గర్భిణిలు వ్యాయామం చేయొచ్చా! నిపుణులు ఏమంటున్నారంటే!

ABN , First Publish Date - 2022-07-12T16:55:07+05:30 IST

గర్భిణులు వ్యాయామాలకు దూరంగా ఉంటూ ఉంటారు. పూర్వం వ్యాయామాలు చేసే అలవాటు

గర్భిణిలు వ్యాయామం చేయొచ్చా! నిపుణులు ఏమంటున్నారంటే!

గర్భిణులు వ్యాయామాలకు దూరంగా ఉంటూ ఉంటారు. పూర్వం వ్యాయామాలు చేసే అలవాటు ఉన్నవాళ్లు కూడా గర్భంతో వ్యాయామాలు చేయడానికి భయపడుతూ ఉంటారు.. నిజానికి వ్యాయామంతో సుఖ ప్రసవం జరిగే అవకాశాలు మెరుగవుతాయి. అయితే ఎలాంటి వ్యాయామాలు సురక్షితమైనవో వైద్యులను అడిగి తెలుసుకుని, ఆ వ్యాయామాలనే సాధన చేయాలి. 


వ్యాయామంతో కటి కండరాలు, ఎముకలు దృఢపడతాయి. అంతే కాదు. ప్రసవ సమయంలో, ప్రసవం తర్వాత అవసరానికి మించి బరువు పెరిగే సమస్య తప్పుతుంది. ప్రసవ నొప్పులు కూడా తగ్గుతాయి. ప్రసవం తర్వాత కోలుకునే సమయం కూడా తగ్గుతుంది. కాబట్టి ఎలాంటి ప్రసవసంబంధ, పునరుత్పత్వి వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు లేనివారు తేలికపాటి వ్యాయామాలు గర్భిణిగా ఉన్న సమయంలోనూ చేయవచ్చు. 


ఇలాంటి వ్యాయామాలు చేయకూడదు

పొత్తికడుపు మీద ఒత్తిడి పెంచే వ్యాయామాలతో పాటు, పరుగు, గెంతడం లాంటి వ్యాయామాలు చేయకూడదు. ఎంత ఫిట్‌గా ఉన్నవాళ్లైనా సరే వైద్యులను సంప్రతించకుండా ఎలాంటి వ్యాయామాలు చేయకూడదు. జంపింగ్‌ జాక్స్‌, స్క్వాట్స్‌, స్కిప్పింగ్‌, ఎక్కువ బరువులతో కూడిన వ్యాయామాలకు దూరంగా ఉండాలి. గర్భ దశలో శరీరం ఎన్నో మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఒత్తిడిని భరిస్తూ ఉంటుంది. రక్త పరిమాణం పెరగడం, ఫలితంగా రక్తపోటు పెరగడం లాంటి మార్పులూ జరుగుతూ ఉంటాయి. కాబట్టి విపరీతంగా అలసటకు లోను చేసేవి, విపరీతంగా చమటలు పట్టించేవి, ఊపిరి ఆడనంతగా ఒత్తిడికి లోను చేసే వ్యాయామాలకు దూరంగా ఉండాలి.


వాకింగ్‌

ఇది గర్భిణులకు సురక్షిత వ్యాయామం. తక్కువ తీవ్రతతో కూడిన ఈ వ్యాయామంతో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అయితే వేగం సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. నడుస్తున్నప్పుడు ఒక వాక్యం పూర్తిగా మాట్లాడలేకపోతున్నారు అంటే, అవసరానికి మించి శరీరాన్ని కష్టపెడుతున్నారు అని అర్థం. కాబట్టి వేగం తగ్గించి, సౌకర్యవంతంగా ఉండే వేగంతోనే నడవాలి. తొమ్మిదవ నెల నిండేవరకూ కూడా నడక కొనసాగించవచ్చు.


జాగింగ్‌

ఎంతో అనుభవం ఉన్న జాగర్‌ అయితేనే గర్భం దాల్చిన తర్వాత కూడా జాగింగ్‌ చేయవచ్చు. అయితే జాగింగ్‌ వేగం, దూరం మాత్రం తగ్గించుకోవాలి. శరీరం కుదుపులకు గురయ్యేలా జాగింగ్‌ చేయకూడదు. అలాగే నెలలు నిండేకొద్దీ శరీరం బరువు పెరుగుతుంది కాబట్టి జాగింగ్‌ వేగం తగ్గించాలి. జాగింగ్‌ ఇబ్బందిగా అనిపించినప్పుడు ఆపేసి, నడకతో సరిపెట్టుకోవాలి.


