హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు అనగలరా?

ABN , First Publish Date - 2022-05-27T08:54:17+05:30 IST

హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు అనగలరా?

హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు అనగలరా?

ఎన్నికలప్పుడు హామీలతో జగన్‌ దగా చేశారు

మూడేళ్లయినా వాటిని అమలు చేయట్లేదు

వైసీపీ ఎంపీ రఘురామరాజు ధ్వజం


న్యూఢిల్లీ, మే 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని చెప్పగలరా అంటూ వైసీపీని ఆ పార్టీ ఎంపీ రఘురామ రాజు నిలదీశారు. పోయినసారి రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయడం వల్ల తాము స్వచ్ఛందంగా బీజేపీకి మద్దతిచ్చామని తమ పార్టీ నేత విజయసాయి రెడ్డి చెప్పిన విషయాన్ని రఘురామ రాజు ప్రస్తావించారు. ఈసారి బీజేపీ అడిగితే మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని విజయసాయి చెప్పడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై సంతకం పెడితేనే ఈసారి మద్దతిస్తామని చెప్పగలరా అని ఆయన విజయసాయిని సూటిగా ప్రశ్నించారు. లేకపోతే వివేకా హత్య కేసులో తమ వారి ప్రమేయం లేదని, అలాగే తనపై ఉన్న కేసుల్లో నిర్దోషిగా ప్రకటించాలని విజయసాయి కోరే అవకాశం ఉందని రఘురామ వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధ్యక్షుడి హోదాలో సీఎం జగన్‌ అనేక హామీలు ఇచ్చారని, మూడేళ్లయినా అమలు చేయలేదని  రఘురామరాజు విమర్శించారు. ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయని రాజకీయ నాయకులను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి రావాలన్న జగన్‌... ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం ఏర్పడితే వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని రఘురామ గుర్తు చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్‌, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించకుండా నిరుద్యోగ యువతను దగా చేశారని అన్నారు. మరోవైపు, కోనసీమ ఘటనకు సంబంధించి మంత్రి విశ్వరూప్‌ అద్దెకు ఉంటున్న ఇల్లు తగులబడడం, నూతనంగా నిర్మించుకున్న ఇల్లు మాత్రం పాక్షికంగా దెబ్బతినడం... కోనసీమ జిల్లా ఉద్యమానికి తమ పార్టీ బీసీ విభాగం నాయకుడు మురళీ కృష్ణ నేతృత్వం వహించడం, సాయి ఉదంతం ఇలా అన్నీ పరిశీలిస్తే.. ఈ మొత్తం ఘటనల వెనుక ఎవరున్నారో స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. కోనసీమ ఘటన వెనుక కౌన్సిలర్‌, వాలంటీర్‌, బీసీ నాయకులు ఉన్నారని, ఓ వలంటీరు 50 మందిని ఇతర ప్రాంతం నుంచి తరలించినట్లుగా పక్కా సమాచారం ఉందని, డీఎస్పీపై జరిగిన రాళ్ల దాడిలో వాళ్లు పాల్గొన్నట్లు ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. మాల మహానాడు అధ్యక్షుడిగా పనిచేసిన జూపూడి ప్రభాకర్‌రావు సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారని, మరొక సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం ఆయనకు తగదని సూచించారు. కాగా, దావోస్‌ వెళ్లిన బృందంలోని ఎంపీ మిథున్‌ రెడ్డితో సీబీఐ కేసు ఎదుర్కొంటున్న పంచ్‌ ప్రభాకర్‌ భేటీ కావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సీఎం జగన్‌తో కూడా ప్రభాకర్‌ భేటీ అయినట్లు తెలుస్తోందని, సీబీఐ కేసులలో ఏ1 నిందితుడిగా ఉండి, కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్ళిన వ్యక్తి... సీబీఐ గాలిస్తున్న మరొక వ్యక్తితో భేటీ కావడాన్ని కోర్టులు ప్రశ్నిస్తాయని భావిస్తున్నానని చెప్పారు. 

Updated Date - 2022-05-27T08:54:17+05:30 IST