కుడా ఏర్పాటయ్యేనా?

ABN , First Publish Date - 2022-08-19T05:37:50+05:30 IST

కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పుడు కామారెడ్డి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని(కుడా) ఏర్పాటు చేసేందుకు ఆరేళ్ల క్రితం బల్దియా అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. అయినా కుడా ఏర్పాటు ఊసే లేదు. కామారెడ్డి బల్దియాకు 5 కి.మీ నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న 7 గ్రామాలను కలుపుతూ కామారెడ్డి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

కుడా ఏర్పాటయ్యేనా?
కామారెడ్డి పట్టణ ముఖచిత్రం

- పట్టణ డెవలప్‌మెంట్‌ పరిధిలోకి ఏడు గ్రామాలు

- 79.92 చ.కి.మీలకు విస్తరించిన పరిధి

- టౌన్‌ ప్లానింగ్‌పై ప్రత్యేక దృష్టి

- ప్రతిపాదనలు తయారు చేసి ఆరేళ్లు

- ఊసేలేని కుడా ఏర్పాటు


కామారెడ్డి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పుడు కామారెడ్డి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని(కుడా) ఏర్పాటు చేసేందుకు ఆరేళ్ల క్రితం బల్దియా అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. అయినా కుడా ఏర్పాటు ఊసే లేదు. కామారెడ్డి బల్దియాకు 5 కి.మీ నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న 7 గ్రామాలను కలుపుతూ కామారెడ్డి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు గత కలెక్టర్‌ సత్యనారాయణ 2016 అక్టోబరులో ప్రభుత్వానికి లేఖ రాశారు. కామారెడ్డి ఎమ్మెల్యే సైతం ఈ విషయాన్ని గతంలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. లక్షకు పైగా జనాభా ఉన్న కామారెడ్డి బల్దియా ప్రస్తుతం 17 చదరపు కి.మీ విస్తరించి ఉంది. 7 గ్రామాలు సైతం కుడా పరిధిలోకి వస్తే 1,49,682 జనాభా పెరుగనుంది. 79.92 చదరపు కి.మీ లకు విస్తరించనుంది. జిల్లా కేంద్రం ఇప్పుడు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా మారేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపించారు. కామారెడ్డి బల్దియాకు 5కి.మి నుంచి కామారెడ్డి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఇంత వరకు కుడా ప్రతిపాదనలకే పరిమితమైంది. ఇక్కడ గమనించ దగిన విషయం ఏంటంటే ఏ అధికారి అయితే ప్రభుత్వానికి లేఖ రాసారో ఆ అధికారే ఇప్పుడు మున్సిపల్‌ ఉన్నతాధికారిగా చేరి మూడేళ్లు కావస్తోంది. ఇప్పటికీ ఆదేశాలు రాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కామారెడ్డి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పురటిలోనే మగ్గుతోంది.

ఆథారిటీకి ప్రతిపాదనలు

కామారెడ్డి జిల్లా కేంద్రం కావడంతో ఈ  ఆరేళ్ల కాలంలో పట్టణాభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది. లక్షన్నరకు పైగా జనాభా ఉన్న కామారెడ్డి బల్దియా 12.62 చదరపు కి.మీ విస్తరించి ఉండగా టేక్రియల్‌, అడ్లూర్‌, పాతరాజంపేట్‌, రామేశ్వర్‌పల్లి, దేవునిపల్లి, లింగాపూర్‌, సరంపల్లి గ్రామాలు కామారెడ్డి పట్టణంలో విలీనం చేయడంతో గ్రామాల పరిధి విస్తరించడంతో పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వివిధ కట్టడాల కోసం, గృహ సముదాయాల కోసం, వాణిజ్య సముదాయాల కోసం పట్టణాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. పట్టణంలో టౌన్‌ ప్లానింగ్‌ నిబంధనలు అమలు జరుగకపోగా, పక్కనే ఉన్న గ్రామాల్లో రియాల్టర్లు వెంచర్లు పెడుతూ వ్యాపారం చేస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు

నిబంధనలకు విరుద్ధంగా చాలా చోట్ల నిర్మాణాలు సాగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పట్టణం చుట్టు 5 కి.మీ నుంచి 10 కి.మీ లోపల ఉన్న గ్రామాలను బల్దియాలో విలీనం చేసి అర్బన్‌  డెవలప్‌మెంట్‌ అథారిటీగా ఏర్పాటు చేయాలంటూ 2016లో అప్పటి కలెక్టర్‌ సత్యనారాయణ మున్సిపల్‌ అడ్మినీస్ర్టేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీకి లేఖ పంపారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్ల పాటు దీనిపై సుదీర్ఘంగా చర్చ సాగినప్పటికీ ఫైల్‌ పెండింగ్‌లో ఉంటూ వచ్చింది. జిల్లా కేంద్రంను అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా మార్చాలంటూ గతంలో ఐటీ మున్సిపల్‌శాఖ మంత్రి తారకరామారావులను కలిసి ప్రభుత్వ విప్‌ సైతం వినతిపత్రం అందజేశారు. కామారెడ్డి బల్దియా 3018.46 ఎకరాలకు విస్తరించి ఉండగా 7 గ్రామాలను కుడాలో కలిపితే 19,764.51 ఎకరాలకు విస్తరించింది. ఈ మేరకు గత కలెక్టర్‌ పంపిన ప్రతిపాదనల ఆధారంగా మరోసారి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతేనే కామారెడ్డి అర్బన్‌ డెవలప్‌మెంట్‌గా మారే అవకాశాలు ఉన్నాయి.

7 గ్రామాలు కుడా పరిధిలోకి

జిల్లా కేంద్రమైన కామారెడ్డిలో 5 కి.మీ నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న గ్రామాలను కుడాలో కలిపేందుకు ప్రతిపాదనలు పంపించారు. 7 గ్రామాలను కలిపి కామారెడ్డి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో చేరితే కుడా కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికైనా కుడా ఏర్పాటుపై ప్రస్తుతం ఉన్న పాలకవర్గం, కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ చొరవ తీసుకొని హైదరాబాద్‌ పంపించిన కుడా ఫైల్‌ ఎంత వరకు వచ్చిందనే దానిపై దృష్టి సారిస్తే కుడా ఏర్పాటు త్వరగా అయ్యే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్‌గా పనిచేసి వెళ్లిన సత్యనారాయణ అప్పట్లో పంపిన లేఖపై ప్రస్తుతం ఆయనే మున్సిపల్‌శాఖ అడ్మినిస్ట్రేషన్‌ అధికారిగా ఉన్నందున ప్రభుత్వ విప్‌, కలెక్టర్‌ మరోమారు గుర్తుచేస్తే కుడా ఏర్పాటుకు అడుగులు పడవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2022-08-19T05:37:50+05:30 IST