ఇదేం ‘కర్మ’!

ABN , First Publish Date - 2021-05-10T08:16:46+05:30 IST

కరోనా మరణాన్ని కూడా ఖరీదు చేసేసింది. ఈ మహమ్మారితో ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అనుమానితులు టెస్టుల కోసం...

ఇదేం ‘కర్మ’!

మరణం కూడా అత్యంత ఖరీదు

కరోనాతో చావులోనూ ప్రశాంతత కరువు 

మృతదేహం తరలింపునకు వేలల్లో ఖర్చు 

కరోనా మాటున కాసుల కోసం కక్కుర్తి 

చికిత్స కంటే అంత్యక్రియల ఖర్చే ఎక్కువ 

మితిమీరిన ప్రైవేటు అంబులెన్స్‌ల దోపిడీ 

ప్రభుత్వం చెప్పిన ధరకు మించి వసూళ్లు 

ప్రభుత్వాస్పత్రుల ఎదుటే యథేచ్ఛగా దందా 

అంబులెన్స్‌ నిర్వాహకులే ‘ఆ నలుగురు’

కన్నవారు సైతం కాటికి వెళ్లలేని దుస్థితి

అంత్యక్రియలకు 50వేల వరకు డిమాండ్‌ 

పేద, మధ్య తరగతి కుటుంబాలు విలవిల 


విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ(58)కు కరోనా సోకడంతో హోంఐసొలేషన్‌లోనే ఉంటూ చికిత్స తీసుకుంది. రెండురోజుల క్రితం అకస్మాత్తుగా ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చింది. కుటుంబ సభ్యులు దూరంగా ఉండటంతో పట్టించుకొనేవారు లేక రాత్రి 9.30గంటలకు మృతిచెందింది. మృతదేహాన్ని ఉంచే ఐస్‌బాక్స్‌కు రూ.10వేలు, మర్నాడు శ్మశానానికి తీసుకువెళ్లేందుకు రూ.45వేలు కలిపి మొత్తం రూ.55వేలు డిమాండ్‌ చేయడంతో బంధువులు షాక్‌ అయ్యారు. 


ఏలూరుకు చెందిన ఓ మహిళ(50) విజయవాడలోని ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతదేహాన్ని వెంటనే తీసుకెళ్లాలని ఆస్పత్రి సిబ్బంది ఒత్తిడి చేయడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌ను సంప్రదించారు. మృతదేహాన్ని ఏలూరు వరకూ తీసుకువెళ్లడానికి సాధారణ రోజుల్లో రూ.5వేలు అయ్యేది... ఇప్పుడు కరోనా సమయం కావడంతో రూ.40వేలు డిమాండ్‌ చేశారు. ఆస్పత్రి యాజమాన్యం జోక్యంతో రూ.35 వేలకు బేరం కుదిరింది. 


(అమరావతి/గుంటూరు-ఆంధ్రజ్యోతి) 

కరోనా మరణాన్ని కూడా ఖరీదు చేసేసింది. ఈ మహమ్మారితో ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అనుమానితులు టెస్టుల కోసం... బాధితులు ఆస్పత్రిలో బెడ్‌ కోసం... మరణించిన తర్వాత కర్మకాండల కోసం... ఇలా ప్రతి చోటా ప్రత్యక్ష నరకమే కనిపిస్తోంది. కరోనాతో మరణించడం కుటుంబ సభ్యులకు శాపంలా మారుతోంది. చివరకు చావులోనూ ప్రశాంతత లేకుండా పోయింది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు కరోనా చికిత్స కంటే అంత్యక్రియల ఖర్చే ఎక్కువగా ఉంటోంది. సాధారణ రోజుల్లో ఓ మాదిరి ఖర్చుతో పూర్తయ్యే కర్మకాండలు... నేడు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారాయి. అందులోనూ కరోనాతో మృతిచెందితే అంత్యక్రియల ఖర్చు రూ.వేలు దాటిపోతోంది. మృతదేహాన్ని ఆస్పత్రి/ ఇంటి నుంచి శ్మశానానికి తరలించాలంటే అంబులెన్స్‌కే వేలకు వేలు ధారబోయాల్సి వస్తోంది. ఈ విషయంలో ప్రైవేటు దోపిడీ మితిమీరిపోతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా టెస్టింగ్‌ విషయంలో, బాధితులకు సరిపడా బెడ్‌లు అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం, ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలమయ్యాయి. చివరికి వైరస్‌ బారినపడి మరణించిన వారి మృతదేహాల తరలింపు మాటున అడ్డగోలుగా దోచుకుంటున్నా అధికారులు కట్టడి చేయలేకపోతున్నారు అనడానికి విజయవాడ, గుంటూరు జిల్లాల్లో వెలుగు చూస్తున్న ఘటనలే నిదర్శనం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 


అంతకు మించి... 

ప్రైవేటు అంబులెన్స్‌లకు ప్రభుత్వం ప్రత్యేక ధరలు నిర్ణయించింది. కిలోమీటర్ల ఆధారంగా వారు చార్జి చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ధరలు ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే భారీమొత్తంలో అంబులెన్స్‌ యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. అడిగినంత ఇవ్వకపోతే మారు మాట్లాడకుండా మృతదేహాన్ని అక్కడ వదిలేసి వెళ్లిపోతున్నారు. కుటుంబ సభ్యులకు మరో గత్యంతరం లేకపోవడంతో వారు అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో కూడా ఈ దందా యథేచ్ఛగా నడుస్తోంది. అదేమని ప్రశ్నిస్తే తాము ప్రాణాలకు తెగించి కరోనా మృతదేహాలను తరలిస్తున్నామని, పైగా పీపీఈ కిట్‌, గ్లౌజులు, మాస్క్‌లు, శానిటైజర్లకు భారీగా ఖర్చవుతోందని సమాధానం చెబుతున్నారు. మామూలు రోజుల్లో ఉన్న రేట్లకే ఇప్పుడు మృతదేహాలను తరలించడం కుదరదని స్పష్టం చేస్తున్నారు.


