Advertisement
Advertisement
Abn logo
Advertisement

బెల్లానికి బదులు చక్కెర వాడుకోవచ్చా?

ఆంధ్రజ్యోతి(29-07-2020)

ప్రశ్న: మధుమేహం ఉన్నవారు బెల్లం తినవచ్చా? టీ కాఫీలలో చక్కెర బదులుగా బెల్లం వాడుకోవచ్చా?


-రాణిశ్రీ, అమలాపురం 


డాక్టర్ సమాధానం: చక్కెరతో పోలిస్తే బెల్లంలో కొన్ని రకాల ఖనిజాలు, కొంత యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల సాధారణంగా చక్కెరకు బదులుగా బెల్లం వాడడం మంచిదే. కానీ, బెల్లానికి, చక్కెరకు కేవలం చూడడానికి, రుచి చూడడానికి తప్ప కాలొరీల్లో కానీ, రక్తంలో గ్లూకోజు స్థాయిలు పెంచడంలో కానీ ఎక్కువ తేడాలు లేవు. అందువల్ల పరిపూర్ణ ఆరోగ్యవంతులు పరిమిత మోతాదుల్లో చక్కెర వాడకం బదులుగా బెల్లం వాడితే కొంత వరకు పరవాలేదు. కానీ మధుమేహం ఉన్నవారు చక్కెర బదులుగా బెల్లం వాడినా వారి రక్తంలో గ్లూకోజు విషయంలో మాత్రం ఏమి ఉపయోగం ఉండదు. మధుమేహం ఉన్నవారు ఆరోగ్యం కోసం తప్పనిసరిగా తీపి పదార్ధాలను పూర్తిగా మానెయ్యడం కానీ చాలా తక్కువ మోతాదులో, కేవలం వారానికో నెలకో ఒకసారి మాత్రమే తీసుకోవాలి. టీలు కాఫీల ద్వారా రక్తంలోకి గ్లూకోజు చేరవేస్తున్నప్పుడు అది చక్కెరయినా బెల్లమైనా మధుమేహం ఉన్నవారికి ప్రమాదమే. వీటి బదులు టీ కాఫీలు ఎటువంటి తీపి లేకుండా తీసుకోవడంలో లేదంటే పూర్తిగా వాటిని తాగడం మానెయ్యడమో చేయడం శ్రేయస్కరం. బెల్లం మంచిది కాబట్టి ప్రతి రోజు దాంతో చేసిన మిఠాయిలను తినడం ఆరోగ్యవంతులకు కూడా మంచిది కాదు. ఎటువంటి తీపి వస్తువులైనా అలవాటుగా ప్రతిరోజూ తీసుకుంటే అదే అనారోగ్యానికి దారి తీస్తుంది. బెల్లంలో విటమిన్లు ఖనిజాల కోసం తీసుకునే వారు అదే విటమిన్లు ఖనిజాలను తాజా పండ్లు, ఆకుకూరలు, అన్ని రకాల పప్పు ధాన్యాలు, పాలు, పెరుగు, గుడ్లు, గింజలు, మొదలైన పరిపూర్ణ ఆహారం ద్వారా పొందితే మరింత మంచిది. కేవలం పోషకాహార లేమితో బరువు తక్కువ ఉన్నవారు, బాగా చురుకుగా (కనీసం రోజుకు రెండు మూడు గంటల పాటు) ఆటలాడే ఆటగాళ్లు, ఎదిగే వయసులో తక్కువ బరువుతో ఉన్న పిల్లలు మాత్రం అప్పుడప్పుడు ఈ బెల్లంతో చేసిన పదార్ధాలు తీసుకుంటే అందులోని కేలొరీల వల్ల శక్తి వస్తుంది. మిగిలిన వారందరూ బెల్లాన్ని కూడా చక్కెరతో సమానంగా చూస్తూ.. ఎప్పుడైనా ఒకసారి మాత్రమే తీసుకుంటే మేలు. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Advertisement
Advertisement