ప్రచారం కూడా చేసుకోనివ్వరా!?

ABN , First Publish Date - 2021-03-06T04:42:12+05:30 IST

సూళ్లూరుపేటలో పోలీస్‌ అధికారుల తీరును నిరసిస్తూ శుక్రవారం తెలుగుదేశంపార్టీ నేతలు, కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ప్రచారం కూడా చేసుకోనివ్వరా!?

సూళ్లూరుపేట, మార్చి 5 : సూళ్లూరుపేటలో పోలీస్‌ అధికారుల తీరును నిరసిస్తూ శుక్రవారం తెలుగుదేశంపార్టీ నేతలు, కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, వేనాటి సతీ్‌షరెడ్డి, బొమ్మన శ్రీధర్‌, కౌన్సిల్‌ అభ్యర్థులు, కార్యకర్తలతో స్టేషన్‌ వద్దకు చేరుకుని తమ పార్టీ అభ్యర్థులు, ఇద్దరు, ముగ్గురితో ప్రచారం చేసుకుంటుంటే ఎందుకు పట్టుకొచ్చి బైండోవర్‌ కేసులు పెడుతున్నారంటూ ప్రశ్నించారు. షార్‌ కాలనీలో ప్రచారం చేస్తున్న ఇద్దరిని పోలీస్‌ స్టేషన్‌కు పట్టుకొచ్చారని, అలాగే గురువారం కోళ్లమిట్ట, సూళ్లూరులలో ఇద్దరేసి ప్రచారం చేస్తుంటే పట్టుకురావడం ఏమిటని నిలదీశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐకి వేనాటి సతీ్‌షరెడ్డికి వాగ్వివాదం జరగడంతో కార్యకర్తలతో కలసి వేనాటి సతీ్‌షరెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సీఐ  అక్కడకు చేరుకుని వారిని దబాయించే ప్రయత్నం చేయడంతో వేనాటి సతీ్‌షరెడ్డికి, సీఐకి మాటామాటా పెరిగింది. దీంతో ఎస్‌ఐ గదిలో కూర్చొని ఉన్న నెలవల సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకొని ‘‘మన అభ్యర్థులను ఈ పోలీసులు ప్రచారం కూడా చేసుకోనిచ్చేటట్లు లేరు. మనకు ప్రచారం కూడా వద్దు.. వెళ్లిపోదాం పదండి.’’ అంటూ నాయకులను వెంటబెట్టుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

ఫ పోలీసులు వేదిస్తున్నారు సర్‌!

సూళ్లూరుపేటలో తెలుగుదేశం అభ్యర్థులు ప్రచారం చేసుకోనివ్వకుండా ఇక్కడ పోలీసులు వేధిస్తున్నారని కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు నెలవల సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. సూళ్లూరుపేట జూనియర్‌ కళాశాల వద్ద ఉన్న కలెక్టర్‌ను టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలసి  స్థానిక సీఐ, ఎస్‌ఐలపై ఫిర్యాదు చేశారు. ఇద్దరు, ముగ్గురితో వార్డుల్లో ప్రచారం చేసుకుంటున్నా పోలీసులు వారిని పట్టుకొచ్చి బైండోవర్‌ చేసుకుంటున్నారని చెప్పారు. స్వేచ్చగా ప్రచారం చేసుకునేలా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. తాను పరిశీలించి చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ చెప్పారు. నెలవలతోపాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మన్‌ శ్రీధర్‌, తిరుపతి పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీ్‌షరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్‌, మాధవనాయుడు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-06T04:42:12+05:30 IST