మహాప్రస్థానం వాహనాలు పెంచాలి

ప్రభుత్వాస్పత్రుల్లో మృతి చెందినవారి మృతదేహాలను ఆరోగ్యశాఖ మహాప్రస్థానం వాహనాల ద్వారా ఉచితంగా వారి స్వస్థలాలకు, శ్మశానాలకు తరలిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 80 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కరోనా ఉధృతితో నిత్యం ప్రభుత్వాస్పత్రుల్లో మరణిస్తోన్నవారి సంఖ్య భారీగా ఉంటోంది. ఇలాంటి సమయంలో ప్రైవేటు దోపిడీని అరికట్టాలంటే మహాప్రస్థానం వాహనాల సంఖ్యను పెంచాలని ఆస్పత్రుల సూపరింటెండెంట్లు కోరుతున్నారు. ప్రస్తుతం ప్రతి ప్రభుత్వాస్పత్రికి 5 నుంచి 7 వాహనాలు మాత్రమే కేటాయించారు. ఈ సంఖ్యను 15 నుంచి 20 వరకూ పెంచాలంటున్నారు. దీనివల్ల ఆస్పత్రుల్లో మృతిచెందిన వారివే కాకుండా హోం ఐసోలేషన్‌లో ఉంటూ మరణించిన వారి మృతదేహాలను కూడా శ్మశానాలకు ఉచితంగా తరలించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఈ వ్యవస్థను 104 కాల్‌సెంటర్‌కు అనుసంధానం చేస్తే హోం ఐసొలేషన్‌లో మరణించిన వారి కుటుంబాలకు కూడా మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాలతో ప్రైవేటు దోపిడీకి సైతం అడ్డుకట్ట పడుతుంది. 


అంత్యక్రియల్లో దోపిడీ: కరోనాతో చనిపోయిన మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించడం సామాన్యుల వల్ల కావడం లేదు. తమవారి చికిత్స కోసం రూ. లక్షల్లో వ్యయం చేసిన బంధువులు చివరికి అంత్యక్రియలకు కూడా భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. వైరస్‌ భయంతో మృతులను ముట్టుకునే పరిస్థితి లేకపోవడంతో వేరే వారిని వెతుక్కోవాల్సి వస్తుంది. ఇదే అదునుగా ఆస్పత్రుల వద్ద శవాల కోసం ఎదురుచూసే అంబులెన్స్‌ నిర్వాహకులు రంగంలోకి దిగి ‘ఆ నలుగురు’ పాత్ర తాము పోషిస్తామంటూ రూ.40నుంచి రూ. 50వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆస్పత్రి నుంచి శ్మశానం కూతవేటు దూరంలోనే ఉన్నా ఇదే మొత్తం చెల్లించాల్సి వస్తోంది. కొన్ని శ్మశానాల్లో దహన క్రియలు నిర్వహించుకోవాలంటే రూ.20వేల వరకు అనధికారికంగా చెల్లించాలి. ఇంకా అక్కడ పనివారికి ఒక్కొక్కరికి రూ.2వేలు వంతున ఇవ్వాల్సిందే. అదేమంటే తమ ప్రాణాలకు తెగించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వాదిస్తున్నారు. శ్మశానాల వద్ద దోపిడీని అరికట్టేందుకు అధికారులు రేట్లు నిర్ణయించారు. సాధారణ మరణానికి రూ.2200, కొవిడ్‌ మరణానికైతే రూ.5,100 చెల్లించాలని బోర్డులు పెట్టారు. ఎవరైనా స్వయంగా ఈ కార్యక్ర మం నిర్వహించుకుందామన్నా కట్టెలు కూడా అందుబాటు ధరలో లభించని పరిస్థితి. ఒక శవాన్ని దహనం చేసేందుకు 3టన్నుల వరకు కట్టెలు అవసరం అవుతాయి. దీనికోసం గతంలో రూ.1500 లోపే వెచ్చించాల్సి వచ్చేది. ఇప్పుడున్న అవసరాలకు అనుగుణంగా వీటికీ బ్లాక్‌ మార్కెట్‌ సృష్టించారు. 


జీఎంసీకి సంబంధం లేదు: కమిషనర్‌ 

గుంటూరు నగరంలోని శ్మశానాల్లో అంత్యక్రియ ల ఖర్చులకు, నగరపాలక సంస్థకు ఎటువంటి సంబంధం లేదని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ ఆదివారం తెలిపారు. అంత్యక్రియల ఖర్చుల సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని శ్మశాన వాటిక కమిటీ ప్రతినిధులను ఆదేశించామన్నారు. పాత గుంటూరులో తప్పుగా ము ద్రించిన సూచిక బోర్డును సవరణ చేయిస్తామన్నా రు. అనాథ శవాల అంత్యక్రియలకు జీఎంసీ పూర్తి బాధ్యత వహిస్తుందన్నారు. అంత్యక్రియలకు అధిక మొత్తంలో వసూలు చేస్తే 0863-2345105 టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలన్నారు.

Updated Date - 2021-05-10T08:16:46+05:30 IST