Abn logo
Sep 20 2021 @ 00:27AM

ప్రశాంతంగా..

శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాలలో ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది

- పరిషత్‌ ఓట్ల లెక్కింపు

- కొన్నిచోట్ల బ్యాలెట్‌ బాక్సుల్లో ఓట్లకు చెద

- ప్రాదేశిక ఎన్నికలను టీడీపీ బహిష్కరణ 

- అధికార పార్టీకి అనుకూల ఫలితాలు 

- బరిలో నిలిచినచోట గట్టి పోటీనిచ్చిన తెలుగు తమ్ముళ్లు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 19) 

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా పది  కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 37 జడ్పీటీసీ స్థానాలకు, 590 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్లను లెక్కించారు. పరిషత్‌ పోరును టీడీపీ బహిష్కరించడంతో.. ఫలితాలు వైసీపీకి ఏకపక్షంగా వెల్లడయ్యాయి. కొన్నిచోట్ల టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోకుండా బరిలో నిలిచారు. అలాంటి స్థానాల్లో వైసీపీ అభ్యర్థులకు గట్టిపోటీనే ఇచ్చారు. శ్రీకాకుళం రూరల్‌, రణస్థలం మండలాల్లో సత్తా చూపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌, ఎస్పీ అమిత్‌బర్దర్‌, జేసీ సుమిత్‌కుమార్‌లు ఆదివారం పరిశీలించారు. శ్రీకాకుళం, పాలకొండ, ఎచ్చెర్లలో కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించారు. శ్రీకాకుళంలో లెక్కింపు కేంద్రంలో చెదల వల్ల పాడైన ఓట్లను పరిశీలించారు. కొన్ని కేంద్రాలను ఎస్పీ అమిత్‌బర్దర్‌ పరిశీలించి సీఆర్పీసీ 144 పక్కాగా అమలవుతున్నదీ లేనిదీ తనిఖీ చేశారు. ప్రధాన ప్రతిపక్షం ఎన్నికలను బహిష్కరించడంతో ఫలితాల కోసం ఎక్కడా సందడి లేదు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థులు కూడా పెద్దగా సంబరాలు చేసుకోలేదు. 


రెండు చోట్ల రీ పోలింగ్‌  

జిల్లాలో హిరమండలం మినహా.. మిగిలిన 37 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఓట్లకు చెదలు పట్టిన కారణంగా ఆమదాలవలస, పొందూరు, కవిటి, గార మండలాలకు సంబంధించి విజేతల లెక్క రాత్రి వరకు తేలలేదు. రాత్రి 11.30 గంటల సమయంలో ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 37 స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. 

ఇక ఎంపీటీసీలకు సంబంధించి జిల్లాలో 667 స్థానాలు ఉండగా, 66 ఏకగ్రీవమయ్యాయి. మరో 11 చోట్ల అభ్యర్థులు మరణించారు. దీంతో 590 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 585 మంది అభ్యర్థులు గెలుపొందారు. 495 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. 81 స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. బీజేపీ, జనసేన చెరో ఒక స్థానం, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు పది స్థానాల్లో గెలుపొందారు. ఓట్లకు చెదలు పట్టడంతో.. ఆమదాలవలస మండలం కట్యాచారిపేట, మందస మండలం అంబుగాం ఎంపీటీసీ స్థానాల ఫలితాలు లెక్క మాత్రం తేలలేదు. దీంతో ఈ రెండు స్థానాలకు త్వరలో రీపోలింగ్‌ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. 

  

పార్టీల వారీగా పోలైన ఓట్లు....

పరిషత్‌ ఎన్నికల్లో పార్టీల వారీగా పోలైన ఓట్లు పరిశీలిస్తే...  జిల్లాలో అత్యధిక ఓట్లు వైసీపీకి దక్కాయి.  రెండో స్థానంలో టీడీపీ నిలిచింది. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 10,87,528 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైసీపీకి 6,47,398, టీడీపీకి 2,65,305, ఇండిపెండెంట్లకు 19,143, జనసేన -9,206, సీపీఎం -1645, సీపీఐ -132, బీజేపీ - 3417, బీఎస్పీ - 558 ఓట్లు లభించాయి.