మగ్గం మోత వినిపించేనా?

ABN , First Publish Date - 2022-01-07T06:24:24+05:30 IST

చేనేత వస్త్రాలపై జిఎస్‌టిని 5 నుంచి 12 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆఖరి నిమిషంలో ఉపసంహరించుకుంది. త్వరలో ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న...

మగ్గం మోత వినిపించేనా?

చేనేత వస్త్రాలపై జిఎస్‌టిని 5 నుంచి 12 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆఖరి నిమిషంలో ఉపసంహరించుకుంది. త్వరలో ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేశారు. మళ్లీ జరిగే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో దీనిన సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించడంతో ఇది కేవలం వాయిదా మాత్రమేనని రద్దు కాదని అర్థమవుతోంది.


దేశీయ జౌళి రంగంలో మూడు రకాలుగా ఉత్పత్తి జరుగుతున్నది. చేనేత, మిల్లు, పవర్ లూం. ఈ విధానం భారతదేశంలో మాత్రమే ఉంది. ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమైన తర్వాత భారత పాలకులు బహిరంగంగా మిల్లు యజమానులు, పవర్ లూం యజమానులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ చేనేత వృత్తిని సంక్షోభంలోకి నెడుతున్నారు. 1980లో జాతీయ జౌళి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది జౌళి రంగంలో అనేక మార్పులు తెచ్చింది. సంస్కరణలు మొదలయ్యాయి. పవర్ లూం రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. పైకి మాత్రం చేనేత రంగాన్ని ఆదుకుంటున్నట్లు నాటక మాడింది. అందులో భాగమే నూలు మిల్లులు 50 శాతం చిలవల నూలును ఉత్పత్తి చేయాలని, 22 రకాలను కేవలం చేనేత రంగంలోనే ఉత్పత్తి చేయాలని 1985లోనే చట్టం చేసినట్టు చెప్పింది. చట్టాన్ని వ్యతిరేకిస్తూ మిల్లు యజమానులు కోర్టుకు వెళ్లగా, 1993లో రిజర్వేషన్లకు కోర్టు ఆమోదం తెలిపింది. అయినా చేనేత రకాల రిజర్వేషన్లు, నూలు ఉత్పత్తి శాతం అమలు కాలేదు. 


చేనేతకు కేటాయించిన రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకోకుండా, మిల్లు, పవర్ లూం లాబీల ఒత్తిడికి లొంగిన పాలకులు చేనేత వస్త్రాల కేటాయింపుపై తిరిగి 1996లో మీరా సేథీ కమిటీని నియమించారు. ఈ కమిటీ చేనేతకు కేటాయించిన 22 రకాలను 11కు తగ్గించింది. దీనికి వ్యతిరేకంగా చేనేత వృత్తిదారులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. 


చేనేతకు కేటాయించిన రకాలను కూడా పవర్ లూం యజమానులు ఉత్పత్తి చేసి చేనేత ముద్రవేసి విక్రయించటం, సహకార సంఘాలకు ఆప్కో బకాయలు పెట్టడం, చేనేతకు ప్రభుత్వ సహాయం అందకపోవటంతో వృత్తి రక్షణ కోసం చేనేత వృత్తిదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రారంభించారు. ఈ ఆందోళనల నేపథ్యంలోనే పవర్ లూం యజమానుల ప్రయోజనాలు కాపాడేందుకు 2000 సంవత్సరంలో ఎన్‌డిఏ ప్రభుత్వం సత్యం కమిటీని నియమించింది. ఈ కమిటీ చేనేతకు కేటాయించిన రిజర్వేషన్లు రద్దు చేయాలని, మిల్లులకు కేటాయించిన చిలవల నూలు కోటాను రద్దు చేయాలని, చేనేత రంగానికి బడ్జెట్ ఏటా తగ్గించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసే సత్యం కమిటీ సిఫార్సులకు అనుగుణంగా నూతన జౌళి విధానాన్ని ఆ సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో అపెరల్, టెక్స్ టైల్ పార్కులు, పవర్ లూం రంగం అభివృద్ధికి పెద్దపీట వేసింది. చేనేత ఉనికికే ఎసరు పెట్టింది. 


వివిధ రూపాల్లో చేనేత వృత్తిని సంక్షోభంలోకి నెట్టే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతూనే ఉన్నాయి. అందులో భాగమే రంగులు, రసాయనాలు, నూలు ధరల నియంత్రణ నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంది. ఫలితంగా వాటి ధరలు విపరీతంగా పెరిగాయి. గత సంవత్సరం వీటి ధరలు 30 నుంచి 40 శాతం పెరిగాయి. దాంతో చేనేత వస్త్రాల ధరలు పెరిగి ప్రజల కొనుగోళ్లు తగ్గి నిల్వలు పేరుకుపోయాయి. 


యూపీఏ ప్రభుత్వాన్ని మించి ఎన్‌డిఏ ప్రభుత్వం చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెడుతోంది. నామ మాత్రంగా ఉన్న బడ్జెట్ కేటాయింపుల్లో కోత విధిస్తోంది. 2014–15 బడ్జెట్‌లో రూ.621.57 కోట్లు కేటాయించగా, 2020–-21 బడ్జెట్‌లో 344.87 కోట్లకు తగ్గింది. అధికార మార్పిడి జరిగిన ప్రారంభ సంవత్సరాల్లో ఐదు కోట్ల కుటుంబాలు చేనేత వృత్తిపై జీవించగా, నేడు అవి 30.44 లక్షలకు తగ్గాయి. కుటుంబ ఆదాయం ఐదు వేల రూపాయల కన్నా తక్కువగా ఉంది.


ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణలో భాగంగా జూలై 2021లో ప్రభుత్వం అఖిలభారత చేనేత బోర్డును రద్దు చేసింది. 2017లో నూలుపై 12శాతం జిఎస్‌టి విధించింది. తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో 5శాతానికి తగ్గించింది. ఇప్పుడు మళ్లీ 12 శాతానికి పెంచి ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తానని చెప్పి, తీవ్ర వ్యతిరేకత రావడంతో అమలును వాయిదా వేసింది. అయితే త్వరలోనే అమలు జరుపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. జిఎస్‌టి పెంచటంవలన నూలు ధరలు విపరీతంగా పెరుగుతాయి. గత మూడు నెలల క్రితం 3, -4 వేల రూపాయల మధ్య ఉన్న కిలో నూలు ధర నేడు ఆరువేలకు పెరిగింది. ఆ మేరకు చేనేత వస్త్రాల ధరలు పెరుగుతాయి. ఫలితంగా వాటి కొనుగోలు తగ్గడంతో మాస్టర్ వీవర్స్ ఉత్పత్తిని తగ్గిస్తున్నారు. వృత్తిదారుల ఉపాధి తగ్గి, ఆదాయం కోల్పోయి కుటుంబ పోషణ మరింత భారంగా మారుతుంది. చేనేత వృత్తిని దెబ్బతీసే జిఎస్‌టి పెంపును పూర్తిగా ఉపసంహరించాలని, చేనేత రంగాన్ని పరిరక్షించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగం పట్ల వ్యతిరేక విధానాలు విడనాడాలంటే చేనేత వృత్తిదారులంతా ఐక్యంగా ఉద్యమించాలి.

బొల్లిముంత సాంబశివరావు 

Updated Date - 2022-01-07T06:24:24+05:30 IST