విన్నవిస్తారో? విస్మరిస్తారో?

ABN , First Publish Date - 2020-11-30T04:43:51+05:30 IST

జిల్లాలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయింది. పెండింగ్‌ పనులను ఇప్పట్లో చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధాన రహదారులు ఛిద్రమయ్యాయి. అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. జిల్లాకే తలమానికంగా చెప్పుకొస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రెండోసారి శంకుస్థాపన చేయాలని ఈ ప్రభుత్వం భావిస్తోంది.

విన్నవిస్తారో? విస్మరిస్తారో?
శాసనసభ

నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టుల మిగులు పనులు

అధ్వానంగా రహదారులు

గిరిజన వర్సిటీ ఎక్కడో?

మహారాజా కళాశాల ప్రైవేటీకరణపై ఆందోళనలు

భీమసింగి క్రషింగ్‌ నిలిపేయడంపై రైతుల నిరసనలు

 నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

నేతలపై ఎన్నెన్నో ఆశలు


జిల్లాలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయింది. పెండింగ్‌ పనులను ఇప్పట్లో చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధాన రహదారులు ఛిద్రమయ్యాయి. అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. జిల్లాకే తలమానికంగా చెప్పుకొస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రెండోసారి శంకుస్థాపన చేయాలని ఈ ప్రభుత్వం భావిస్తోంది. భూ సేకరణ పూర్తి కాలేదు. ప్రతిష్టాత్మకమైన గిరిజన విశ్వ విద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేస్తారో ఇప్పటికీ స్పష్టత రాలేదు. గిరిశిఖర గ్రామాలకు రోడ్లు లేక డోలీలే ఆధారంగా వారు నిత్యం ఎదుర్కొంటున్న కష్టాలు చూస్తున్నాం. మహారాజా కళాశాలను ప్రైవేటీకరించాలని మాన్సాస్‌ ట్రస్టు తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భీమసింగి చక్కెర కార్మాగారంలో ఈ ఏడాది క్రషింగ్‌ ఆపేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో సోమవారం నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మన మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. 



(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో అభివృద్ధి పడకేసింది. కీలకమైన రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. వాటిపై ప్రయాణానికి ప్రజలు నరకయాతన పడుతున్నారు. అంతర్‌రాష్ట్ర రహదారి బాగాలేని కారణంగా ఒడిశా రాష్ట్రం రాయగడకు నడుస్తున్న ఆర్టీసీ సర్వీసులు ఆపేశారు. ఏడాది కిందట నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాయగడకు తిరిగేవి. నేడు ఆటోలే వెళ్తున్నాయి. ఈ రోడ్డులో ఎక్కడికక్కడ మూడు అడుగుల లోతులో గోతులు ఏర్పడ్డాయి. కీలకమైన ఈ రహదారికి తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారు. అధికారులు, నేతలు రహదారులను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతులు లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పెండింగ్‌ కాలువల పనులను పూర్తి చేస్తే కొత్తగా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు సరికదా పెండింగ్‌ పనులను ఇటీవల రద్దు చేసింది. దీంతో ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. గజపతినగరం బ్రాంచి కాల్వ పనులను రెండేళ్లుగా చేపట్టడం లేదు. బొబ్బిలి నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు ప్రధాన కాల్వపై ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే గతంలో ప్రకటించారు. మరి అసెంబ్లీలో ప్రస్తావిస్తారో!లేదో! చూడాలి. నెల్లిమర్ల నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు.. విజయనగరం పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు చంపావతి నదిపై తారకరామ తీర్థ సాగర్‌ సాగునీటి ప్రాజెక్టు పనులు ప్రారంభించారు.  రెండు దశాబ్దాలుగా ఈ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా గుమ్మిడి గెడ్డ, సురాపాడు, అడారు, వనకాబడి తదితర చిన్న సాగునీటి ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తిచేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. 

మంజూరైనా.. పురోగతి ఏదీ?

జిల్లాకు మంజూరైన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగటం లేదు. కొత్త అభివృద్ధి పనులు మంజూరు చేసినవి సైతం అడుగు కూడా కదలడం లేదు. భోగాపురం విమానాశ్రయానికి గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు  శంకుస్థాపన చేశారు. మళ్లీ శంకు స్థాపనకు ఈ ప్రభుత్వం సిద్ధపడుతోంది. భూ సేకరణ పూర్తికాలేదు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం నిధులు మంజూరు చేయలేదు. అయినప్పటికీ మరోమారు శంకుస్థాపన పేరుతో అధికార యంత్రాంగం హడావిడి చేస్తోంది. 

గిరిజన విశ్వ విద్యాలయం ఎక్కడ?

