Abn logo
Sep 24 2021 @ 23:11PM

ప్రశాంతంగా ఎంపీపీ ఎన్నిక

పరవాడ ఎంపీపీ పైలా వెంకట పద్మలక్ష్మి, వైస్‌ ఎంపీపీ, కో- ఆప్షన్‌ సభ్యుడిని అభినందిస్తున్న మత్స్యకార నాయకులు

పెందుర్తి రూరల్‌, సెప్టెంబరు 24: పెందుర్తి మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా ఎస్‌ఆర్‌పురం ఎంపీటీసీగా గెలుపొందిన మదుపాడ నాగమణి ఎన్నికయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నాగమణి ఎంపీపీగా, వైస్‌ ఎంపీపీగా గొరపల్లి ఎంపీటీసీగా గెలుపొందిన చిరికి దేముడు ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా మధ్యాహ్నం వైసీపీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పెందుర్తి కూడలి నుంచి మండల పరిషత్‌ కార్యాలయం వరకు ఉరేగింపుగా తరలివచ్చారు. ప్రాంగణంలోని మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు గండ్రెడ్డి మాలతి ప్రమాణానికి హాజరు కాలేదు. మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యునిగా నక్క కనకరాజును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజు, ఎన్నికల అధికారి ఎం.కాళేశ్వరరావు, ఎంపీడీవో మంజులవాణి, అధికారులు పాల్గొన్నారు. ఎంపీపీ, ఉప ఎంపీపీలతో పాటు ఎంపీటిసీలు, పార్టీ నాయకులను ఎమ్మెల్యే అదీప్‌రాజు సత్కరించారు.   

పరవాడ ఎంపీపీగా పైలా 

పరవాడ: పరవాడ మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షుని ఎన్నిక శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం మీటింగ్‌ హాల్లో ప్రిసైడింగ్‌ అధికారి వి.మేషక్‌ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఎంపీపీగా పరవాడ- 1 సెగ్మెంట్‌ నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన పైలా వెంకట పద్మలక్ష్మి పేరును వాడచీపురుపల్లి- 2 సెగ్మెంట్‌ నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన బూస అప్పలరాజు ప్రతిపాదించగా, ముత్యాలమ్మపాలెం- 2 ఎంపీటీసీ సూరాడ బంగార్రాజు బలపరిచారు. మిగతా సభ్యుల నుంచి ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో పైలా వెంకట పద్మ లక్ష్మిని ఎంపీపీగా ప్రిసైడింగ్‌ అధికారి  ప్రకటించారు. అలాగే మండల ఉపాధ్యక్షునిగా రావాడ ఎంపీటీసీ బంధం నాగేశ్వరరావు పేరును కన్నూరు ఎంపీటీసీ గొల్లవిల్లి శ్రీనివాసరావు ప్రతిపాదించగా ముత్యాలమ్మపాలెం- 1 ఎంపీటీసీ బొంది దేవి బలపరిచారు. దీంతో నాగేశ్వరరావును వైస్‌ ఎంపీపీగా పీవో ప్రకటించారు. అంతకు ముందు ఎంపీటీసీలతో పీవో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే కో -ఆప్షన్‌ సభ్యునిగా ముత్యాలమ్మపాలేనికి చెందిన మైలపల్లి అప్పన్నను ఎన్నుకున్నారు. మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ప్రక్రియను పరిశీలించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఇంతియాజ్‌ అహ్మద్‌ మండల కార్యాలయాన్ని సందర్శించారు. ఎన్నిక జరుపుతున్న తీరును పరిశీలించారు. ఎన్నికకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేశారు.   

సబ్బవరం ఎంపీపీగా సూర్యకుమారి

సబ్బవరం : సబ్బవరం మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా గుల్లేపల్లి ఎంపీటీసీగా గెలుపొందిన బోకం సూర్యకుమారి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా ఆరిపాక ఎంపీటీసీ  దాడి వెంకట జాన్సీలక్ష్మీరాణి ఎన్నికయ్యారు. బోకం సూర్యకుమారిని ఎంపీపీగా అంతకాపల్లి ఎంపీటీసీ సభ్యుడు చొక్కాకుల గోవింద ప్రతిపాదించగా అసకపల్లి ఎంపీటీసీ కర్రి అప్పారావు, వంగలి ఎంపీటీసీ గవర తులసీకుమారి బలపరిచారు.  దాడి వెంకట జాన్సీలక్ష్మీరాణిని ఉపాధ్యక్షురాలిగా మలునాయుడుపాలేనికి చెందిన గొర్లి కనకరాజు ప్రతిపాదించగా, సబ్బవరం-2 ఎంపీటీసీ బైలపూడి దేముడుబాబు, తవ్వవానిపాలెం ఎంపీటీసీ బోకం బాలకృష్ణ  బలపరిచారు. అంతకు ముందు నార పాడు శివారు అమ్ములపాలేనికి చెందిన గొర్లి నూకరాజు కో-అప్షన్‌ సభ్యుడిగా  ఎన్నిక య్యారు. అనంతరం ప్రిసైడింగ్‌ అధికారి నాగమల్లేశ్వరరావు ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీలు సభ్యులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు మాట్లాడుతూ మెరుగైన సేవలు అందించి తమను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. అనంతరం ఎంపీడీవో రమేశ్‌నాయుడు అధ్యక్షతన మండల పరిషత్‌ తొలి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.