విప్లవవాదులు ప్రభుత్వ అవార్డులు తీసుకోవచ్చా?

ABN , First Publish Date - 2021-05-17T06:17:44+05:30 IST

విప్లవ వాదులు అంటే, బూర్జువా ప్రభుత్వాలను నిర్ద్వందంగా వ్యతిరేకించేవారు- అనే అర్థంతో ఈ ప్రశ్న వేసుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకూ, ఈ రకం ప్రశ్నకు,...

విప్లవవాదులు ప్రభుత్వ అవార్డులు తీసుకోవచ్చా?

విప్లవ వాదులు అంటే, బూర్జువా ప్రభుత్వాలను నిర్ద్వందంగా వ్యతిరేకించేవారు- అనే అర్థంతో ఈ ప్రశ్న వేసుకుంటున్నాను.  నాకు తెలిసినంత వరకూ, ఈ రకం ప్రశ్నకు, రంగనాయకమ్మ గారు, తన ‘బలిపీఠం’ నవలకి, 1974 నవంబరులో, 6వ ముద్రణకి, రాసిన కొత్త ముందు మాటలో ఇలా ఆత్మ విమర్శ చేసుకున్నారు. ‘‘ఈ కధ, విప్లవ భావాల్ని గాక, సంఘ సంస్కరణనే ప్రధానం చేసిన కధ! అందుకే, దీనికి, ప్రభుత్వ బహుమతికి అర్హత కలిగింది. 1965లో, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, దీనికి బహుమతి ఇచ్చింది. అప్పుడు నాకు, ఈ బహుమతుల సంస్కృతి గురించి ఏమీ తెలియక, దాని మీద వ్యతిరేకత లేక, ఆ బహుమతిని తీసుకున్నాను.’’ - అని! ఈ కొత్త ముందుమాటే, ‘విప్లవవాదులనుకునే వారు ప్రభుత్వ అవార్డులు తీసుకోవచ్చునా’ అనే ప్రశ్నకి దోహదం చేసిన మొదటి సందర్భం అనుకోవచ్చు. ఇదే సమయంలో ఇంకో సంఘటన జరిగింది.  


కాళీపట్నం రామారావు గారు రాసిన, ‘యజ్ఞం’ కధకు,  1974 అక్టోబరులో, ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ అవార్డు ఇస్తున్నట్టు ప్రకటన రావడమూ; వెంటనే రామారావు గారికి, విశాఖ సాహితీ ప్రముఖులు అభినందన సభ జరపడమూ; ఆ సభలో పాల్గొని అందరి అభినందనలూ స్వీకరించిన రచయిత, తర్వాత ఒక నెలకో, రెణ్ణెల్లకో, ఆ అవార్డుని తీసుకుని ప్రజలకు ద్రోహం చేయలేనని, దాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించడమూ; ఇవన్నీ సాహిత్య చరిత్రలో రికార్డు అయిన సంగతులే. అవార్డు ప్రకటన నాటికి, రామారావు గారు విరసానికి ప్రధాన కార్యదర్శిగా వున్నారు. రామారావు గారు, ముందు అభినందన సభలో పాల్గొని, ఆ తర్వాత కొన్నాళ్ళకి అవార్డుని తిరస్కరించాలని అనుకున్నారో, ఆయన గానీ, విరసం వారు గానీ, ఎక్కడా రికార్డు చేసినట్టు లేదు. తర్వాత, 18 సంవత్సరాలకు, 1992లో, అదే ‘యజ్ఞం’ కధకి, ప్రభుత్వమే ఇచ్చిన నంది సినిమా అవార్డుని స్వీకరించారు. గతంలో, ‘ప్రభుత్వం ఇచ్చే అవార్డు తీసుకుని, ప్రజలకు ద్రోహం చేయలేనన్న విప్లవ రచయిత, తర్వాత కాలంలో అవార్డును ఎందుకు తీసుకున్నట్టు? ఆ వివరం లేదు.  అప్పుడు, ‘ఉభయ చర కమ్యూనిస్టులూ జోహార్‌!’ అనే పేరుతో, విశ్వనాథ సత్యనారాయణ గారి శైలిలో, రంగనాయకమ్మగారి వ్యాసం ఒకటి వచ్చింది. ఆ వ్యాసంలో, విప్లవవాదులమనుకునే వారు, ప్రభుత్వ అవార్డును తీసుకోవడాన్ని విమర్శించారు.    


రాష్ట్ర స్థాయి సాహిత్య అకాడమీలు రద్దయ్యాక, ఆ అవార్డులు ఇచ్చే పనిని, తెలుగు విశ్వవిద్యాలయానికి అప్పగించింది ప్రభుత్వం. ఆ అవార్డులు అలా సాగుతూ వుండగానే, కొంచెం పెద్ద మొత్తాల్లో, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు కూడా తెలుగులో కొందరు ‘విప్లవ వాదులు’గా చెప్పుకునేవారికి వచ్చాయి. వారిలో, కె. శివారెడ్డి గారి వంటి కొందరు గతం లోనూ, కొందరు ఇప్పటికీ, విప్లవవాదులుగా గుర్తింపు వున్నవారు. శివారెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి, ఒక పెద్ద పెట్టుబడిదారీ సంస్త (బిర్లా ఫౌండేషన్‌) ఇచ్చిన 15 లక్షల అవార్డుని స్వీకరించారు. విప్లవ దృక్పథం ప్రకారం, పెట్టుబడిదారులు, కార్మికుల నుండి గుంజిన అదనపు విలువనే అవార్డుల మీద కొంత ఖర్చు చేస్తారు.   


ఇప్పుడు, తాజాగా, విప్లవ కవిగా భావించే నిఖిలేశ్వరు గారికి కేంద్ర ప్రభుత్వ అవార్డు రావడం, ‘ఆలస్యం అయినా, ఇప్పటికేౖనా ఈ అవార్డు వచ్చినందుకు సంతోషంగా’ వుందని నిఖిలేశ్వరు గారు అన్నట్టు పత్రికల్లో చదివాక, మళ్ళీ అదే ప్రశ్న వచ్చింది. ఒకప్పుడు సాహిత్య అకాడమినీ, ‘సాహిత్య అగాధమీ’ అని చెండాడిన బృందం లోని కవీ, ఒకప్పుడు విరసం లోనూ, ఆ తర్వాత జనసాహితి లోనూ - ఇలా ప్రయాణాలు సాగించి, ఇప్పటికీ విప్లవ కవిత్వాభిమానుల్లో గుర్తింపు వున్న కవికి బూర్జువా ప్రభుత్వ అవార్డు వచ్చిందంటే, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మేధావుల్ని, విచారణే లేకుండా జైళ్ళలో పెట్టిన ప్రభుత్వం, నిఖిలేశ్వరు గారి ‘అగ్ని శ్వాస’ చదివాక మారిపోయిందా? ఈ మార్పు ప్రభుత్వానిదేనా? విప్లవ వాదుల్ని అది నమ్మడం లేదా?    

జె. యు. బి. వి. ప్రసాద్‌

jubv@yahoo.com


Updated Date - 2021-05-17T06:17:44+05:30 IST