ఆహారంతో అసిడిటీని నియంత్రించవచ్చా?

ABN , First Publish Date - 2020-03-15T17:58:35+05:30 IST

నాకు కడుపులో ఉబ్బరంగా, మంటగా ఉంటుంది. అసిడిటీ అనుకుంటున్నాను. ఆహారంతో నియంత్రించుకోవచ్చా?

ఆహారంతో అసిడిటీని నియంత్రించవచ్చా?

ఆంధ్రజ్యోతి(15-03-2020)

ప్రశ్న: నాకు కడుపులో ఉబ్బరంగా, మంటగా ఉంటుంది. అసిడిటీ అనుకుంటున్నాను. ఆహారంతో నియంత్రించుకోవచ్చా?


- సంతోషి, హనుమకొండ 


డాక్టర్ సమాధానం: ముందుగా మీ సమస్య అసిడిటీనా కాదా అన్నది వైద్యుల సూచనలతో నిర్ధారించుకోండి. ఆహార, జీవన విధానాల్లో లోపాల వల్ల అసిడిటీ వచ్చే అవకాశం ఉంది. సమయానికి తినకపోవడం, ఆహారంలో మసాలాలు, నూనె ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య పెరుగుతుంది. వీరు ఒకేసారి ఎక్కువ మోతాదుల్లో కాకుండా, రెండు మూడు గంటలకు ఓసారి తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. టీ, కాఫీలు కూడా గ్యాస్‌ సమస్యకు కారణాలవుతాయి. కాబట్టి వాటిని నియంత్రణలో ఉంచుకోవడం లేదా మానెయ్యడం మంచిది. స్నాక్‌గా తీసుకునే చిరుతిళ్ళు, బిస్కెట్లు కూడా వీరికి ఇబ్బంది కలిగిస్తాయి. భోజనం చేసేప్పుడు అన్నం తక్కువగా, కూరలు ఎక్కువగా తినాలి. పెరుగు లేదా మజ్జిగను భోజనం పూర్తి చేసిన అరగంట తరువాత తీసుకుంటే సమస్య కొంత తీరుతుంది. పళ్ళు ఉదయం అల్పాహారానికి మధ్యాహ్న భోజనానికి మధ్య లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకోవాలి. రాత్రి నిద్ర వేళకి మూడు గంటల ముందే భోజనాన్ని ముగించాలి. పగలు కూడా తిన్న వెంటనే కునుకు తీయకూడదు. ఉదయం నిద్ర లేచిన గంటా గంటన్నర లోపు అల్పాహారాన్ని తీసుకోవాలి. ఏదైనా ఆహారం సరిపడనప్పుడు కూడా అసిడిటీ లక్షణాల్లానే అనిపిస్తాయి. అందువల్ల వైద్యుల సలహాతో మాత్రమే ముందుకెళ్లడం శ్రేయస్కరం. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - 2020-03-15T17:58:35+05:30 IST