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారం ఉన్నందున తెలంగాణలో కేసు నమోదు చేయించి తనకు నమ్మకస్తుడైన స్టీఫెన్‌ రవీంద్ర అనే అధికారి నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేయించుకున్న జగన్‌ రెడ్డి ఇప్పుడు చేతి నిండా అధికారం ఉన్నప్పటికీ తాను దోషులుగా ప్రచారం చేసిన చంద్రబాబు, లోకేష్‌లను ఎందుకు వదిలిపెడుతున్నట్టు! జగన్‌బాబుది ఎంతో గొప్ప స్వభావం అని చెబుతున్న విజయలక్ష్మి, ఈ సంఘటనలకు సంబంధించి చేసిన ప్రచారం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పగలరా? తన భర్త రాజశేఖర్‌ రెడ్డి మరణానికి నిజంగా ఎవరైనా కారకులై ఉంటే వారిని శిక్షించవలసిందిగా కుమారుడైన జగన్‌పై ఒత్తిడి తేలేరా? అమాయకురాలైన విజయలక్ష్మికి ఇందులోని కుట్రలు, కుతంత్రాలు తెలుసో లేదో తెలియదు. ఇవన్నీ కాకపోయినా డాక్టర్‌ సునీత ఆవేదననైనా అర్థం చేసుకొని ఆమె తండ్రి హంతకులను శిక్షింపజేయడానికి శ్రీమతి విజయలక్ష్మి బాధ్యత తీసుకుంటే మంచిది.


పతనానికి పరాకాష్ఠ!

