Abn logo
Sep 2 2021 @ 01:00AM

‘కోహ్లీ’సేన పుంజుకొనేనా?

  • అశ్విన్‌కు చోటు!
  • జోష్‌లో ఇంగ్లండ్‌
  • నేటి నుంచి నాలుగో టెస్ట్‌
  • మ. 3.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో

లండన్‌: బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో మూడో టెస్ట్‌లో దారుణంగా ఓడిన టీమిండియా.. బలంగా పుంజుకోవాలనే పట్టుదలతో ఉంది. గురువారం నుంచి ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్ట్‌లో గెలుపే లక్ష్యంగా కోహ్లీ సేన బరిలోకి దిగుతోంది. ఐదు టెస్ట్‌ల సిరీ్‌సలో ఇరుజట్లూ 1-1తో సమంగా నిలిచాయి. తొలి టెస్ట్‌ డ్రాగా ముగియగా.. లార్డ్స్‌లో జయకేతనం ఎగుర వేసిన టీమిండియా లీడ్స్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో చిత్తయింది. సిరీస్‌ ఫలితంపై ప్రభావం చూసే మ్యాచ్‌ కావడంతో టీమిండియా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ మినహా మిగతా వారు చెప్పుకోదగ్గ ప్రదర్శనైతే చేయలేదు. కోహ్లీ, పుజార, రహానె ఫామ్‌ కోసం తంటాలుపడుతున్నారు. అయితే, మూడో టెస్ట్‌లో పుజార 91 పరుగులతో టచ్‌లోకి వచ్చాడు. కానీ, మిడిలార్డర్‌లో రహానె వైఫల్యం నేపథ్యంలో తుది జట్టు కూర్పు కోహ్లీకి కత్తిమీద సాములా మారింది. అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ సూచిస్తున్న నేపథ్యంలో సూర్యకుమార్‌ పేరు చర్చకు వస్తోంది. రూట్‌కు చెక్‌ పెట్టేందుకు..

పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించవచ్చన్న అంచనాలతో అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోవడం ఖాయమంటున్నారు. జడ్డూతో పోల్చితే ఫుల్‌ ఫామ్‌లో ఉన్న రూట్‌కు అశ్విన్‌ అయితే చెక్‌పెట్టగలడని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. కాగా, నలుగురు పేసర్ల ఫార్ములాకే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్న కోహ్లీ.. ఆకట్టుకోలేక పోతున్న ఇషాంత్‌ స్థానంలో శార్దూల్‌ను తీసుకోవాలని అనుకుంటున్నాడు. పేసర్లు బుమ్రా, షమి, సిరాజ్‌ మూడు టెస్ట్‌లు ఆడడంతో.. రొటేషన్‌ పద్ధతిలో విశ్రాంతి ఇచ్చే అవకాశాలున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొనే స్టాండ్‌బైగా ఉన్న పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణను ప్రధాన జట్టులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు లీడ్స్‌ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న ఇంగ్లండ్‌.. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో పటిష్ఠంగా కనిపిస్తోంది. రీ ఎంట్రీలో మలన్‌ సత్తాచాటాడు. పేసర్లు మార్క్‌ ఉడ్‌, క్రిస్‌ వోక్స్‌ రాకతో అండర్సన్‌కు విశ్రాంతినివ్వొచ్చు. వ్యక్తిగత కారణాలతో బట్లర్‌ దూరం కావడంతో.. మొయిన్‌ అలీ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 


పిచ్‌/వాతావరణం

కెన్నింగ్టన్‌ ఓవల్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలమే అయినా.. తొలి ఇన్నింగ్స్‌లో పేసర్లకు కొంత సహకరించే అవకాశం ఉంది. అయితే, మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ వికెట్‌ మందకొడిగా మారి స్పిన్నర్లకు సహకరించవచ్చు. తొలి మూడు రోజులు వర్షం కురిసే చాన్స్‌ లేద న్నది వాతావరణ శాఖ నివేదిక. 1

ఓవల్‌లో ఆడిన 13 టెస్ట్‌ల్లో భారత్‌ ఒకటి (1971 టూర్‌లో) మాత్రమే గెలిచింది. ఇక్కడ ఆడిన చివరి మూడు టెస్ట్‌ల్లో టీమిండియా ఘోర పరాజయాలను  చవిచూసింది. 


జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, పుజార, కోహ్లీ, రహానె, పంత్‌,  బుమ్రా,  సిరాజ్‌,  జడేజా/అశ్విన్‌,  షమి/ఉమేష్‌, ఇషాంత్‌/శార్దూల్‌.

ఇంగ్లండ్‌: బర్న్స్‌, హమీద్‌, మలన్‌, రూట్‌, ఓల్లీ పోప్‌, బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), మొయిన్‌ అలీ, క్రిస్‌ వోక్స్‌, రాబిన్సన్‌, ఓవర్టన్‌, అండర్సన్‌. 

క్రైమ్ మరిన్ని...