ఆరోగ్య బీమా.. అందుబాటులోకి తేవమ్మా..!

ABN , First Publish Date - 2021-01-24T07:31:10+05:30 IST

కరోనా సంక్షోభంతో ప్రజల్లో ఆరోగ్యంపై ఆందోళన పెరిగింది. వైరస్‌ సోకి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే ఖర్చు తడిసి మోపెడవుతుందన్న భయం పట్టుకుంది. ఈ మహమ్మారే కాదు..

ఆరోగ్య బీమా..  అందుబాటులోకి తేవమ్మా..!

  • బడ్జెట్‌పై మధ్యతరగతి వర్గాల ఆశలు


కరోనా సంక్షోభంతో ప్రజల్లో ఆరోగ్యంపై ఆందోళన పెరిగింది. వైరస్‌ సోకి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే ఖర్చు తడిసి మోపెడవుతుందన్న భయం పట్టుకుంది. ఈ మహమ్మారే కాదు.. ప్రస్తుతం ఏ ప్రాణాంతక రోగమొచ్చినా కార్పొరేట్‌ హాస్పిటళ్లలో చికిత్సకు భారీగా ఖర్చువుతోంది. ఇంట్లో ఎవరైనా తీవ్ర అనారోగ్యం పాలైతే.. పేద, మధ్యతరగతి కుటుంబాలైతే ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి. ఉన్నదంతా ధారపోయాల్సి వస్తోంది. అదీ సరిపోకపోతే అప్పు చేయడమే. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా ఆవశ్యకత మరింత పెరిగింది. నిత్యావసరంగా మారింది. కానీ, ఈ మధ్యకాలంలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం గణనీయంగా పెరగడంతో సామాన్యులకు ఈ పాలసీలు అందుబాటులో లేకుండా పోయాయి. ఈసారి బడ్జెట్లో ఆరోగ్య బీమా ధీమా కల్పించే ప్రకటనలు చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను మధ్యతరగతి వర్గాలు కోరుతున్నాయి.  


జీఎ్‌సటీ 5 శాతానికి తగ్గించాలి: ప్రస్తుతం అన్ని ఆర్థిక పథకాల్లాగే బీమా పాలసీలపైనా 18 శాతం జీఎ్‌సటీ చెల్లించాల్సి వస్తోంది. ఆరోగ్య బీమా అత్యవసరంగా మారిన వేళ ఈ పథకాలపై పన్నును రద్దు చేయడం లేదా నిత్యావసరాలపై వసూలు చేసే 5 శాతానికి తగ్గించాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది. తద్వారా పాలసీదారులపై ప్రీమియం చెల్లింపుల భారం తగ్గుతుంది. అంతేకాదు, పాలసీలు చౌకగా మారితే మరింత మంది హెల్త్‌ కవరేజీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. 


సెక్షన్‌ 80డీ పరిమితి రెట్టింపు చేయాలి: ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలో సెక్షన్‌ 80డీ ప్రకారం.. వ్యక్తులు తమ కోసం లేదా కుటుంబం కోసం చెల్లించే ఆరోగ్య బీమా వార్షిక ప్రీమియంలో రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంది. ఇన్‌పేషెంట్‌ చికిత్స ఖర్చులు భారీగా పెరగడంతో అధిక కవరేజీ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కవరేజీ పెరిగిన కొద్దీ చెల్లించాల్సిన ప్రీమియమూ పెరుగుతుంది. దాంతో ఆరోగ్య బీమా కోసం గతంతో పోలిస్తే అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి. ఇందుకు తోడు ప్రీమియం రేట్లు ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో 80డీ కింద పన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Updated Date - 2021-01-24T07:31:10+05:30 IST