Asia Cup 2022 : 8వ సారి ఆసియా కప్ గెలిచేనా?.. టీమిండియా బలాలు, బలహీనతలు ఇవే..

ABN , First Publish Date - 2022-08-12T19:47:41+05:30 IST

ఆసియా కప్‌(Asia Cup)ను భారత్(India) ఇప్పటివరకు 7 సార్లు గెలుచుకుంది. ఈ టోర్నమెంట్‌లో టీమిండియా ఆధిపత్యం ఎలా ఉందో టైటిల్సే చాటిచెబుతున్నాయి.

Asia Cup 2022 : 8వ సారి ఆసియా కప్ గెలిచేనా?.. టీమిండియా బలాలు, బలహీనతలు ఇవే..

ముంబై : ఆసియా కప్‌(Asia Cup)ను భారత్(India) ఇప్పటివరకు 7 సార్లు గెలుచుకుంది. ఈ టోర్నమెంట్‌లో టీమిండియా ఆధిపత్యం ఏ రేంజ్‌లో ఉందో  టైటిల్సే చాటిచెబుతున్నాయి. చివరిసారి 2018లో రోహిత్ శర్మ(Rohit Sharma) నాయకత్వంలోని టీమిండియా(Team India) ఉత్కంఠ భరిత ఫైనల్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ని మట్టికరిపించింది. అయితే 8వ సారి ఆసియా కప్‌ను భారత్ సొంతం చేసుకోగలదా? సానులకూతలు, ప్రతికూలతలు ఏంటి ? జట్టు బలాలు-బలహీనతలు ఏమిటి ? అనే అంశాలపై ఓ లుక్కేద్దాం...


బలాలు:

పదునైన బౌలింగ్ : ఇటివల భారత బౌలర్లు విశేషంగా రాణిస్తున్నారు. స్టార్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఈసారి జట్టులో లేకపోయినప్పటికీ బౌలింగ్ విషయంలో ఎలాంటి ఢోకా లేదని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ ఇద్దరూ పవర్ ప్లే తోపాటు డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగల సమర్థులని చెబుతున్నారు. ఇటివల ముగిసిన వెస్టిండీస్ సిరీస్‌లో అర్షదీప్ సింగ్ ప్రదర్శన చూశాక ఆసియా కప్‌లో అతడికి చోటుదక్కకపోతే ఆశ్చర్యపోవాల్సిందేననే విశ్లేషిస్తున్నారు. ఇక స్పిన్నర్ల విషయానికి రవి బిష్ణోయ్ ఆకట్టుకుంటున్నాడు. రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహాల్, రవీంద్ర జడేజా ఖచ్చితమైన లైన్‌తో బౌలింగ్ చేస్తున్నారు. వీరి బౌలింగ్ ఆడడం అంతసులభమేమీ కాదని క్రికెట్ పండితులు గుర్తుచేస్తున్నారు. 


హార్ధిక్ పాండ్యా ఫామ్ : ఐపీఎల్‌(IPL)లో గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)కి నాయకత్వం వహించిన నాటి నుంచి హార్ధిక్ పాండ్యా(Hardik Pandya) అదరగొడుతున్నాడు. ఇటివల ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీస్‌లలోనూ ఆకట్టుకున్నాడు. జట్టే అతడిపై ఆధారపడిందన్నట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లలో విశేషంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్ కంటే బౌలింగ్‌లోనే ఎక్కువగా మెప్పిస్తుండడం మరింత విశేషం. ఇంగ్లండ్, వెస్టిండీస్ సీరిస్‌లలో కీలకమైన వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.


బలహీనతలు :

ఆవేశ్ ఖాన్‌లో స్థిరత్వం లేమి : ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన పేసర్ ఆవేశ్ ఖాన్‌కి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆసియా కప్ జట్టులోనూ సెలెక్టర్లు చోటిచ్చారు. అయితే ఆవేశ్ ఖాన్ స్థిరంగా బౌలింగ్ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకుని నిరాశపరిచాడు. వెస్టిండీస్‌పై రెండో టీ20 మ్యాచ్‌ చివరి ఓవర్‌లో 10 పరుగులను కాపాడలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా ఓటమిపాలైంది. కాబట్టి ఆవేశ్ ఖాన్ విషయంలో ఒకింత ఆందోళన కనిపిస్తోంది.


జట్టులో మంచి ఆప్షన్..

దీపక్ హుడా: ఆసియా కప్‌లో అవసరమైతే దీపక్ హుడా టీమిండియాకి మంచి ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్ కూడా చేయగల సమర్థుడు హుడా. టీ20ల్లో ఇప్పటివరకు 5 ఓవర్లు వేసిన హూడా వికెట్లేమీ తీయలేదు. కానీ అతడి ఎకానమీ రేటు 4.72 శాతంగా ఉండడం విశేషం. ఇటివల సిరీస్‌లలో కూడా చక్కగా బ్యాటింగ్ చేశాడు.


సవాళ్లు - ప్రతికూలతలు :

విరాట్ కోహ్లీ ఫామ్ : ఆసియా కప్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సగటు 60 పరుగులుగా ఉంది. కోహ్లీ అంటే ఎంతో చాటిచెప్పే గణాంకాలు ఇవీ. అయితే ఇటివల ఫామ్‌ లేక తెగఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో త్వరగా వికెట్ సమర్పించుకుంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే కోహ్లీ కనుక ఫామ్‌లోకి వస్తే టీమిండియాకి కొండంత బలమని చెప్పడం సందేహమే లేదు. 


కేఎల్ రాహుల్‌‌కి తగిన సమయంలేమి : ఇటివలే మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ ఆసియా కప్‌లో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు జింబాబ్వేతో వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా  కూడా సెలెక్ట్ అయ్యాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 2022 తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఎలా ఆడుతున్నాడనేది తెలియకుండానే జట్టులో ఆడబోతున్నాడు. కాగా ఆసియా కప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ దాయాది దేశం పాకిస్తాన్‌పై ఆడనుంది. ఆగస్టు 28(ఆదివారం) దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

Updated Date - 2022-08-12T19:47:41+05:30 IST