ఈ విషయం అలా ఉంచితే.. పూజారికి నత్తి, వేశ్యకు భక్తి ఉండకూడదని ‘శంకరాభరణం’ సినిమాలో ఒక డైలాగ్‌ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సాక్షాత్తూ విష్ణుమూర్తి ప్రతిరూపమని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా పునఃనియమితులైన రమణదీక్షితులు స్తుతించిన నేపథ్యంలో ఈ డైలాగ్‌ను పలువురు గుర్తుచేసుకుంటున్నారు. నాశనమవుతున్న హిందూ సనాతన ధర్మాన్ని కాపాడ్డానికి జగన్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని కూడా దీక్షితులు శ్లాఘించారు. ఆయన హిందూ ధర్మాన్ని కాపాడతారా? లేదా? అన్నది పక్కనపెడితే హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి రమణదీక్షితులు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తున్నది. కోట్లాది మంది భక్తులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా నమ్మి కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామిని మాత్రమే పూజిస్తూ స్తుతించాల్సిన ప్రధాన అర్చకుడి హోదాలో ఉన్న రమణదీక్షితులు, క్రైస్తవ మతాచారాన్ని ఆచరిస్తున్న జగన్‌ రెడ్డిని విష్ణుమూర్తి ప్రతిరూపమని అభివర్ణించడాన్ని మించిన అపచారం ఏముంటుంది? జగన్‌ రెడ్డిలో విష్ణుమూర్తిని చూస్తున్న రమణ దీక్షితులు ముఖ్యమంత్రి ఒక్కసారైనా సతీసమేతంగా తిరుమలకు ఎందుకు రాలేదో చెబుతారా? తనకు వ్యక్తిగతంగా లాభం చేసినందుకు జగన్‌రెడ్డికి రుణపడి ఉండాల్సిన అవసరం రమణదీక్షితులుకు ఉంటే ఉండవచ్చు. అంతమాత్రాన ఒక నరుడిని నారాయణుడితో పోల్చడం ఏమిటి? క్రైస్తవ మతానికి చెందిన ఫాదర్లు గానీ, బిషప్పులు గానీ ఎవరైనా హిందువుని జీసస్‌ క్రీస్తు లేదా ఎహోవాగా అభివర్ణిస్తారా? అలా చేస్తే క్రైస్తవులు సహిస్తారా? ఆది నుంచి రమణదీక్షితులుది వివాదాస్పద వ్యక్తిత్వమే. జగన్‌రెడ్డి విష్ణుమూర్తి ప్రతిరూపం అయితే తిరుమలలో ఉన్న శ్రీవెంకటేశ్వరుడు ఎవరు? అంటే ఇకపై తిరుమల కొండపై వెలసిన ఆ దేవదేవుడి విగ్రహంలో రమణదీక్షితులుకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మాత్రమే కనిపిస్తారేమో! దేవుడిలో జగన్‌ను చూసుకునే వ్యక్తి ప్రధాన అర్చకుడిగా నియమితుడు కావడమే ఆ దేవదేవుడికి జరిగిన అపచారం. రాజశేఖర్‌ రెడ్డి కుటుంబం పట్ల రమణదీక్షితులుకు మొదటి నుంచీ అభిమానం ఉంది. గతంలో ప్రధాన అర్చకుడిగా ఉన్నప్పుడు కూడా రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ కొండపైన యాగం చేశారు. గత ఎన్నికలకు ముందు జగన్‌రెడ్డికి రాజకీయంగా లబ్ధి చేకూర్చడం కోసం శ్రీవారికి చెందిన పింక్‌ డైమండ్‌ను ఎవరో దొంగిలించారని తీవ్ర ఆరోపణ చేశారు. పింక్‌ కలర్‌లో డైమండ్‌ అనేది ప్రపంచంలోనే ఇంతవరకు ఎక్కడా లేదని మైనింగ్‌రంగంలోని నిపుణులు చెబుతున్నారు. భూగర్భంలోని కార్బన్‌ బాగా ఒత్తిడికి గురయితే నీలం రంగు డైమండ్‌ ఏర్పడుతుంది గానీ పింక్‌ కలర్‌లోకి రాదని విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన టిఎస్‌ఆర్‌ మూర్తి అనే విశ్రాంత మైనింగ్‌ ఇంజనీర్‌ ఫేస్‌బుక్‌ ద్వారా స్పష్టంచేశారు. అంటే, ఆనాడు రాజకీయ కుట్రలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై రమణ దీక్షితులు ఈ ఆరోపణ చేశారని భావించవచ్చు. దేవదేవుడికి మాత్రమే సేవలు, కైంకర్యాలు చేయవలసిన ప్రధాన అర్చకుడికి రాజకీయాలు అవసరమా? ఏ దేవుడిపై ఆధారపడి బతికారో ఆ దేవుడి కంటే దీక్షితులుకు ముఖ్యమంత్రి ఎక్కువ కావడం ఏమిటి? ఇలాంటి వ్యక్తికి శ్రీవారిపై భక్తి ఉంటుందా? ముఖ్యమంత్రిని స్తుతించిన నోటితో ఆ కలియుగ దైవాన్ని స్తుతించే అర్హత రమణ దీక్షితులుకు ఉంటుందా? చంద్రబాబుపై ఆయనకు కోపం ఉంటే ఉండవచ్చు. అంతమాత్రాన తనకు జీవనాధారం కల్పించిన దేవుడినే పావుగా వాడుకోవడం ఏమిటి? ఇంతటి పతనానికి దిగజారిన రమణ దీక్షితులు భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్టే కదా? అందుకు ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. లేని పక్షంలో ఆ దేవుడే అందరి లెక్కలు సెటిల్‌ చేస్తాడు. రమణ దీక్షితులు నైజం తెలిసిన టీటీడీ అధికారులు కొందరు ఆయన ప్రధాన అర్చకుడిగా పునఃనియమితులు కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ముఖ్యమంత్రి అనుగ్రహం పొందిన దీక్షితులుకు ఇక దేవుడి అవసరం కూడా ఉండకపోవచ్చు. సమాజంలో బ్రాహ్మణులది ఉత్కృష్ట పాత్ర. గతంలో రాజులు పరిపాలించే వారు. వైశ్యులు వ్యాపారం చేసేవారు. ఇతర కులాలవారు సైన్యంలోనో, వ్యవసాయం చేసో, ఇతర వృత్తులపైనో ఆధారపడి జీవించగా బ్రాహ్మణులు రాజులకు, ఇతరులకు మార్గదర్శకత్వం వహించేవారు. ఇప్పటికీ సమాజంలో  బ్రాహ్మణుల మాటకు విలువిచ్చేవారు ఎందరో ఉన్నారు. అత్యున్నత ప్రతిభతో, సంస్కారంతో రాణించవలసిన బ్రాహ్మణులలో కొందరు రమణ దీక్షితుల వలె పతనమవుతున్నారు. ఈ తరహా బ్రాహ్మణుల మాదిరిగా చాణక్యుడు, తిమ్మరుసు వంటివారు వ్యవహరించి ఉంటే మహా సామ్రాజ్యాలు ఏర్పడి ఉండేవా? చంద్రబాబుపై ఉన్న కులద్వేషంతో అనుచితంగా ప్రవర్తిస్తున్న రమణ దీక్షితులుకు సాటి కులం వాడని భావిస్తూ కొంతమంది బ్రాహ్మణులు మద్దతు ఇవ్వడంపై అదే సామాజిక వర్గానికి చెందిన టిఎస్‌ఆర్‌ మూర్తి ఫేస్‌బుక్‌ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కోసం వేలాది ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చింది కమ్మ కులస్థుడేనని కూడా ఆయన పేర్కొన్నారు. ‘‘బ్రాహ్మణులు ధనవంతులు కారు. వారికి పెద్దలిచ్చిన ఆస్తి సంస్కారం, వివేకం. ఆ సంపదను ఉపయోగించుకుని సమాజ సేవ చేయడంతో పాటు ఉన్నతంగా జీవిద్దాం’’ అని టిఎస్‌ఆర్‌ మూర్తి తన పోస్టులో రమణ దీక్షితులుకు మద్దతుగా నిలుస్తున్న వారికి విజ్ఞప్తి చేశారు. నిజమే కదా! ఆయన అన్నట్టుగా ఇతర కులాల వారికి బ్రాహ్మణుల మాటపై గౌరవం ఉంటుంది. ఎందుకంటే వారిలో విద్వత్‌ ఉంటుందని, వారు ధర్మాన్ని కాపాడతారని. తన చర్యల ద్వారా రమణ దీక్షితులు ధర్మాన్ని కాపాడుతున్నారా? స్వార్థ చింతనతో పతనం అంచున నిలబడ్డారా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజకీయాలను, రాజకీయపార్టీల నాయకులకు వదిలేసి చేతనైతే పాలకులకు మార్గ నిర్దేశం చేయడానికి ప్రయత్నించడం దీక్షితులు వంటివారికి మంచిది. జానెడు కడుపు నింపుకోవడానికి ఆ కడుపు నింపుతున్న దేవుడ్ని కూడా చిన్నబుచ్చడం దుర్మార్గం. ఇలాంటి అనర్హులను అందలం ఎక్కిస్తున్న జగన్మోహన్‌ రెడ్డి హిందూధర్మాన్ని కాపాడుతున్నారా? నాశనం చేయబోతున్నారా? అన్నది భక్త కోటి ఆలోచించుకోవాలి!

ఆర్కే