Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 18 2021 @ 02:54AM

ఆర్టీసీకి 500 కోట్ల రుణం దక్కేనా?

  • గ్యారెంటీ లేఖ ఇవ్వడంలో సర్కారు జాప్యం 
  • షూరిటీ లేకుండా ఇవ్వలేమంటున్న ఎన్‌సీడీసీ


హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్న నేషనల్‌ కో-ఆపరేటివ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీడీసీ) రుణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న గ్యారెంటీ లేఖ ఇప్పటికీ అందకపోవడంతో.. రుణం మంజూరుకు ఎన్‌సీడీసీ విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ గ్యారెంటీతో.. ఉద్యోగుల క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ (సీసీఎ్‌స)కి నేషనల్‌ కో-ఆపరేటివ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీడీసీ) నుంచి రూ. 500 కోట్లు రుణం తీసుకునేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దీనికోసం ఆర్టీసీ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ అప్పు మంజూరయితే.. దసరాలోపు తమకు రుణాలు, అడ్వాన్సులు అందుతాయని భావించారు. కానీ, ప్రభుత్వం గ్యారెంటీ లేఖ విడుదల చేయకపోవడంతో.. వారి ఆశలు ఆవిరయ్యాయి. 


దీనిపై అధికారులు స్పందిస్తూ.. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో అంతా బిజీగా ఉండడం వల్లే లేఖ పంపడం ఆలస్యమవుతోందని తెలిపారు. దీంతో.. కనీసం దీపావళికైనా తమకు రుణాలు, అడ్వాన్సులు అందుతాయో లేదోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ కింద ఇప్పటికే పలు జాతీయ బ్యాంకుల నుంచి ఆర్టీసీ.. రూ. 1,000 కోట్ల వరకు రుణం తీసుకుంది. తాజాగా ఉద్యోగులకు అడ్వాన్సులు, రుణాలు ఇవ్వడానికి సీసీఎస్‌ వద్ద నిధులు లేకపోవడంతో.. ఏదైనా బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే.. తాము గ్యారెంటీ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ఆర్టీసీ అధికారులు.. రుణం ఇచ్చేందుకు ఎన్‌సీడీసీని ఒప్పించగలిగారు. ఇది జరిగి నెల దాటినా.. ఇప్పటికీ ప్రభుత్వం గ్యారెంటీ లేఖ అందించకపోవడంతో.. ఈ రుణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఈ విషయంలో చొరవ తీసుకున్న ఆర్టీసీ ఎండీ వీసీ.సజ్జనార్‌.. ఎన్‌సీడీసీ రుణం అందకపోయినా.. అక్టోబరు నెలాఖరు నాటికి ఆర్టీసీ ఖజానా నుంచే రూ.200 కోట్ల వరకు సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. 

Advertisement
Advertisement