రాష్ట్ర విభజనలో భాగంగా జిల్లాకు కేటాయించిన గిరిజన విశ్వవిదాలయాన్ని ఎక్కడ నిర్మిస్తారన్నదానిపై నేటికీ స్పష్టత రాలేదు. గత ప్రభుత్వ హయాంలో కొత్తవలసలో ఏర్పాటు చేయాలని భావించి స్థల ఎంపిక కూడా పూర్తి కాగా ఈ ప్రభుత్వం సాలూరు, గజపతినగరం నియోజకవర్గాల్లో స్థలాలను చూస్తోంది. ఎక్కడ నిర్మాణం చేపట్టనున్నదీ నేటికీ నిర్ణయం తీసుకోలేదు. విజయనగరంలో తరగతులు ప్రారంభమైౖ రెండో ఏట నడుస్తున్నా స్థల నిర్ణయం విషయంలో ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి సాలూరు నియోజకవర్గంలోనే ఏర్పాటయ్యేలా ప్రయత్నించాలని ఎమ్మెల్యే భావిస్తున్నారు. 

వైద్య కళాశాలకు పునాది పడేదెప్పుడో!

ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాం నుంచి అదిగో ఇదిగో అంటూ వస్తున్న వైద్య కళాశాల ఎక్కడ నిర్మించాలన్నదానిపైనా ఏడాదిగా సందిగ్ధం నడిచింది. గాజులరేగలో స్థలం కేటాయించినట్లు ఇటీవల ప్రకటించారు. అయితే రూ.250 కోట్లు కేటాయించినట్లు ఏడాది కిందటే చెప్పినా నిధులు విదల్చలేదు. కాగా విజయనగరం జిల్లా కేంద్రంలో నేటికీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి నోచుకోలేదు. గత ప్రభుత్వం చివరి దశలో కళాశాలను ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో జూనియర్‌ కళాశాల అవరణలో తరగతులు నిర్వహిస్తున్నారు. గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరైనా నేటికీ స్థలం, భవనాలకు నిధులు మంజూరు చేయలేదు. 

కొఠియాలో జాడ లేని అభివృద్ధి

కొఠియా గ్రామాల సరిహద్దు సమస్యలు వెంటాడుతున్నాయి. కొఠియా గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వం భారీ స్థాయిలో రోడ్డు నిర్మాణాలు, పాఠశాల భవనాలు, వైద్య శాలలు, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాల నిర్మాణాలు చేపడుతున్నది. కాని మన ప్రభుత్వం కనీసం వీటి వంక చూడటం లేదు. వారు అభివృద్ధి పరిస్తే వాటిని అడ్డుకునే పరిస్థితిలో కూడా మన ప్రభుత్వం లేదు. కారణం ఇరు రాషా్ట్రల సరిహద్దు సమస్య నెలకొంది. మరో వైపు గిరిజన పల్లెలకు పక్కా రహదారులు లేవు. ఇప్పటికీ డోలీలే ఆధారంగా వారు నరకయాతన పడుతున్నారు. 

మహారాజా కళాశాల ప్రైవేటీకరణపై ఉద్యమం

మహారాజా కళాశాలను ప్రైవేటీకరించాలని మన్సాస్‌ ట్రస్టు తీసుకున్న నిర్ణయాన్ని జిల్లాలోని అన్ని వర్గాలూ వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యమాలు చేస్తున్నాయి. ఎయిడెడ్‌ కళాశాలగా ఉన్న దీనిని ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇది రాజుల కుటంబ వ్యవహారంగా స్థానిక మంత్రి చెబుతున్నారు. మాన్సాస్‌ ట్రస్టు దేవదాయ శాఖ పరిధిలో నడుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎమ్మెల్యే ప్రైవేటీకరణను అసెంబ్లీలో ప్రస్తావించి అడ్డుకోవాల్సి ఉంది. 

చక్కెర కార్మాగారం మూత

భీమసంగి సహకార చక్కెర కర్మాగారంలో ఈ ఏడాది గానుగ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కాని ఎటువంటి మరమ్మతులు చేపట్టడం లేదు. అలా అని కొత్త మిషనరీ తెప్పించడం లేదు. దీని వెనుక ప్రైవేటీకరణ కుట్ర ఉందని రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఈ పరిశ్రమను ఏం చేయదలచినదీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉండగా జిల్లాలో మరో చక్కెర పరిశ్రయ సీతానగరం మండలం లచ్చయ్యపేట వద్ద ఉంది. దీని పరిధిలోని చెరకు రైతులకు బకాయిలు చెల్లించడం లేదు. దీనిపై రైతులు నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఈ సమస్యలన్నింటికీ అసెంబ్లీ వేదికగా సమగ్ర పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2020-11-30T04:43:51+05:30 IST