ఈత

గర్భిణులకు అన్నివిధాలుగా సురక్షితమైన వ్యాయామం ఇది. పెరిగిన శరీర బరువుతో అలసిన శరీరాలు ఈతతో సేద తీరతాయి. శరీరం తేలికైన భావన కలుగుతుంది. గుండె వేగం పెరిగి రక్తప్రసరణ మెరుగవుతుంది. స్వాంతన కూడా దక్కుతుంది.


యోగా

గర్భం దాల్చినప్పుడు, కండరాలు, లిగమెంట్లు సాగుతాయి. ఈ స్థితికి శరీరం తట్టుకోవాలంటే అందుకు తోడ్పడే యోగాసనాలు వేయాలి. అయితే పూర్వ అనుభవం ఉన్నప్పుడు మాత్రమే అనుభవజ్ఞులైన శిక్షకుల సమక్షంలో యోగాసనాలు సాధన చేయాలి.


వెయిట్‌ ట్రైనింగ్‌

గర్భిణిగా ఉన్న సమయంలో కండర నిర్మాణానికి వెయిట్‌ ట్రైనింగ్‌ చేయవచ్చు. అయితే బరువులను పట్టుకుని వెల్లకిలా పడుకుని చేసే వ్యాయామాలు చేయకూడదు. ఎక్కువ బరువులను ఎత్తే ప్రయత్నం చేయకూడదు. పొత్తికడుపు కండరాల మీద ఒత్తిడి పడే భంగిమల్లో వెయిట్‌ ట్రైనింగ్‌ చేయకూడదు. మరీ ముఖ్యంగా నాల్గవ నెల నుంచి తొమ్మిదవ నెల గర్భం సమయంలో బరువులతో కూడిన వ్యాయామాలకు దూరంగా ఉండాలి. 


కీళ్లు జాగ్రత్త

ప్రసవ సమయంలో వ్యాకోచించడానికి అనువుగా గర్భిణిగా ఉన్న సమయంలోనే కీళ్లు కొంత వదులవుతాయి. ఈ సమయంలో కటి ప్రదేశంలోని కీళ్లు వదులుగా మారతాయి. కాబట్టి కటి ప్రదేశంలో బరువు పడే వ్యాయామాలకు దూరంగా ఉండాలి. యోగా, ఈత, నడక, పైలేట్స్‌ లాంటి వ్యాయామాలకే పరిమితం అవడం మేలు. వీటికి బదులు ఎగరి దూకడం, గెంతడం లాంటి వ్యాయామాలు చేయకూడదు.


సమతౌల్యం జాగ్రత్త

గర్భంతో శరీరం బరువు పెరుగుతుంది కాబట్టి పూర్వంలా శరీరాన్ని బ్యాలెన్స్‌ చేయడం కష్టం. కాబట్టి వ్యాయామం చేసే సమయంలో శరీర కదలికల మీద ఓ కన్నేసి ఉంచాలి. తొట్రుపడడానికి, అదుపు తప్పడానికి వీలున్న వ్యాయామాలు చేయకూడదు. ఒంటి కాలు ఆసరాతో చేసే వ్యాయామాలు చేయకూడదు.


సైక్లింగ్‌

సాధారణ సైకిల్‌ తొక్కడం మంచిది కాదు. దీంతో ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. కాబట్టి స్టేషనరీ సైకిల్‌ తొక్కవచ్చు. ఇది తక్కువ ప్రభావం చూపించినా సురక్షితమైనది కాబట్టి ఈ సమయంలో దీన్ని ఎంచుకోవడమే ఉత్తమం.


వాటర్‌ ఏరోబిక్స్‌

5వ నెల నుంచి ప్రసవం ముందు వరకూ నీళ్లలో నడుము వరకూ మునిగి ఉండి చేసే ఏరోబిక్‌ వ్యాయామాలు మంచివి. కండరాలకు సుతిమెత్తని వ్యాయామం అందించే వాటర్‌ ఏరోబిక్స్‌ వల్ల బడలిక, అలసట కూడా తొలుగుతాయి. శరీరం మీద వ్యాయామంతో పడే ఒత్తిడి కూడా తక్కువే! నీళ్లలో మునిగి ఉండడం వల్ల కీళ్ల మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది. 


గమనిక: ప్రసవ సమస్యలు కలిగి ఉండీ, వైద్యులు పూర్తి బెడ్‌ రెస్ట్‌ సూచనలు పొందిన వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎంత పూర్వ అనుభవం, అలవాటు ఉన్నా వ్యాయామాలు చేయకూడదు

Updated Date - 2022-07-12T16:55:07+05:30 IST