సాదాబైనామాలకు మోక్షం లభించేనా?

ABN , First Publish Date - 2021-01-21T04:06:50+05:30 IST

సాదాబైనామా కాగితాలపై భూములు కొనుగోలు చేసిన రైతులకు చట్టబద్దత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2014 జూన్‌ 2లోపు భూములు కొన్న వారికి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలని నిర్ణయించింది.

సాదాబైనామాలకు మోక్షం లభించేనా?

పరిశీలించి పట్టాలు ఇవ్వాలని కలెక్టర్‌లకు ప్రభుత్వం ఆదేశం 

జిల్లాలో 26,884 దరఖాస్తుల పెండింగ్‌ 

దరఖాస్తుదారుల్లో ఆశలు 


బెల్లంపల్లి, జనవరి 20 : సాదాబైనామా కాగితాలపై భూములు కొనుగోలు చేసిన రైతులకు చట్టబద్దత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2014 జూన్‌ 2లోపు భూములు కొన్న వారికి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలని నిర్ణయించింది. జిల్లాలోని ఆయా మండలాల్లో 26,884 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామాలకు మోక్షం లభించనుంది. ఇందుకు సంబంధించి కలెక్టర్‌లు పరిశీలించాక యాజమాన్య హక్కు ఎవరికి చెందుతుందో నిర్ణయించి తహసీల్దార్‌కు పంపిస్తారు. అనంతరం పట్టా పాసు పుస్తకాలను అందజేయనున్నారు. జిల్లాలో ప్రస్తుతం సాదాబైనామాలకు సంబంధించిన ప్రక్రియను రెవెన్యూ సిబ్బంది ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 

జిల్లాలో 28,884 దరఖాస్తులు పెండింగ్‌...

జిల్లా వ్యాప్తంగా సాదాబైనామా క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం అవకాశం కల్పించడంతో భారీగా స్పందన వచ్చింది. జిల్లాలో మొత్తం 26,884 సాదాబైనామాలు పెండింగ్‌లో ఉండగా వీటన్నింటికి చట్టబద్దత కల్పించాల్సి ఉంది. సాదాబైనామాల ద్వారా భూములు కొనుగోలు చేసిన వారికి అధికారికంగా యాజమాన్య హక్కు ఉండేది కాదు. దీంతో గొడవలు, కోర్టులు, పోలీస్‌స్టేషన్‌ల చుట్టూ తిరుగుతుండేవారు. చాలా మంది రైతులు భూములు సాగు చేసుకుంటున్నా హక్కులు అధికారికంగా రాకపోవడంతో రైతుబంధు, బీమాతోపాటు బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నారు. ప్రభుత్వం సాగు చేసుకుంటున్న రైతుల పేర్లపై పట్టాదారు పాసు పుస్తకాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్ధాయి పరిశీలన అనంతరం వాస్తవాలు నిర్ధారించుకుని యాజమాన్య హక్కులు కల్పిస్తారు. కోర్టు విచారణలో ఉన్నవి మినహా ఇతర భూములకు సంబంధించినవి పరిశీలించనున్నారు. 

మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు 

బెల్లంపల్లి - 2417

భీమారం - 1987

భీమిని - 615

చెన్నూరు - 3634

దండేపల్లి  1522

హాజీపూర్‌ - 990

జైపూర్‌ - 1920

జన్నారం - 259

కన్నెపల్లి - 762

కాసిపేట -954

కోటపల్లి - 4562

లక్షెట్టిపేట - 1406

మంచిర్యాల - 165

మందమర్రి - 1580

నస్పూర్‌ - 225

నెన్నెల - 1663

తాండూర్‌ - 1275

వేమనపల్లి - 948 

మొత్తం - 26884


పరిశీలన కష్టమే...

రైతులు ఆన్‌లైన్‌ ఫారం 10 (సాదాబైనామా) కింద చేసుకున్న దరఖాస్తులను తహసీల్దార్‌ పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కలెక్టర్‌కు పరిశీలన కోసం పంపిస్తారు. కలెక్టర్‌ పరిశీలించాక యాజమాన్య హక్కు ఎవరికి చెందుతుందో నిర్ణయించి తహసీల్దార్‌లకు పంపిస్తారు. ఆయా తహసీల్దార్‌లు 1బీలో నమోదు చేసి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాల్సి ఉంటుంది. విక్రయదారులకు నోటీసులు జారీ చేయడం, వాంగ్మూలం నమోదులో వీరి పాత్ర కీలకం. ఇందుకు బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తుండగా తమ వేలి ముద్రలు వేసి రైతులకు హక్కు పత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ పొరపాటు జరిగినా తహసీల్దార్‌లదే బాధ్యత.  జిల్లాలో 18 మండలాలు ఉండగా ఆయా మండలాల్లో సాదాబైనామా కింద వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న వీటిని కలెక్టర్‌ పరిశీలించడం వేగవంతంగా ప్రక్రియ పూర్తి చేయడం అనుమానమే. గతంలో సాదాబైనామా కింద భూములు అమ్మిన వారు ప్రస్తుతం భూమి విలువ పెరగడంతో బదిలీ ప్రక్రియను సైతం అడ్డుకునే అవకాశం లేకపోలేదు. 


పరిశీలన జరుగుతుంది

- తాండూర్‌ తహసీల్దార్‌ కవిత

సాదాబైనామాల ప్రక్రియకు సంబంధించిన పరిశీలన జరుగుతుంది. త్వరలోనే సాదాబైనామా కింద దరఖాస్తులు చేసుకున్న వారికి మోక్షం లభించనుంది. సాదాబైనామాలకు సంబంధించి ప్రాథమికంగా విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదికలను పంపిస్తాం. 

Updated Date - 2021-01-21T04:06:50+05:30 IST